వేముల శ్రీనివాస్....           18-May-2020

 2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు 

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 15 

సమాజ సక్రమ గమనానికొక చక్కని దిక్సూచి

2000 రోజుల స్వచ్చ చల్లపల్లి ఉద్యమం.

            నేను వేముల శ్రీనివాస్ ని, స్థానిక విజయా జూనియర్ కళాశాలలో 7 సంవత్సరాలుగా సివిక్స్ లెక్చరర్ ని. గత 1300 రోజులుగా మన గ్రామ స్వచ్చంద శ్రమదానంలో పాల్గొంటున్నాను. పెదకళ్లేపల్లి రోడ్డు ను స్వచ్చ కార్యకర్తలు శుభ్రం చేసి, మొక్కలు నాటాక- అదే రోడ్డు లో 6.30 తరువాత నడక కోసమో, వ్యవసాయ పనుల కోసమో వెళ్తూ- ఒక రోజు ఎండుతున్న బిళ్ల గన్నేరు మొక్కలకు అక్కడి మట్టి కుండతో నీళ్లు పోశాను. నా మిత్రులు కొడాలి మురళి, యోగా శిక్షకుడు శ్రీహరి అంతకుముందు నుండే ఈ గ్రామ సేవలో పాల్గొనేవాళ్లు. నేను కూడ కాస్త ఆలస్యంగానైనా పాల్గొంటున్నందుకు చాల సంతృప్తి గా ఉంది.

            రోజులు గడిచే కొద్దీ ఈ ఉద్యమం ఎంత ప్రత్యేకమైందో- ఈ నాటి సమాజానికిదెంత ఆవశ్యకమో గ్రహించాను.  ఇక, అక్కడి నుంచి, నేను ఏ క్లాసులోనైనా కనీసం 5 నిముషాల పాటైనా పిల్లలకు స్వచ్చ చల్లపల్లి ని గురించీ, జన విజ్ఞాన వేదిక, అది నడిపే మెడికల్ కాంపుల గురించీ చెపుతుండేవాడిని. మా కళాశాల విద్యార్థులు అధిక సంఖ్యలో ఈ శ్రమదానంలోకి రావడం నాకెంతో ఆనందదాయకం. విజయవాడలో జరిగే (ఇంటర్) స్పాట్ వాల్యుయేషన్ లో అన్నిచోట్ల నుండి వచ్చే లెక్చరర్స్ కు దీన్ని వివరిస్తే “ ఇంత నిస్వార్థంగా సమాజం కోసమనీ ఇంత మంది, అదీ వేకువ నాలుగు గంటలకే రోడ్లు ఊడ్చి, డ్రైన్లు శుభ్రం చేస్తున్నారంటే నూ – అది కూడా కొందరు మహిళలు ఈ పనులు చేస్తున్నారంటేనూ ఎవరూ నమ్మకపోతే-వాట్సాప్ లో ఫోటోలు చూపించేవాడిని.

            చల్లపల్లి స్వచ్చోద్యమ పెద్దలు మన గౌరవనీయ డాక్టర్ లు ఈ ఉద్యమాన్ని కంటికి రెప్పలా చూచుకొంటూ- వందల కొద్దీ చిన్న-పెద్ద మీటింగులతో- రోజువారీ సమీక్షా సమావేశాలతో - ఆనంద ఆదివారాలతో- మీడియా వారి ప్రోద్భలంతో గ్రామ ప్రజానీకం హృదయాల్లోకి ఈ స్వచ్చ-సుందర-ఆరోగ్య-ఆనంద స్పృహను ఎక్కిస్తూ, శ్మశానాలను, కర్మల భవనాలను బస్ స్టేషన్ లను, అన్ని రహదార్లను, వీధులను నానాటికీ ఆహ్లాదమయం చేస్తూ- ఆలోచించ గల్గిన ప్రతి గ్రామస్తుడినీ చైతన్య పరుస్తూ ఇంత బ్రహ్మాండమైన ప్రయత్నం చేస్తుంటే-చల్లపల్లిలో ఇప్పటికే ఎంత మార్పు రావాలి? వందలాది గా విద్యార్ధులు, వేలాదిగా ఊరి జనులు సహకరించాల్సింది కాని ఎందుకో అలా జరగలేదు. ఇది నాకు చాలా మార్లు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది.

ఐతే- ఇందరు గృహిణులు, ఉద్యోగులు, డాక్టర్లు, లాయర్లు, రాజకీయులు, అధికారులు, పాత్రికేయులు, కొందరు విద్యార్ధులు దీనికి సహకరించి, పాల్గొని ధన, వస్తు సహాయాలందించి, గ్రామంలో తెచ్చిన మార్పులు కూడ తక్కువేం కాదు. ఏదేమైనా ఇప్పటికీ వచ్చిన సామాజిక మార్పుకు సంతోషిద్దాం.  రావలసిన దానికి ఇంకా ఇంకా ప్రయత్నిస్తూనే ఉందాం!

            అసలీ ఉద్యమం మీద తొలి రోజుల్లో ఎన్నెన్ని ఆరోపణలు, అపవాదులు, అపోహలు, వచ్చాయి? అవన్నీ నిలవక నిజం నిగ్గు తేలిందంటే- దానికి కారణం ఇందరు కార్యకర్తల సుదీర్ఘ – నిస్వార్ధ- శ్రమదానమే, స్వచ్చోద్యమ కారుల సహనమే!

            నా వరకు నేను శక్తి ఉన్నంతవరకూ ఈ ఆదర్శ స్వచ్చోద్యమాన్ని బలపరుస్తూనే ఉంటాననీ, ఒక చల్లపల్లి పౌరుడుగా ఆది నా కర్తవ్యమనీ తెలుసు!     

వేముల శ్రీనివాస్,

చల్లపల్లి.

15.05.2020.