కోడూరు (చెక్ పోస్టు) వేంకటేశ్వరరావు,....           17-May-2020

2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు 

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 14

చాల గ్రామాలు అర్ధం చేసుకొని – అనుసరిస్తున్న

మా 2000 రోజుల స్వచ్చ సుందర చల్లపల్లి ఉద్యమం.

నేను కోడూరు వేంకటేశ్వరరావు నండి. వేకువ జామున గంటల స్వచ్చంద సేవా సమయంలో మా కార్యకర్తలు చెక్క్ పోస్ట్ బాబాయ్” అనే పిలుస్తుంటారు. విజయవాడ రోడ్డు ప్రక్కన కోమలానగర్ లో ఉంటాను. ఈ స్వచ్చ కార్యకర్తలు వందో – రెండొందల రోజులో గాని, రోడ్డు మీద పెద్ద పెద్ద వాళ్ళతో మీటింగు పెడితే వెళ్ళి చూశాను గాని, పుట్టిన రోజు – పెళ్లి రోజు లాగ ఇంత పెద్ద ఉత్సాహమేంటా అని ఆలోచించాను. కూచిపూడి లో నా చెక్ పోస్టు ఉద్యోగ సమయంలో – అక్కడ గూడ ఇట్లాంటి మీటింగు పెట్టి – అక్కడ మాట్లాడేది మా చల్లపల్లిలోని పెద్ద డాక్టరంట – అనివిని వెళ్ళి DRK గారు చెప్పిందంతా విన్నా, ఆలోచించి, వీలైనప్పుడల్లా వేకువనే శ్రమదానంలోకి వచ్చాను.

            అందరూ ఒక్కసారి రిటైరైతే – నేను రెండు సార్లు రిటైరై – ఇప్పుడు నా వయసు 65 ఏళ్ళు – ఇక పూర్తిగా అన్ని రోజులూ వస్తున్నాను. అసలు ఇదేం ఉద్యమం సార్? “ఎవరింట్లోనో పెళ్లి పనుల్లాగ – రోడ్ల మీద అశుద్ధాలు, చెత్తలు, మురుగ్గుంటల్లో పూడికలు, శ్మశానాల్లో – బస్టాండుల్లో ఇంతమంది ఇన్ని వేల రోజులుగా – ప్రతిఫలమాశించకుండ ఎందుకు చేస్తున్నార్రా” అని మొదట్లో అనుకొనేవాడిని. ఒక విషయం గట్టిగా చెప్పగలనండి. ఈ ప్రపంచంలో ఏ దేశంలోలేని కులం జాడ్యం మన సొసైటీలో ఉందా, దీనెమ్మ – కులం ఎవడికైనా కూడు పెట్టిద్దా? చల్లపల్లి ని ఇట్లా బాగు చేస్తుందా? మా స్వచ్చ శ్రమదానం అంటే ఏఒక్కరిలోను, ఈ దరిద్రపు కులం – మతం – రాజకీయం – ప్రాంతం తేడాలేవీ కనిపించని ఎడారిలో ఒయాసిస్సండి బాబు!

        మా డాక్టర్లిద్దరికి చేతులెత్తి దండం పెట్టాల్సిందే! వాళ్ళ ఎంత డబ్బు, సమయం, శక్తియుక్తులు, ఐదారేళ్ళ తమ జీవితాలను ఈ ఊరి కంకితం చేశారు గదా! ఊళ్ళో కొందరు అమాయకులు ఈ డాక్టర్లకు కోట్లు కోట్లు డబ్బొచ్చిపడుతుందనీ, కార్యకర్తలందరికీ లోపాయకారీగా నెల నెలా ముట్ట చెబుతారనీ, లేకపోతే ఈ 40 – 50 మంది చీకట్లో ఊరి కోసం ఇంత చెత్త – మురికి పనులు చేస్తారా అని మొదట్లో చెప్పుకొనేవాళ్లండి. నిజం నిలకడ మీద తెలవక తప్పదుగదండి.

            నా వరకు నేను యధార్ధం చెపుతున్నాను  మా డాక్టర్ల అండ – సోదర కార్యకర్తల సహచర్యం – శ్రమదాన సందడి  - ఈ మాత్రం నాకు నచ్చిన శారీరక శ్రమ లేకపోతే - 12 ఏళ్ల క్రిందట గుండె చికిత్స చేయించుకున్న నేను బహుశా నాలుగేళ్ల క్రిందటే చచ్చేవాణ్ణి! నా ఒంటికీ, మనసుకు ఆరోగ్యాన్నిస్తున్న ఇంత మంచి స్వచ్చ కార్యక్రమానికి నేనెలా దూరమౌతాను?

- కోడూరు (చెక్ పోస్టు) వేంకటేశ్వరరావు,

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త

15.05.2020