దేసు శ్రీ మాధురి....           02-Jun-2020

2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు -

 

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 30

 స్వచ్చ – సుందర చల్లపల్లికి- నా వంతు, నా నివాళి.

ఏదో మాట వరుసకు, యాదాలాపంగా మొదలై, ముక్కుతూ-మూలుగుతూ-కాళ్లీడ్చుకొంటూ గమ్యం లేకుండా నడిచేది కాదండి ఈ స్వచ్చోద్యమం. బలమైన నేపధ్యం, సరైన తాత్వికత పునాది, ఎప్పటికప్పుడు చర్చోప చర్చల సమీక్షలు, వాటితో నిర్దేశించుకొనే లక్ష్యలూ, అలక్ష్యాల కోసం ప్రణాళికలూ, వాటి అమలుకోసం చిత్త శుద్ధితో ప్రయత్నాలూ... ఇంత కథ ఉంది దీని వెనక! నా బోటి సాంప్రదాయ కుటుంబాల మహిళలు కూడ దీనిలో ఇమిడిపౌయి వేలాది దినాలుగా ఆనందంగా శ్రమిస్తున్నారంటేనే ఇది పకడ్బందీగా నిర్వహిస్తున్న కార్యక్రమం తప్ప- ఆషామాషీ వ్యవహారం కాదని అందరం గ్రహించాలి.

తొలి దశలో ఎన్ని అవహేళనలు, అపవాదులు, అపార్థాలు వచ్చినా తట్టుకొని, కోట్లాది రూపాయల ఖర్చు అవుతున్నా(దాతల సౌజన్యంతో) పెట్టుకొని, శ్మశానాల- కర్మల భవనాల- బస్ ప్రాంగణాల- రహదారి వనల-పచ్చని చెట్ల అందమైన పూల మొక్కల-స్వచ్చ-శుభ్ర-సుందరీకరణలు పూర్తి చేసుకొని, సుస్థిరంగా 2026 రోజుల స్వచ్చోద్యమ ప్రస్థానం సాగడం  నిత్యం చూస్తున్న నాకే సంభ్రమంగా ఉంటున్నదీ! ఒక్కసారైనా చూసి పాల్గొనక, కేవలం వినే వాళ్లకసలు నమ్మశక్యంగా ఉంటుందా?

100 రోజులు- 500, 1000 రోజులు గడుస్తూ- ఊరిలో ఈ ఉద్యమంతో నెమ్మదిగానే కావచ్చు, స్థిరంగా మంచి మార్పులు జరుగుతూ- దీని ప్రేరణతో నియోజక వర్గమంతా- రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల స్వచ్చోద్యమాలు వివిధ రూపాలలో మొదలౌతూఉంటే విని, చూసీ ఆనందించాను తప్ప 900 రోజులు దాక ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయాను. ఒక్కసారి వచ్చాక మాత్రం మానలేకపోతున్నాను. నా కూతురు జాహ్నవి, మా ఆయన దేసు ప్రభాకర రావు కూడ నన్ను త్వరలోనే అనుసరించారు. నేను దేసు శ్రీ మాధురిని. అసలు ఊరు గుడివాడ. 18 ఏళ్ల నుండి (స్వచ్చ-సుందర) చల్లపల్లి నివాసినిని!

ఈ స్వచ్చ ఉద్యమానికీ, ఈ గ్రామనికీ మా కుటుంబం నిర్వహించిన ఉడత సాయం వివరించాలంటే:

పద్మావతి మేడం గారి సుందరీకరణం గ్యాంగ్ లో నేనూ ఒకదాన్ని. సుందరీకరణ యజ్ఞం కోసం చిత్ర లేఖన కళకు కాస్త పదును  పెట్టి , గోడల్ని, కల్వర్టుల్ని, సుందరీకరిస్తుంటాము. మా ముగ్గురి జన్మదిన వేడుకలుగాని, వైవాహిక స్పురణలు గాని, ఈ స్వచ్చ కుటుంబీకుల నడుమ నే జరుగుతుంటాయి. ఆ సందర్భాలలో ప్రభాకర రావు గారు ఐదొందలో, వెయ్యో స్వచ్చోద్యమ చందాలిస్తూనే ఉంటారు. స్వచ్చోద్యమ వేడుకల కోలాటాల్లో, సాంస్కృతిక విషయాలలో జాహ్నవి, నేనూ తప్పక పాల్గొంటాం.

మా స్వచ్చ చల్లపల్లి మీద జొన్నవిత్తుల కవులూ, సుద్దాల కవులూ కట్టిన పాటలు నందేటి శ్రీనివాస్ పాడినవి వింటూ శ్రమ తెలియకుండ పని చేసుకుపోతాం. ఈ దైనందిన నిత్య కృషితో ఉత్తేజితురాలైన రామారావు మాష్టారు రోజూ పాటలూ- పద్యాలూ వ్రాస్తుంటారు. ఇంతకీ- ఇందులో ఎవరెవికెవరు ప్రేరకులో- ఎవరు ప్రేరితులో చెప్పటం కష్టం.

అసలామాటకొస్తే- “ కార్యకర్తల నిరంతర కృషి, పట్టుదలే నాకు ఇన్స్పిరేషన్” అనే మా డాక్టర్ DRK గారంటారు. కాదు- “కాక్టర్ గారి వల్లే ఇంతగా ప్రేరణ పొందుతున్నాం” కార్యకర్తలంటారు.  ఈ పంచాయతీదేముంది గాని, ఈ చల్లపల్లి స్వచ్చ కుటుంబం స్ఫూర్తి ఇంకా - ఇంకా పెరిగి, ఊరూరికి వ్యాపించి, అన్ని ఊళ్లూ, ప్రజలూ, పంచాయతీలూ, కలిసికట్టుగా  రెండు మూడేళ్లు శ్రమదానం చేస్తూ పోతే- ప్రభుత్వాలు సకాలంలో స్పందించి సహకరిస్తే- దేశంలో ప్రతి గ్రామం ఈ చల్లపల్లి వలె స్వచ్చ సంస్కృతిని పెంచితే - సమస్త దేశం ఆరోగ్యం ఆనంద తాండవం చేయడా...” అని మా కవి గారు ఊహించి రాసింది నిజమైపోతుందని ఆశిస్తూ...

ఈ స్వచ్చ సుందర ఉద్యమానికీ, నా కుటుంబానికీ ధన్యవాదాలు తెలుపుతూ....

శక్తి వంచన లేకుండా నేనూ మెట్టిన నా చల్లపల్లి మెరుగుదలకు సహకరిస్తానని ప్రకటిస్తూ....

- దేసు శ్రీ మాధురి, స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త

  28.05.2020.