లక్ష్మీ సెల్వం....           04-Jun-2020

 2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు -

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 32

మా ఊళ్ళో 2030 రోజుల ఉద్యమం

అందులో నా ప్రవేశం – కృషి – అనుభవాలు

లక్ష్మి - లక్ష్మీసెల్వం - అనే కంటే పద్మావతి ఆస్పత్రి రిసెప్షన్ లక్ష్మి అంటే బాగా గుర్తొస్తాను. ఉండేది రామానగరం. పాతికేళ్ళ నుండి కేరాఫ్ అడ్రస్ మాత్రం ఆసుపత్రే! 2030 రోజుల నాడు ఈ శ్రమదాన కార్యక్రమం మొదలైనప్పుడు ఎక్కువ మంది ఆస్పత్రి సిబ్బందిలాగే నేనూ తెగ బాధపడిపోయాను – కేవలం అవగాహనా లోపం! - “మాకు ఆరాధ్యుడైన ఇంత పెద్ద డాక్టరు - రామకృష్ణ ప్రసాదు గారు వేకువ 4.30 కు వెళ్ళి రోడ్లు ఊడవడమేమిటి? ఊరి మురుగు కాల్వలు బాగు చేయడమేమిటి? కావాలంటే ఇప్పటి కన్నా ఎక్కువగా పేదోళ్ళకి ఉచిత వైద్య సేవలు ఆయన వృత్తి గాని - చీపుళ్లతో - పారలతో - దుమ్ములో - బురదలో ఆయన పని చేయడమేమిటి?”..... ఇదిగో ఇలా ఆలోచించాం. మేడమ్ గారితో చెప్పి - ఎట్లైనా మాన్పించమని అడిగాను. అంతే తప్ప - ఆయనదెంత గట్టి నిర్ణయమో - అది దేశానికెంత అవసరమో మాకప్పుడు అర్ధం కాలేదు.

          మా సంగతికేం గాని, ఊళ్ళో మరి కొందరు కూడ కావాలనో, ఉబుసుపోకకో జనవిజ్ఞాన వేదిక వాళ్ళను ఎగతాళి చేశారు. అపార్ధకారులు కాలక్రమేణా మనస్పూర్తిగానూ, మేము సైతం 60 – 70 రోజుల తర్వాత, సదరు ఈ ఉద్యమంలోకి వచ్చేశాం. – నా హాజరు, నా వంతు శ్రమదానం వారానికి రెండు రోజులే. నా ఇతర డ్యూటీలు ఆ మేరకే అనుమతిస్తున్నాయి. ఏ స్వచ్చోద్యమ వేడుకలోనైనా – ముఖ్యంగా టిఫిన్ల – భోజనాల సమయాల్లో ఐతే మాత్రం నాకు చేతినిండా పనే! రకరకాల పర్యవేక్షణలు నా వంతే!

          మా పెద్దమ్మాయి అఖిల మా ఆస్పత్రిలోనే కొన్నాళ్లు పనిచేసినప్పుడూ - ఆ తరువాతా ఈ వేకువ స్వచ్చ శ్రమదానంలోకి వచ్చేది. చిన్న కూతురు తేజస్విని కూడా చాలా మార్లు వచ్చింది. ఇక మా ఆయన సెల్వం గారు చాలా రోజులు పాల్గొన్నారు గాని, కష్టించి ఏ పనైనా చేశారు గాని తప్పని సరై ఆయనను మాన్పించవలసి వచ్చింది. గొర్రుతోనూ - ముఖ్యంగా కత్తితో పనిచేస్తూ ఆయన పిచ్చి చెట్లను అదే పనిగా అరవకొట్టుడు కొడుతూ శ్రమించి శ్రమించి అలిసిపోవడమే అందుకు కారణం!

          తొలుత పొరబడ్డా - ఈ స్వచ్చ చల్లపల్లి శ్రమదాన ఉద్యమం ఎంత విశిష్టమైందో నాకేనాడో తెలిసి వచ్చింది. ప్రపంచమూ, ఐక్యరాజ్యసమితే గుర్తించిన ఈ కార్యక్రమానికి నా సర్టిఫికెట్ ఎందుకు చెప్పండి! అసలీ నాలుగు మాటలు కూడ చెప్పకనే పోదును. మా గురువు గారు – రామారావు మాస్టారు వారం రోజుల్నుండి ఒత్తిడి చేయడంతో తప్పక ఈ మాత్రమైనా మౌనం వదిలాను. నా ఒక్క దాని ఉద్దేశం ఏముంది? ఇంచుమించు నా సోదర కార్యకర్తలందరిదీ కూడ ఇలాంటి అభిప్రాయమే ఐ ఉంటుంది – “ఇదొక మంచి పని, ఊరి బాగు కోసం ఒకే రకం ఆలోచన ఉన్న ఇంత మందిమి ఒక పద్దతి ప్రకారం – ప్లాను ప్రకారం పనిచేసుకొంటూ పోగా పోగా – ఈ చల్లపల్లి గ్రామంలో తొలుత ఏ ఒక్కరూ ఊహించలేనన్ని మంచి మార్పులు వచ్చాయి. నాదే ముంది – ఈ కార్యకర్తల్లోనూ – బైట ప్రాంతాలవారిలోనూ ఎందరు ఈ ఊరి కోసం ఎంతెంత డబ్బు త్యాగం చేశారో గుర్తు చేసుకొంటే చాలు – కళ్లు చెమరుస్తాయి గదా – ఉన్న ఊరి కోసం ఏ కాస్తయినా – రోజుకొక గంటైనా శ్రమ పడడం తప్పు కానే కాదు గదా? మరి నేను గాని, మా ఇతర కార్యకర్తలు గాని ఈ మంచి పని ఎందుకు మానాలి? నేనేమో మొదట మా డాక్టరు గారుని చూసి బాధపడితే – అకారణంగా కొందరు అపోహపడితే – ఈ ఉద్యమాన్ని చూసి మరికొందరు నవ్వితే – చివరకు ఈ నాపచేనే మంచి పంట పండిందా? లేదా?

- లక్ష్మీ సెల్వం – రామానగరం

   31.05.2020.