కొండపల్లి బాబూరావు....           03-Jun-2020

 2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు -

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 31

స్వచ్చ సుందర ఉద్యమానికి తిరుగేలేదు! ఇంత కన్న ఏ ఊరికైనా గొప్ప దారే లేదు !

            అన్ని గ్రామాల – అందరు కార్యకర్తలకు నా హృదయ పూర్వక నమస్కారమండీ. మనమంతా గట్టిగా నమ్మి – ఇన్ని వేల రోజుల్నుండి ఒక పవిత్ర కార్యంగానూ, మన ఊళ్ళు బాగుపడటానికి ఇంతకు మించిన దగ్గర దారేదీ  లేదని నమ్ముతూనూ చేస్తున్నామే – తోచిన కాడికి స్వచ్చంద శ్రమదానం – ఇదే మన్నా నువ్వూ నేనూ కనిపెట్టిన కొత్తదేమీ కాదు గదండి. గాంధీ మహాత్ముడేనాడో మనం పుట్టక ముందే చెప్పి – చేసి చూపించిన దేనండి. అదేదో పురాణంలోనూ, NTR  సినిమాలోనూ ఒక పాట నాకు బాగా గుర్తున్నదండి.

            “జననీ జన్మభూమిశ్చ – స్వర్గాదపీ గరీయసీ

            నీతల్లిమోసేది నవమాసాలే – ఈ పుడమి తల్లి మోయాలి కట్టెకాలేదాకరా....”

అని పాడినట్లు – మనం 2030 రోజుల్నుండి వానో  - మంచో – చలో – ఎండో – చెమటో పట్టించుకోకుండ రెండేసి గంటల పాటు శ్రమదానం చేస్తున్నామంటే – ఎవరికి చేస్తున్నాం? మనం పుట్టి – పెరిగి – బతుకుతున్న మన వూరికే గదా – అంటే మనకే గదా! మరి ఈ మాత్రానికే – నేనోదో నావూరిని తెగ ఉద్ధరించానను కోవాలా? నా డూటీ నేను చేశాను అనుకోవాలా? అయితే – ఒకటి మాత్రం ఒప్పుకోవాలండి – ఏదో నూటికి  5 – 6 గురు తప్ప – నిజాయితీగా – “ఇందులో నాకేంటి?” అని ఆలోచించకుండ ఈ దేశంలో ఎవడి డ్యూటీ ఎవడు చేస్తున్నాడు సార్? మరి అట్లా చూసుకొంటే మాత్రం – మన ఈ వేకువ జాము కార్యక్రమం సూపరేగదండి?

            ఇంకో విషయం గూడ ఉందండి. ఏ కాలంలో ఐనా ప్రతి చోట  సమాజంలో దొంగతొత్తుకొడుకులూ, దగుల్భాజీలు ఉంటూనే ఉంటారు గాని, ఎన్ని తరాల నుండి – ఎంత మంది పుణ్యాత్ములు త్యాగాలు చేసి, మంచి సాంప్రదాయాలు ఏర్పరిచి, పాటుబడితేనో – ఆ ఫలితాలన్నీ మనం ఇప్పుడనుభవిస్తున్నామని ఒప్పుకోవాలండి! మరి మన పాటికి మనం గూడ ఏదో ఒక మంచి మన ఊరికి చేయొచ్చుగదా?

            ఇట్లా అనుకొనే ఈ చల్లపల్లి స్వచ్చ కార్యక్రమంలోకి నేను 100 రోజులు గడచిన తర్వాత ఎప్పుడో గాని వచ్చాను. నేనప్పుడు ఘంటసాలలో BSNL లో పనిచేస్తూండే వాడిని. కొండపల్లి బాబూరావు ని. గంగులవారి పాలెం నా అసలు నివాసం కానీ, పిల్లల చదువు కోసం చల్లపల్లి వచ్చి ఉంటున్నాను. కొన్నాళ్ళ తర్వాత నాగాయలంక కు బదిలీ అయిన దగ్గర్నుంచైతే క్రమం తప్పకుండా వస్తున్నాను. “ఈ బాబూరావు ఏ మురుగు తూములో కైనా – ఎంత ఎత్తు గోడ మీదకైనా ఎక్కి – చెత్తంతా లాగేస్తాడు....” అని మా స్వచ్చ కార్యకర్తలు అంటుంటారు గాని, నాకదేమంత కష్టమనిపించదు. ఈ ఊరు కాని వాళ్ళు – పెద్ద పెద్దోళ్ళు చల్లపల్లి మేలు కోసం ఎంతెంత త్యాగాలో చేసేస్తుంటే – నా పనులేం గొప్పండి?

            ఇక్కడ చెప్పొచ్చో – లేదో గాని, నాకు రెండు ప్లానులున్నాయి సార్! 1) తొందర్లో మా పిల్లాడి పెళ్లి చేశాక – గంగులవారిపాలెం వెళ్లి నా సొంతింట్లో ఉండి, అక్కడ కుర్రాళ్లను పోగేసి, చల్లపల్లి కంటే బాగా గంగులవారిపాలెం ను తయారుచెయ్యాలి. 2) జూన్ నెలలో నా పెన్షన్ ప్రయోజనాలన్నీ అందాక – ఇన్ని వందల రోజులుగా నా మనసుకు సంతృప్తి కలిగించిన చల్లపల్లి స్వచ్చ ఉద్యమానికేదో ఒక సాయం చెయ్యాలని!

           మనం శాశ్వతం కాదండి. మన ఊరూ – దేశం శాశ్వతం. అందుకనే ఈ ఊరికి మన శ్రమదానం కూడ జరుగుతూనే ఉండాలని నా కోరికండి. మనం అది గుర్తుపెట్టుకొంటే చాలు సార్!

- కొండపల్లి బాబూరావు,

   అర్ధాంతర విశ్రాంత BSNL ఉద్యోగి,

   చల్లపల్లి  - 30.05.2020.