గోళ్ల సాంబశివ రావు....           19-May-2020

 2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు –

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 16

2000 రోజుల స్వచ్చోద్యమం- నా అనుభవాలు.

            నా పేరు గోళ్ల సాంబశివ రావు – వయస్సు 65 సంవత్సరాలు. గోపాలకృష్ణ షోరూంతో మాది బట్టల వ్యాపారం, కోమలా నగర్ నివాసం. ఈ అన్ని విషయాల కన్న “నేను కూడ స్వచ్చ చల్లపల్లి కార్యకర్తననీ, నా కుటుంబంలోని పది మంది మీ ఈ గ్రామ స్వచ్చ- శుభ్ర- సుందరీకరణలలో పని చేశామనీ చెప్పు కోవటంలోనే నాకు సంతృప్తి!

అంత మాత్రాన ఈ ఉద్యమ బాధ్యతలు మోసేవాడినని గాని, తొలి రోజు నుండీ దీనిలో పని చేశాననీ గాని చెప్పలేను. ఈ ఉద్యమ కర్తలైన మన డాక్టర్లిద్దరూ,  నిత్యం చెమటలు చిందించే వందమందికి పైగా కార్యకర్తలు వేకువ జామునే వీధులు ఊడుస్తున్నారనీ ఒక రోజు మా షాపుల ముందు కూడ శుభ్రం చేశారనీ తెలిసి, కొంత మధనపడ్డాను. మళ్లీ ఒక రోజు ఉదయం వెళ్లి, నా దుకాణం ముందే ఇద్దరు మహిళలు, ఒక డాక్టరు శుభ్రం చేయడం చూసి, సిగ్గు పడిపోయి ఆ మరునాటి నుండి-అంటే సుమారుగా 370-380 వ రోజు నుండి- మధ్యలో కొద్ది రోజులు మినహా 1600 రోజులు పైగా గ్రామంలో అన్ని చోట్ల- అన్ని పనుల్లో పాల్గొన్నాను. ఈ అన్ని రోజులూ హాయిగా- సంతృప్తిగా గడిచాయి. ఈ మధ్య అంటే సుమారొక 10 నెలల నుండి మాత్రం నా శ్రమదానం కుంటుబడుతున్నది.

గడచిన నాలుగేళ్లు పైగా ఈ స్వచ్చ గ్రామ బాధ్యతలలో పాల్గొనడం ఒకసారి గుర్తు చేసుకొంటే- నేను, నా తమ్ముళ్లు, నా భార్య, ఇద్దరు పిల్లలు, మనుమరాళ్లు, కోడళ్లు- ఒకరి తర్వాత ఒకరు ఈ ఉద్యమంలో వచ్చి కలవడం వింతగానే అనిపిస్తున్నది.  మా అందరి పుట్టిన రోజు వేడుకల్ని ఉదయం 6.00 గంటలకే ఇంటి నాలుగు గోడల నడుమ కాక- సేవా మూర్తులైన స్వచ్చ కార్యకర్తల సమక్షంలోనే  జరుపుకొనడం, అందరికీ కేకులు, అల్పాహారాలు తినిపించడం, ఆ సందర్భం గానే  మనకోసం మనం ట్రస్టుకు  చందాలివ్వడం, ఇందరు నిస్వార్థ కార్యకర్తల అభినందనలందుకోవడం- ఇవన్నీ ఎంత మరువరాని మధురానుభూతులో గదా! ఊరి శుభ్ర సౌందర్యాలతో బాటు- ప్రధాన వీధి దుకాణాలన్నీ ఒకే రంగులో, డిజైన్ లో ఉంటే  చాలా అద్భుతంగా ఉంటుందని, నేనే ప్రతిపాదించి డాక్టరు గారిని, శాస్త్రి గారిని ఒప్పించి, దుకాణాల యజమానులతో సంప్రదించి, కొన్నాళ్లు ప్రయత్నించాము గాని, కొన్ని కారణాలతో అది తాత్కాలికంగా వాయిదా పడింది. నా ఆయుర్వేద చిట్కాలకోసం వాలంటీర్ మిత్రులు సంప్రదించడం కూడా నాకు బాగా గుర్తే.

ఈ నడుమ కొన్నాళ్ల నుండి నాకు కొంత బద్దకం పెరిగింది. దాన్ని అధిగమిస్తాననీ, ఇకపై క్రమం తప్పకుండ పాల్గొంటాననీ నమ్మకం ఉంది .

పది మందిలో కలవలేని, సరిగా మాట్లాడలేని బలహీనత నివారణ కోసం మా అబ్బాయి విజయ్ మాత్రం మానకుండా వెళ్తున్నాడు. ఈ ఉద్యమమొక సామాజిక ప్రయోజనకరమనీ, ఆదర్శమనీ నా విశ్వాసం. చల్లపల్లి పౌరుడుగా, స్వచ్చ కార్యకర్తగా ఈ అద్భుత కార్యక్రమం పట్ల గర్విస్తాను, ఎప్పటికీ సహకరిస్తూనే ఉంటాను.

- గోళ్ల సాంబశివ రావు,

16.05.2020.