వై. రవీంద్ర బాబు (ల్యాబ్ రవి)....           06-Jun-2020

 ఆరేళ్ల కాల చక్రం à 150 మంది శ్రమదానం- పాతిక వేల జనాభా గల గ్రామ శుభ్ర- సుందర దృశ్యం.

          27 ఏళ్ల నాటి నాడు నా ఊరు రేపల్లె నుండి వచ్చి స్థిరపడి చల్లపల్లి పౌరుడనయ్యాను. 20 ఏళ్ల దాక కూడ గ్రామంలో చెప్పుకో దగ్గ మార్పులు లేవు. కాకపోతే – నారాక కన్న ముందు నుండే జన విజ్ఞాన వేదిక వాళ్ల సభలు జరుగుతూ ఉండేవి. వాళ్లకు తోచిన పద్ధతిలో- సమాజంలో అన్ని రంగాలలో ఏవో మార్పుల కోసం ప్రయత్నించే వాళ్లే గాని – ఇప్పటిలా ఈ చల్లపల్లి జోలికి రాలేదు!

          2013 నుండి DRK ప్రసాదు గారు, మరికొందరు ముందుగా భూలోకనరకమనదగిన గంగులవారిపాలెం దారిని విశ్వ ప్రయత్నాలు చేసి, చేసి, సంస్కరించి ఆ ప్రయోగంలో నెగ్గారు. దేశంలో, రాష్ట్రంలో స్వచ్చత – స్వస్తత పట్ల వస్తున్న కొత్త ఆలోచనలతో ఇక వాళ్ళు, చల్లపల్లి లోని అన్ని వీధుల్ని బాగు చేయడానికి తెగబడి – కొన్ని ఆటుపోటులెదుర్కొని, రాటుదేలి క్రమంగా గ్రామస్తుల్లో కూడ మార్పు మొదలై, కాలం కూడ అనుకూలించి, అప్పటి అసెంబ్లీ ఉపసభాపతి బుద్ధ ప్రసాదు గారి అండదండలతో ఇంత పెద్ద ఊరి స్వచ్చత – శుభ్రతలను ఒక్కో మెట్టు ఎక్కిస్తూ ఇప్పటికి అందరూ మెచ్చదగిన – ఎవరైనా ఆదర్శంగా తీసుకోదగిన మంచి మోడల్ గా తీర్చిదిద్దారు.  

          ఈ స్వచ్చ చల్లపల్లికి, ఉద్యమానికి ఎన్ని అవార్డులు, ప్రశంసలు, అనుకరణలు, దేశవ్యాప్తంగా వచ్చాయో మన అందరికీ తెలుసు! ఇప్పటి ఉపరాష్ట్రపతి, ఎక్కడో న్యూయార్క్ లో ఐక్యరాజ్యసమితి, ప్రవాస ఆంధ్రులు, ఎన్నో సంస్థలు ఎందుకు స్వచ్చ చల్లపల్లి ని గుర్తించారో కూడ మనం గ్రహించాలి. జగమెరిగిన బాపనయ్యకు జంధ్యమెందుకన్నట్లు – ఈ ఉద్యమ ప్రారంభకులైన DRK ప్రసాదు గారి వారి శ్రీమతి గారి పాత్ర దీనిలో ఎంతటిదో మళ్ళీ ఇప్పుడెందుకు? 2030 రోజులు పైగా స్వచ్చ కార్యకర్తల నిత్యశ్రమదానం వాళ్ళ జీవితంలో భాగమై పోవడం బాగానే ఉన్నది గాని, ఈ ఊళ్ళోని 25 – 30 వేల మందిలో 90% వద్దు – కనీసం 5 – 10 శాతమైనా వారానికొక మారైనా తమ తమ వార్డుల్లో ఎందుకు పూనుకోరో అని మాత్రం నాకెప్పుడూ తొలుస్తూ ఉంటుంది. ఆ సంఘీభావం, ఆ సమైక్యత, అవగహన జనంలో రావాలే గాని, ఈ చల్లపల్లి ఒకటేమిటి – దేశంలో అన్ని ఊళ్లూ, బస్తీలు సంవత్సరం తిరిగే సరికల్లా శుభ్రంగా – అందంగా – ఆరోగ్యంగా – ఆనందంగా మారిపోవా? అంటు జబ్బులు చాల వరకు అదృశ్యం కావా? బహుశా జనం లో ఆ మార్పు కోసమే ఈ ఊళ్ళో ఇంత సుదీర్ఘ స్వచ్చ సుందర ఉద్యమం నడుస్తున్నదనుకోండి.

          నా పేరు రవీంద్రబాబు. బందరు రోడ్డు ప్రక్కన “రవి ల్యాబ్” నిర్వహిస్తూ – పిల్లల్ని విద్యాబుద్ధులతో స్థిర పరచగలిగాను. ప్రస్తుతం ఇటీవలే సొంత భవన నిర్మాణం కూడా చేసుకొన్నాను. ఆ విధంగా చల్లపల్లికి ఋణపడడం, ఈ స్వచ్చోద్యమంలో పాల్గొని, పాతికో – పరకో (వేలన్న  మాట) మనకోసం మనం ట్రస్టుకు విరాళాలిచ్చి – ఆ రుణంలో ఏ సహస్రాంశమో తీర్చుకొనే ఉంటాను! ఋణాలమాటకేం గాని, జాగ్రత్తగా ఆలోచిస్తే – నా ఒక్కడిదే కాదు, ఊళ్ళో ప్రతి ఒక్కరిదీ బాధ్యత ఉన్నట్లే! ఎవరి ఇల్లు, వీధి, వార్డు వాళ్ళు శుభ్రంగా ఉంచుకునే సందేశాన్ని గ్రహించి, పాటిస్తే ఈ 2030 రోజుల స్వచ్చ ఉద్యమం సార్ధకమైనట్లే! అందుకే 83 వ రోజు నుండి నడక సంఘం మిత్రులతో బాటు నేను కూడ ఈ ఉద్యమంలో కలిసిపోయాను. ఈ శ్రమదాన కార్యక్రమంతో నా ఊరి కాలుష్యానికి విముక్తి! నా ఆరోగ్యానికి, ఆనందానికి శక్తి, రక్తి!! కనుక ఈ శుభోదయ శ్రమదాన కార్యక్రమానికి నేనెందుకు పలకాలి స్వస్తి?

- Y. రవీంద్రబాబు (ల్యాబ్ రవి)

    బందరు రోడ్డు, చల్లపల్లి – 01.06.2020.