కోట పద్మావతి....           05-Jun-2020

 2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు -

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 33

నా దృష్టిలో – 2032 రోజుల స్వచ్చ – సుందర ఉద్యమం అనగా....

          చిన్నప్పుడు భారతదేశ చరిత్రను “పానిపట్ యుద్ధానికి ముందు – దాని తర్వాత” అని చదువుకొన్నట్లుగా – నేను పుట్టి –పెరిగి – చదువుకొని = ఉద్యోగాలు చేసిన – నివసిస్తున్న ఈ చారిత్రాత్మక చల్లపల్లి చరిత్ర కూడ – సామాజిక పరంగా 2014 నవంబర్ 12 కు ముందు – ఆ తరువాత అని గుర్తించాలన్న మాట!

            అరె! చూస్తూ చూస్తూ ఉండగానే ఆరేళ్లు గడిచిపోయి, అలనాటి పేరు గొప్ప చల్లపల్లి కాస్తా బహిరంగ మలవిసర్జనలు మాయమైపోయి, రోడ్ల ఆక్రమణలు తగ్గిపోయి, ఏ కాస్త వీలున్న చోటుల్లో నైనా అందమైన రంగు రాళ్ళు అమరి, కొన్ని కొన్ని చోట్ల గజానికి  రెండేసి పూల మొక్కలు, ఠీవిగా నీడనిస్తున్న చెట్లు, రహదారి వనాలు, స్వచ్చ శుభ్ర సుందర శ్మశానాలు, డంపింగ్ యార్డూ, మళ్ళీ మళ్ళీ చూడదగిన బస్ స్టాండు ప్రజాసౌకర్యార్ధం అక్కడక్కడా స్వచ్చ – సుందర పబ్లిక్ టాయిలెట్లూ, ఎటు నుండి ఊళ్ళోకి ప్రవేశించడానికైనా ఆహ్లాదకరమైన 7 రోడ్లు – ఇవన్నీ నేను పని కట్టుకొని వర్ణించడమెందుకు – రోజూ గ్రామంలోని 25 – 30 వేల మంది జనానికీ బైట నుండీ వచ్చి వెళ్ళే 3 – 4 వేల మందికీ కనువిందు చేస్తున్నవే గదా!

            మరి ఇవన్నీ ఎలా ప్రత్యక్షమైనట్లు? వీటన్నిటికీ ఎవరు బాధ్యత వహించారు? పంచాయతీ నా, రాష్ట్ర ప్రభుత్వామా? పై నుండి పిలుపులిచ్చే రాజ్యాధినేతలా? ఇంతకాలం చల్లపల్లి స్వచ్చోద్యమం దేశమంతా మారు మ్రోగిపోయిన తరువాత ఈ గ్రామస్తులే కాదు – ఎవరైనా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేస్తారు. పంచాయతీ, ప్రభుత్వాల పాత్ర అసలు లేదనలేం గాని, ఈ బ్రహ్మండమైన – సానుకూలమైన – ఆదర్శమైన మార్పులన్నిటికీ మూలకారణాలు ఎంత కాలమైనా చల్లారని స్వచ్చ ఉద్యమమే, దాని వెనుక దన్నుగా నిలిచిన మనకోసం మనం ట్రస్టే! వీటికంటే గూడ – కష్టమనికాక – ఇష్టమని తలపోస్తూ ఒక్కటంటే ఒక్కరోజు గూడ మానక 2032 రోజులుగా – ఎవ్వరూ ఇష్టపడనే పడని – చాలా మంది చీదరించుకొనే  పారిశుద్ధ్య పనులను చేస్తున్న నా సోదర స్వచ్చ కార్యకర్తల బృందమే ఈ మార్పులన్నిటికీ అసలైన మూల కారణం!

            ఏ ఒక్క రోజు కూడ “ఇక చాల్లేద్దూ! ఇన్ని వందల రోజులు వచ్చి, నా వంతు బాధ్యత చేశాను గదా – ఇక మానుతాలే...” అనుకొనే ఒక్కళ్ళైనా నా దృష్టికి రాలేదు. “రోజూ రెండు గంటలు చెమటలు క్రక్కి శ్రమిస్తున్నా గదా – ఈ ఉద్యమ ఖర్చులకు చందా కూడ ఏమిస్తానులే “ అనుకోక అవకాశాన్ని బట్టి శక్తి మేరకు శ్రమ – సమయదానాలతో బాటు అర్ధదానాలు సైతం చేసే కార్యకర్తలను ఎలా మెచ్చుకోవాలి? అసలిది ఏ ఒక్కరింట్లో  పనో అనుకోక – గ్రామమంతా మనదే – బాధ్యతం తామనదే – అనుకొంటూ – ఉమ్మడి నిర్ణయాలతో, ఊరు ఈ మూల నుండి ఆ మూల దాక – అన్ని వార్డుల్లో కనిపెట్టి చూస్తూ – అవసరమైన చోట ప్రత్యక్షమయే స్వచ్చంద శ్రమదానం దేశంలో మరే గ్రామంలో నైనా ఎవరైనా చూశారా?

            ఇక స్వపరిచయం: నా పేరు కోట పద్మావతి. సజ్జావారి బజారులో- నా వసతి. పాతికేళ్లకు పైగా ఈ ఊరి పాఠశాలల్లో బోధనా వృత్తి! అప్పటి నుండీ తెలుసు - ఈ జన విజ్ఞాన వేదిక వాళ్ల అవగాహనా సభలు, వైద్య శిబిరాలు, ఈ ఆరేడేళ్ల స్వచ్చ శుభ్ర బాధ్యతా నిర్వహణలు. స్పాండిలేటివ్ బాధలు కొంత వెనక్కు లాగి, గోపాలం శివన్నారాయణ గారి సూచనలతో 2017 నుండీ- అదీ ఆదివారాలు మాత్రం స్వచ్చ సుందర గ్రామ బాధ్యతలు కొద్దిగా పంచుకొంటూ వచ్చాను.  మా ఇంటి దగ్గర ఉండే తాతినేని రమణ గారు ఎప్పుడూ గుర్తు చేసేవారు. గత రెండు మాసాలుగా, ప్రతి దినమూ ఇందులో పాల్గొంటున్నాను.  దీన్లో నా పాత్ర - ఉద్యోగం సుందరీకరణం ఇష్టమైన ఈ పని వల్ల కూడ అప్పుడప్పుడు  వెన్ను నొప్పి వస్తుంది. టాబ్లెట్లు వాడతాను. మళ్లీ ఉదయం నా క్రొత్త ఉద్యోగానికి బయలుదేరుతాను.

            అసలు ఇందులో నుండి ఎలా విరమిస్తాను చెప్పండి! ఈ స్వచ్చ కార్యకర్తల బృందంలో కనిపించే ఆప్యాయత, మన డాక్టర్లిద్దరి ఆదరణలు, బైట సమాజంలోని అవలక్షణాలేవీ కనిపించని ఇక్కడి స్వచ్చత, ఈ ఉదయ కాలపు స్వార్ధ రహిత శ్రమదానం వల్ల ఏ రోజూకారోజు కలిగే సంతృప్తి... ఇవన్నీ వదులుకోలేం కదా! ఎవరు ఏ వార్డు వారో కూడా తెలియక పోయినా – “ సార్, బాబాయ్, వదినా, అన్నా  వంటి ఈ ఆప్యాయమైన పిలుపులు ఇంకా తెల్లవారక ముందే మా ఇంట్లో పడుకొంటే వినిపించవు గదా! అందుకే ఎంత కాలం ఈ స్వచ్చ సుందర  ఉద్యమం జరిగినా – నా ఆరోగ్య పరిమితి మేరకు నేను తప్పక పాల్గొంటాను.

            మూడు పాఠశాలల పిల్లలకు  చదువు చెప్పిన సంతృప్తి కన్నా - ప్రముఖ దేవాలయాలకు సేవలు చేస్తూ పొందిన ప్రశాంతత కన్న – ఇటీవల గత రెండేళ్లుగా నా స్వగ్రామం చల్లపల్లి కోసం ఈ మాత్రం పాటుబడడం వల్ల కలిగిన ఆనందమే మిన్న అని మాత్రం చెప్పగలను.

- కోట పద్మావతి

   స్వచ్చ సుందరీకరణ కార్యకర్త,

   చల్లపల్లి – 02.06.2020.