బొమ్మిశెట్టి ఆత్మ పరబ్రహ్మం....           31-May-2020

2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు -

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 28

అది తప్ప – అంతం లేని మా 2026 రోజుల స్వచ్చ – సుందర ఉద్యమం.

           స్వార్ధరహితులైన మా స్వచ్చ కార్యకర్తలందరికీ – మా డాక్టర్ దంపతులకు నమస్కారం. అసలు ఈ స్వచ్చ చల్లపల్లి లో నివసించడమే మా అదృష్టం! కులభేదాల రోత తెలియని – చాతనైనంతగా ఊరికే చిన్న మేలైనా చేయాలని తప్ప – దొరికినకాడికి ఊరి సొమ్ము నోక్కేయాలని తట్టని – ఇంత మంది నిత్య శ్రమదాతలు ఇన్ని వేల రోజులుగా ఒకే మాట మీద – ఒకే గమ్యంతో కలిసి ముందుకు పోతున్న ఊరు ఇది తప్ప ఇంకేదైనా ఉందేమో తెలియదు! లక్షలు లక్షలు తమ కష్టార్జితాన్ని,  తమది కాని గ్రామం కోసం వెచ్చిస్తున్న ఇద్దరు ప్రధాన వైద్యులు గాని, లక్షల కొద్దీ గంటల తమ శ్రమను, సమయాన్ని, సాధ్యమైనంత ధనాన్ని ఊరి కోసం వెచ్చించే వందకు పైగా కార్యకర్తలు కూడ మరెక్కడా ఉండకపోవచ్చు! నేను చెప్పేవన్నీ నిజాలనేందుకు గత నాలుగైదేళ్ళ నుండి ఈ గ్రామంలో నానాటికీ వస్తున్న మార్పు లే సాక్ష్యం! ఎక్కడెక్కడి దాతలో తమ లక్షల కొద్దీ విరాళాలను నిశ్చింతగా పంపుతున్నారంటేనే - ఈ ట్రస్టు నిర్వాహకుల నైతిక స్ధాయి ఎంతటిదో తెలియడం లేదా!

            6  సంవత్సరాల నాటి మురికి కొట్టుకొన్న – కళా విహీనమైన – రోడ్ల మీద మురుగు ప్రవహించిన చల్లపల్లికీ, కనీసం రెండు వీధుల్లో భూగర్భ మురుగు వ్యవస్ధ గల – ప్రతి వీధిలో పచ్చని చెట్లు, పూల మొక్కలు కనువిందు చేస్తున్న స్వచ్చ చల్లపల్లికీ ఎంత తక్కువ కాలంలో ఎంత మార్పో గమనించారా? ఇప్పుడు గ్రామ రహదారులు చాలచోట్ల రంగు రాళ్ళతో విశాలంగా – శుభ్రంగా – కనిపిస్తున్నవి. అన్ని ఊళ్ళకీ ఆదర్శప్రాయమైన శ్మశానం ఉన్నది. ఒక్కసారి చూస్తే ప్రయాణికులు మరిచిపోలేని పూల తోటల, సాంప్రదాయక కుడ్య చిత్రాల – స్ఫూర్తిదాయక నినాదాల RTC బస్ ప్రాంగణమున్నది. గ్రామ ప్రవేశక సప్త మార్గాలలో మనోహర పూలవనాలున్నవి. ఇతర గ్రామస్తుల కోసం స్వచ్చ –  సుందర పబ్లిక్ టాయిలెట్లున్నవి. సెల్ఫీ పాయింట్లు, చక్కని కర్మకాండల భవనాలు, రోజూ తడి – పొడి చెత్త సేకరణ బళ్లూ, కొందరి దాతృత్వాలూ, చాలా భవనాలు, చాల వరకు స్వచ్చంగా మారుతున్న మనసులూ – ఇవన్నీ ఉన్నవి చల్లపల్లిలో మరి !

            కాని, ఇంకా గ్రామమంతటా భూగర్భ మురుగు వ్యవస్థ లేదు; ఇంటికొకరం చొప్పున రోజూ గంట సమయం ఊరి కోసం శ్రమించే పద్ధతి రాలేదు; స్వచ్చ సైన్యం మీద ఆధారపడకుండ గ్రామ సర్వతోముఖ స్వచ్చ ఉద్యమాన్ని స్వయంగా నడపగల పంచాయితి లేదు. ప్రతి ఇంటిలో – ప్రతి హృదయం లో నూరు శాతం స్వచ్చ భావనలింకా నిండలేదు. “చిన్న కాగితం ముక్కైనా రోడ్డు మీద ఎందుకు పడి ఉండాలి” అనే పంతం కూడా గ్రామస్తుల్లో ఇంకా పూర్తిగా రానేలేదు- ఇవన్నీ వచ్చే దాక చల్లపల్లి లో స్వచ్చోద్యమం ఉండక తప్పదు మరి! అందుకు పౌరుల- ప్రభుత్వాల సహకారం కూడ పొందగలగాలి!

            మా ధ్యాన మండలి గురువు గోళ్ల వేంకట రత్నం గారు నాలుగైదు సార్లు ప్రేరేపించినా స్వచ్చంద శ్రమదానం లోకి నేను వెళ్లలేక పోయాను. ఒకనాడు రాత్రి 8.00 సమయంలో కొందరు కార్యకర్తలు బందరు రోడ్డు లోని నా దుకాణం ముందే ఊడుస్తుంటే- అందులో ఒకామెను చూపి,  నాప్రక్క షాపాయన – ఆమె డాక్టరు పద్మావతి గారు అని తెలియజేస్తే  – తలదించుకొని “ ఇదేం ఖర్మ రా నాయనా- నా కొట్టు ముందు ఈ పెద్ద డాక్టరమ్మ చెత్తనంతా ఊడుస్తుంటే....” అని మధన పడి, తర్వాత ఉదయమే - 101 వ రోజని గుర్తు- వెళ్లి కార్యకర్తలతో కలిశాను.

            బలీయమైన అడ్డంకి వస్తే తప్ప-మానకుండా వెళ్తూనే ఉన్నాను. మా అబ్బాయి వేంకట కృష్ణ ప్రసాదు , మనుమళ్లు వేద సాయి సంకల్ప్, సాయి మయాంక్ ల పుట్టిన రోజుల సందర్భంగా స్వచ్చ ఉద్యమానికి తోచినంత చందాలిస్తునే ఉన్నాను!

            నా గ్రామం ఎప్పటికీ ఇలాగే స్వచ్చ-శుభ్ర- సుందరంగా ఉండాలనీ-ఎప్పటికైనా సంపూర్ణ స్వచ్చ-సుందర మనోహర భారత దేశాన్ని గూడ చూగలననీ- అందుకోసం ఉడతా భక్తిగా సహకరిస్తూనే ఉంటాననీ విన్నవించుకొంటూ....

నా కోమలా నగర్ లో – చల్లపల్లి లో – నా స్వచ్చ సుందర ఉద్యమంలో నివసిస్తున్న, కొనసాగుతున్న నా అదృష్టాన్ని గుర్తు చేసుకొంటూ .....

బొమ్మిశెట్టి ఆత్మ పరబ్రహ్మం

చల్లపల్లి

29.05.2020.