సజ్జా ప్రసాదు....           20-May-2020

2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు –

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 17

2000 రోజుల స్వచ్చోద్యమంతో- గ్రామంలోను, నాలోను పరిణామాలు.

            అసలు ఊరు నాగాయలంకే గాని, 50 ఏళ్ల పైగా నేనుంటున్నది చల్లపల్లే (కమ్యూనిస్టు బజారు సమీపం). వయసు 69 ఏళ్లు. ఈ స్వచ్చ సుందర చల్లపల్లి కోసం నా శ్రమదానం వయస్సు 1900 రోజులు.  ఇంత మంచి ప్రయోజనకరమైన స్వచ్చోద్యమానికి నేను ఏ కొంచెమైనా ఇచ్చాననుకొంటే - అది కొంత తృప్తే గాని, అంతకు నాలుగు రెట్లు ఈ ఉద్యమమే నాకిచ్చిందనేది వాస్తవం! అందరికన్న కొంత భిన్నంగా నేను- అది నా పనైనా, ఊరి పనైనా- కాస్త సీరియస్ గానే చేస్తాను. వేకువనే ఈ రెండు గంటల కార్యకర్తల శ్రమదానం కేవలం స్వచ్చందమైనా - ఈ ఐచ్చిక గ్రామ కృషిలో కూడ ఆనాటికి అనుకొన్నట్లుగా పని జరగనపుడు కొంత విసుగుగా - మాట కరకుగా వచ్చినా సరే - సోదర కార్యకర్తలెవరూ ఏమీ అనుకోరు.

            ఈ సుదీర్ఘ స్వచ్చ ఉద్యమం నాతో సహా కార్యకర్తలందరికీ సహనం నేర్పింది, మాలో కొందరికి సమయపాలన, క్రమ శిక్షణ, ఐకమత్యం, త్యాగం వంటి జీవిత విలువల్ని బోధించింది! కనిపించేవి కాక, భౌతికంగాను - ఆలోచనల పరంగాను ఈ 30 వేల జనాభా ఉండే పెద్ద గ్రామంలో సానుకూల మార్పులు వచ్చాయి. స్వచ్చ భారత్- స్వచ్చాంధ్ర పిలుపులిచ్చినది ప్రధాని-ముఖ్య మంత్రులే గాని - బైట నుండి మెచ్చు కొనేది పెద్ద నాయకులే గాని- అందుకోసం పిలుపునిచ్చి మర్చిపోక, మంచి ప్రణాళికలు రచించి, తాము బొత్తిగా తీరికలేని పెద్ద డాక్టర్లు అయిఉండి కూడ- చెప్పిన ఆదర్శాన్ని ఆచరిస్తూ ఇంతమంది కార్యకర్తలకు మోడల్ గా  నిలుస్తున్నది మాత్రం డి.ఆర్.కె - పద్మావతి గార్లే సుమా! మరి - 2015 రోజులు - రెండు లక్షల పని గంటలు - ఇంత సువిశాల గ్రామ వికాసం కోసం – తమ సొంతానికి కీర్తి – మోక్షం - డబ్బులాంటివి ఆశించక దీక్షతో - సమష్టి ప్రయత్నంతో ముందుకు సాగుతున్న నా సోదర కార్యకర్తలు ఏ మహనీయుల కన్నా - ఏ మహర్షుల కన్నా – ఏ త్యాగమూర్తులకన్నా - ఎందులో తక్కువ?

            చల్లపల్లి లో ఈ పుణ్యాత్ముల అంకిత భావంలో, పరోపకార చింతనలో, సృజనాత్మక సేవలలో – సగం కాదు గదా, పదో వంతైనా ప్రతి గ్రామం వారిలో ఉంటే చాలు - దేశంలోని 6 లక్షల పై చిలుకు ఊళ్లు, సంవత్సరం తిరక్కుండానే మారిపోవా?

            నేను, మా ధ్యాన మండలి వాళ్లు యోగా మాష్టారు గారి పిలుపుతో - బుద్ధ ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా జరిగిన స్వచ్చోద్యమ 50 రోజుల కార్యక్రమంలోకి వచ్చి – బాగా ఆలోచించాం. అప్పుడప్పుడు గోళ్ల వేంకటరత్నం గారు గుర్తు చేస్తుంటే – 100 రోజుల నాటికి మేం పూర్తి స్థాయి స్వచ్చ కార్యకర్తలమైపోయాం.

            ఆ తరువాత స్వచ్చోద్యమ నిత్య ఖర్చుల కోసం – ఆలోచించాను.  నా 6 ఎకరాల వ్యవసాయ- 3 లక్షల ఆదాయంలో నాకుటుంబ  ఖర్చులు పోను, ప్రతి ఏటా మిగులు లక్షను మనకోసం మనం ట్రస్టుకు ఇస్తున్నాను. ఇందుకు నా భార్య భారతిగాని, పిల్లలు గాని సంతోషించారు తప్ప అభ్యంతర పెట్టనందుకు సంతోషం.

            రెండు వేలు కాదు - మూడు, నాలుగు వేల రోజుల కావచ్చు - ఇంత ఆదర్శవంతమైన స్వచ్చోద్యమానికి నేనెప్పటికీ అంకితుడినే! ఐనా ఈ రెండు గంటల ఉదయ కాలపు శ్రమదానంతో మాకు పోయేదేముంది – చిన్న చిన్న శారీరక, మానసిక అసంతృప్తులు తప్ప?...  

- సజ్జా ప్రసాదు,

స్వచ్చ సుందర కార్యకర్త,

17.05.2020.