వల్లభనేని కమలశ్రీ....           08-Jun-2020

 2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు -

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 36

నా ఆబాల్య సందిగ్దతల – అస్పష్టతల – పరిష్కారం

ఈ 2000 దినాల స్వచ్చ – సుందర చల్లపల్లి ఉద్యమం!

        ఎందుకో తెలియదు గాని, చిన్నప్పటి నుండీ నాకు పూజాపునస్కారాల మీద, గుడుల మీద, దేవుళ్ళ మీద గురి తక్కువండి! ధైర్యమేమో కాస్త ఎక్కువేనండి. వల్లభనేని కమలశ్రీ అనే నేను మోపిదేవి నివాసినిని, APSRTC లో లేడీ కండక్టరుని. మోపిదేవి నుండి ఆరేడెనిమిది కిలోమీటర్ల దూరంలోని – వేకువ 4.00 సుప్రభాత స్వచ్చంద శ్రమదాన ఉద్యమంలో నేను సైతం మా వారితో బాటు వచ్చి పాల్గొన్నానంటే – అందుకు బలమైన కారణాలు లేకపోలేదు! తెలిసీ తెలియని చిన్న వయసు నుండి కూడా నాకు పరిసరాల పరిశుభ్రత మీద పూర్తి అవగాహనలేని ఇష్టత ఒకటి ఉండేది. మావూరి సుబ్రహ్మణ్యేశ్వరాలయంలోకి వెళ్ళవలసి వచ్చినా – దేవుని మీద కంటే నా దృష్టి ఏ మూలనో ఉన్న అపరిశుభ్రత మీదే పడేది. కండక్టరుద్యోగంలోనూ అంతే – మొదటి కిటికీ దగ్గర కూర్చొంటే బస్సులో ఎవరు ఏ చెత్త వేసినా, రోడ్డు మీద ఏ తొక్కలు విసిరినా కసురుకొనేదాన్ని.

            మా ఆయన పేరు చిన్నబ్బాయే గాని, చూడటానికి ఈజీ గోయింగ్ గా అనిపిస్తారే గాని, ఆయన కూడ స్వచ్చ శుభ్రతల విషయంలో చాలా పెద్దబ్బాయి, కొత్త మార్పుల్ని బాగా ఇష్టపడే ఇన్నోవేటివ్ మనస్తత్వం! ఇవన్నీ ఎందుకు రాస్తున్నానంటే – మేమిద్దరం మోపిదేవి నుండి వచ్చి చల్లపల్లి స్వచ్చోద్యమం లో పాల్గొనటానికి కారణాన్ని, నా మనస్తత్వాన్ని విశ్లేషించుకొన్నప్పుడు కలిగిన ఆశ్చర్యం వల్లనే!

            మా గ్రామంలో కొల్లి చక్రపాణి గారని ఒక పెద్దాయన ఉండేవారు. మాబోటి వాళ్ళ గ్రామ స్వచ్చ - శుభ్రతల పట్ల ఆసక్తికి ఆయన ప్రోత్సాహం తోడై, చల్లపల్లిలో వలే మేము కూడ కొందరం కార్యకర్తలం తయారై 102 రోజుల పాటు మా మోపిదేవి గ్రామ శుభ్రత కోసం ప్రయత్నించాము. ఈ ఉభయ గ్రామాల స్వచ్చ – సుందర ఉద్యమాల్లో పాల్గొంటున్నప్పుడు, చిన్న వయస్సు నుండే స్వచ్చ శుభ్రతల పట్ల అస్పష్టంగా ఉన్న – అవగాహనారహిత ఆకర్షణ కొక సమాధానం దొరికింది. ఈ స్వచ్చ ఉద్యమం తప్ప ఇంత పెద్ద జనాభా ఉన్న దేశ ఆరోగ్యానికి మరో మార్గం లేదని తెలిసి వచ్చింది. ధైర్యవంతులైన చల్లపల్లి డాక్టర్లు, టీచర్లు, మహిళలు, రైతులు తదితరులు ఒక నిర్దిష్ట ప్రణాళికతో – ఇంత పెద్ద గ్రామాన్ని ఆరేళ్ళ నుండి ఎడతెగని ప్రయత్నంతో ఇంత బాగా మార్చుకోగలగడం నన్ను ఆకర్షించకపోతుందా? “ఇలా ఒక్కో అడుగు వేసుకొంటూ పోతే చల్లపల్లేమిటి – ఏ ఊరైనా – ఏ రాష్ట్రమైనా – దేశమైనా బాగుపడక తప్పుతుందా?” అనే ధీమా నాకు వచ్చేసింది!

            వట్టి మాటలతో ఏ పనీ, ఏ ఉద్యమమూ ముందుకు కదలదు కదా! ఖర్చులు తప్పవు కదా! అందుకనే మా సంపాదనలో నుండి ప్రతి నెలా 500/- మనకోసం మనం ట్రస్టుకు ఇస్తూ వచ్చాం. (దీనికి ఈ మధ్య కొన్ని నెలల మినహాయింపు). మరో కోణం నుండి ఆలోచిస్తే – ఈ స్వచ్చ కార్యక్రమంలో రోజుకొక గంట పాల్గొంటే వచ్చే ఏ చిన్న నష్టమూ నాకు తోచడమేలేదు. కొన్ని మారులు నా RTC బస్సులో ప్రయాణికులతో చెపుతూ ఉంటాను – చల్లపల్లి ఊరును గుర్తు తెచ్చుకొండయ్యా! బస్సును శుభ్రంగా ఉండనీయండయ్యా” అని!

            నన్ను ఇంతగా ప్రభావితం చేసిన – చిన్నప్పటి నా ఊహాలకొక స్పష్టత తెచ్చిన – ఎవరికీ నష్టదాయకం కాని – సమాజానికి ఆరోగ్యం, ఆనందం కల్గించగలిగిన – ఒంటికీ, మనసుకూ తృప్తి సమకూర్చజాలిన చల్లపల్లి ఉద్యమానికి నా తరపున 2036 మార్లు అభినందనలు, ధన్యవాదాలు.

- వల్లభనేని కమలశ్రీ, కండక్టర్

   APSRTC, మోపిదేవి.

           07.06.2020.