తోట నాగేశ్వరరావు....           16-May-2020

2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు –

 

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 13

 మాటల్లో చెప్పలేనంత ప్రయోజనకర మహోద్యమం –

 ఈ 2000 రోజుల స్వచ్చ – సుందర చల్లపల్లి శ్రమదాన ఉత్సవం 

అవనిగడ్డ APSRTC డ్రైవరుగా పనిచేస్తున్న నా పేరు తోట నాగేశ్వరరావు. నారాయణరావు నగర్ లో నివాసంఒక శుభోదయాన 5.00 కాకముందే – హైదరాబాద్ నుండి అవనిగడ్డ బస్సు తోలుతున్న నేను విజయవాడ రోడ్డులో తొలిసారి అట్టల మిల్లు దగ్గర సుమారు 40 మంది సందడి చేస్తూ – అందులో ఒకాయన ఏదో తగలబెడుతుంటే చూసి, “వీళ్ళు చల్లపల్లి కేదో కీడు చేస్తున్నారని పొరపడ్డాను. ఆ తరువాత డ్యూటీ ముగించుకొని వస్తుంటే ఆ రోడ్డంతా శుభ్రంగా – విశాలంగా – కొత్తగా అనిపించి, అక్కడి వాళ్ళను ప్రశ్నిస్తే – స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలు ఆ రోజు శుభ్రం చేసిన రోడ్డనీ, చాలా రోజుల్నుండి వాళ్ళా పని చేస్తున్నారనీ తెలిసింది. ఎట్లాగైనా సరే – ఒక్క రోజైనా వాళ్ళ కార్యక్రమం చూసి కలిసి పనిచేయాలనుకొన్నాను గాని, ఐదారు రోజుల దాక కుదరక, తరువాత వెళితే – అదంతా వింతగా అనిపించింది. అవనిగడ్డ రోడ్డులో పెద్ద రైసుమిల్లు దగ్గర శ్రమదానంలో నేను కూడా పాల్గొన్నాను.

          మా నారాయణరావు నగర్ ప్రధాన వీధిలో శుభ్రం చేసి, వీళ్ళు చాలా మొక్కలు నాటినప్పుడు డ్యూటీతో కుదరక పాల్గొన లేక బాధ పడ్డాను గాని, 500 వ రోజు కార్యకర్తలంతా ఊరంతా ప్రదర్శనగా తిరిగినప్పుడు పాల్గొని – ఇక అప్పుడు నిర్ణయించుకొన్నాను - ఉద్యోగ విధి లేని ప్రతి రోజు ఇందులో పని చేయాలని.

          501 వ రోజున డాక్టరు డి.ఆర్. కె. ప్రసాదు గారి నిర్ణయంతో నేను “జై స్వచ్చ సుందర చల్లపల్లి” నినాదాలను 3 మార్లు పలికాను. ఇక అప్పటి నుండి 400 – 500 కిలోమీటర్ల జర్నీ డ్యూటీ లేనప్పుడల్లా – అంటే వారంలో 4 రోజులైనా “స్వచ్చ చల్లపల్లి” డ్యూటీ కూడ చేస్తూనే ఉన్నాను.  

          చల్లపల్లి లో అందమైన శ్మశానాలు, చెత్త సంపద కేంద్రం, అందమైన పార్కు, ఏరోడ్డు చూసినా పచ్చదనంతో – పూల మొక్కలతో కళకళలాడటం – మురుగు నిలవక పారే డ్రైనులు, రహదారి పూల వనాలు, ఇంటింటి చెత్త కలెక్షన్లు, చక్కని బస్ స్టాండు, ఎక్కడెక్కడి ప్రముఖులో ఈ చల్లపల్లి కార్యకర్తల శ్రమదానాన్ని పొగడడం ఇవన్నీ స్వచ్చ ఉద్యమం పుణ్యం కాకపోతే మరేమిటి?

          30 వేల మంది చల్లపల్లి గ్రామస్తుల్లో నూటికి నూరు మందిలో ఈ స్వచ్చ – సుందర భావాలింకా రాలేదనే కొరత తప్ప – అసలు నా జీవితంలో ఈవూరినెప్పుడైనా ఇంత బాగా చూశానా? నా సోదర కార్యకర్తలకూ, డాక్టరు దంపతులకు ఎన్ని మార్లు కృతజ్ఞతలు  తెలిపినా చాలదు. 25 - 30 ఊళ్లను ప్రేరేపించిన స్వచ్చ చల్లపల్లి ఉద్యమంలో నా వంతు బాధ్యత తప్పక నెరవేరుస్తాను.

- తోట నాగేశ్వరరావు,

స్వచ్చ చల్లపల్లి కార్యకర్త

14.05.2020.