భోగాది వాసుదేవరావు ....           21-May-2020

2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 18

 

            తెల్లవారు  ఝామున లేవడం,

            ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించడం,

            చక్కటి సాహిత్యంతో కూడిన సంగీతం వినటం,

            మనసుకు నచ్చిన పనిలో లీనమవటం,

            మధ్యమధ్యలో ఆత్మీయులు పలకరించడం,

            ఆనందంతో మనసు పులకరించడం,

            ఆ పై అందరితో కలిసి కాఫీ సేవించడం,

            సహచరులతో  పిచ్చాపాటి ముచ్చట్లాడటం,

            చివరగా సందేశాత్మక నినాదాలివ్వటం,

            నూతనోత్సాహంతో రోజూ వారి కార్యక్రమాలను ప్రారంభించటం

            ఇదే కదా మనసుకు ఆహ్లాదం,మనిషికీ ఆరోగ్యం,

            ఇందుకే నా జీవితంలో స్వచ్చ కార్యక్రమం ప్రత్యేకం.

            ఇంతకీ నన్ను పరిచయం చేసుకోలేదు కదా! నా పేరు భోగాది వాసుదేవరావు. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిని, స్వచ్చ కార్యక్రమంలో సుందరీకరణ బృంద సభ్యుడిని.

            మొదటి నుండి జనవిజ్ఞానవేదికతో అనుబంధం ఎక్కువ. శారీరక శ్రమతో చేసే చేసే పని అనుభవం తక్కువ. స్వచ్చ కార్యక్రమం ప్రారంభపు రోజుల్లో పని కష్టం తెలిసొచ్చింది. కానీ ఇష్టంతో చెయ్యడం వలన చీపురు, కత్తి, సుత్తి పార, పలుగు, గొర్రు మొదలగు పనిముట్లతో పనిచెయ్యడం నేర్చుకున్నా!      

            “గొప్ప పనులు అంటూ ప్రత్యేకంగా ఉండవు, మనమే చేసే పనిని గొప్పగా మార్చుకోవాలి” అన్నట్లు స్వచ్చ కార్యక్రమంలో ప్రతి పని గొప్పదే. ఎందుకంటే కార్యకర్తలు ప్రతి పనిని గొప్పగా చేస్తారు మరి.

            నేను గమనించిన మరొక ముఖ్య అంశం ఏమిటంటే కార్యకర్తల స్వీయ క్రమశిక్షణ. గత ముఖ్యమంత్రి గారు కార్యకర్తలను అభినందించుటకు చల్లపల్లి విచ్చేసినపుడు, కార్యకర్తల క్రమశిక్షణను చూసి వారి సెక్యూరిటీ అధికారులు మెచ్చుకోవడం నాకింకా గుర్తుంది.

            చిన్నప్పటి నుండి చల్లపల్లి తెలిసిన వ్యక్తిగా పద్మావతి హాస్పిటల్ రోడ్, 1 వ వార్డులోని బాలికల హాస్టల్, డంపింగ్ యార్డ్, బైపాస్ రోడ్, పాగోలు రోడ్, నాగాయలంక రోడ్, నడకుదురు రోడ్, విజయవాడ రోడ్, బస్టాండు మరియు భారత లక్ష్మి రైస్ మిల్ రోడ్ లు ... స్వచ్చతకు, పచ్చదనానికి ప్రతీకలుగా స్వచ్చ కార్యక్రమం వలననే అద్భుతంగా మారినవి అనుటలో ఎటువంటి సందేహం లేదు.        

మార్పు అనేది

            ముందుగా హేళన చేయబడుతుంది

            తరువాత ప్రశ్నించబడుతుంది

            ఆ పైన విమర్శించబడుతుంది

            వేగంగా తిరస్కరించబడుతుంది

            చివరగా అంగీకరించబడుతుంది

పై వాక్యాలు స్వచ్చ ఉద్యమానికి చక్కగా సరిపోతాయ్. మొదటగా చీపురు పట్టుకున్న రోజున హేళనలు, తరువాత ప్రశ్నలు, ఆ పైన విమర్శలు, కొందరిచే తిరస్కరణలు, దేశ విదేశాల్లో ఉద్యమాన్ని గుర్తించిన తరువాత చివరగా అందరిచే అంగీకరించబడింది.

            అందుకే దేనికైనా సమయం రావాలి! అప్పటి వరకు సహనం కావాలి! డా. డి. ఆర్. కె. ప్రసాదు గారు ఎప్పుడూ ఒక మాట అంటారు

            “ఆచరణ మాత్రమే ప్రభావశీలంగా ఉంటుందని”

స్వచ్చ సుందర చల్లపల్లి అనే చక్కని వేదికను అందించినందులకు వారికి ధన్యవాదములు తెల్పుతూ, 2 వేల రోజులుగా స్వచ్చ కార్యక్రమం నిర్విఘ్నంగా, ద్విగ్విజయంగా అడుగులు వేస్తున్నందుకు ఆనందంతో ... అభినందనలతో...

- భోగాది వాసుదేవరావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త,

17.05.2020.