తాతినేని (మొక్కల) వేంకట రమణ....           07-Jun-2020

 2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు -

 

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 35

2033 దినాల ఉద్యమం నా నిర్వాహకం – అనుభవం

          ఇప్పుడిది అందరూ గుర్తించిన – కీర్తించిన ఉద్యమం గానీ, 2014 న నవంబరు 12 న సాధారణంగానే మొదలయింది. 2013 డిసెంబరు నుండి 3 నెలలు గంగులవారిపాలెం బాట శుభ్రత కోసం జరిగిన కాపలా అనుభవం నేటి స్వచ్చ – సుందర – సంకల్పానికి పూర్వ రంగం. ఇదేం విచిత్రమో గానండీ, రాష్ట్రంలో – దేశంలో అభివృద్ధి చెందిన – నాగరికత ఉన్న కృష్ణాజిల్లా లోని చరిత్ర ప్రసిద్ధమైన చల్లపల్లి లో – ఒక రోడ్డులో బహిరంగ విసర్జన మాన్పి, శుభ్రం చేసుకోవడానికి అంతమందికి అంతకష్టమైంది. అన్నాళ్ల పాటు చెంబుల వాళ్ళకు మ్రొక్కవలసి వచ్చింది! మళ్ళీ గొప్పలు చెప్పుకొనేందుకేమో – పవిత్ర భారతదేశం – గాంధీ గారిని కీర్తించే ఒక అభివృద్ధి చెందిన ప్రాంతం! మనలో చాల మందిమి చక్కగా ముస్తాబవుతాం – మంచి బట్టలు ధరిస్తాం – కార్లలో కూడ తిరుగుతాం – కానీ మన జాతిపిత చెప్పిన – ఆచరించిన పరిసరాల స్వచ్చత – పరిశుభ్రతలను మాత్రం పాటించం!

            ఎవరికి వాళ్లే ఆరోగ్యంగా ఆనందంగా బ్రతకగలమనుకొంటాం – కాని ప్రతి ఒక్కరి ఆరోగ్యం – ఆనందం – సౌజన్యం – సౌభాగ్యం – చైతన్యం గ్రామం మొత్తంతో ముడిపడి ఉంటాయని ఒప్పుకోం! గాంధీగారేమైనా ఆకాశం నుండి అవతరించిన దేవుడా? మనలాగే మనిషే గదా చెప్పిందే చేసి, చేసింది మాత్రమే పది మందికీ చెప్పి, సమాజమంతటి ఆరోగ్యం, సౌభాగ్యాన్ని లక్షించి, నిష్కల్మషంగా బ్రతికి ఆయన మహాత్ముడయ్యాడు. ఎక్కడికి వెళ్ళినా నిరాడంబరత – స్వచ్చత – సభ్యత – శుభ్రతల్ని పాటించేవాడు.

            మొదటి 60 – 70 – రోజుల దాక చల్లపల్లి లో జరుగుతున్న స్వచ్చ ఉద్యమాన్ని – సదరు పారిశుద్ధ్యాన్ని గూర్చి నేనంత తీవ్రంగా పరిగణించలేదు గాని, 3-2-2015 తేదీ నాడు “అయంముహూర్తో సుముహూర్తః” అని నేను కూడ ఉదయ గ్రామ స్వచ్చంద శ్రమదానంలో పాల్గొన్నాను. అనగా 1900 రోజులుగా – మధ్యలో అప్పుడప్పుడు మినహా ఈ విశిష్ట కార్యక్రమంలో నేను కూడ ఉన్నాను.

            నన్ను తాతినేని రమణ అనే గాక, మొక్కల నర్సరీ రమణ అని కూడ అంటారు. సజ్జా వారి వీధిలో- సజ్జా వారి ఇంటిలో ఉంటాను, అంతకుముందు కడియం వారు సీజనల్ గా – సంవత్సరం లో కొద్ది రోజులుండి- చల్లపల్లిలో పూల- పండ్ల మొక్కల వ్యాపారం చేస్తుండేవారు. నేను మాత్రం బస్ స్టాండులో-బందరు రోడ్డు లో ఏడాదంతా –పూల, పండ్ల, ఇతర మొక్కల నర్సరీలను కొనసాగిస్తున్నాను. చల్లపల్లి- సమీప మండలాల్లో కూడ “ సేంద్రీయ వాడక వ్యవసాయం” గురించి కూడా ప్రచారం చేస్తూ ఉంటాను. ఆ విషయంలో సహచర స్వచ్చ కార్యకర్తలతో చర్చించి, ప్రోత్సహించడం నాకొక వ్యాపకం!

            చల్లపల్లి స్వచ్చంద శ్రమదాన ఉద్యమానికి నా వంతుగా అప్పుడప్పుడూ సందర్భాన్ని బట్టి ఐదో - రెండో - ఒకటో వేల విరాళాలు ఇచ్చాను. అసంఖ్యాకంగా ఈ కార్యకర్తలు నాటి పెంచిన అనేక రకాల మొక్కల్లో నేనిచ్చినవి కూడ ఉన్నవి! శ్మశానాల, రహదారుల, స్వచ్చ కార్యకర్తల, గృహస్తుల ఇళ్లలో కూడ నా నర్సరీ నుండి వెళ్లిన మొక్కలే పూలు పూస్తూ, నీడనిస్తూ, పచ్చదనాలు వెదజల్లుతూ, పండ్లనిస్తూ వర్థిల్లడం నాకు లోలోపల పట్టరాని ఆనందాన్ని కల్గిస్తుంటుంది.

            నిస్వార్ధంగాను, నిర్నిబంధంగాను, సుదీర్ఘ కాలంగాను, గ్రామ పౌర సమాజానికంతటికీ స్ఫూర్తి వంతంగాను స్వచ్చ సైనికులు చేసిన- చేస్తున్న శ్రమదానం గురించి ఎంతసేపైనా పొగడవచ్చుగాని, దేశమంతటికీ ఆదర్శవంతమైన- అనుసరణీయమైన మన చల్లపల్లి లో గూడ ఇప్పుడు సైతం సగం మంది గ్రామస్తులు దీన్ని పట్టించుకోక- వచ్చి కలియక మిగిలి పోవడమే వింతగా –చింతగా- బాధగా ఉంటున్నది.

             ప్లాస్టిక్ సంచుల వాడకం తగ్గించే విధంగా చల్లపల్లి సంతలో సంవత్సరాల తరబడి, ప్రతి సోమవారం మళ్లీ మళ్లీ వాడగలిగే సంచుల్ని సబ్సిడీతో అమ్మడానికీ, 30 వేల రూపాయలకు పైగా సబ్సిడీ వ్యయంతో అన్ని వేల సంచుల్ని జనానికంటగట్టడానికీ  సహచర కార్యకర్తలతో బాటు నేను చేసిన ప్రయత్నం చాల వరకు ఫలితాన్నిచ్చింది. అందుకే- (శ్రమదాన రూప) “ శ్రమయేవ జయతే”.

            అన్ని విధాల ఆదర్శవంతమైన- ప్రయోజనకరమైన ఈ ఉషోదయ స్వచ్చంద కార్యక్రమం ఆగిపోవాలనిగాని, విరమించాలని గాని, నేను సరే-ఈ గ్రామస్తుల్లో ఏ ఒక్కరైనా  కోరుకొంటారని ఎప్పటికీ అనుకోను.

            తాతినేని (మొక్కల) వేంకట రమణ,

            సజ్జావారివీధి, చల్లపల్లి,

            05.06.2020.