డాక్టర్ దుగ్గిరాల శివప్రసాదరావు....           09-Jun-2020

 2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు -

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 36

కార్యదీక్ష, శ్రమ, పారదర్శకత, దూరదృష్టి వంటి సుగుణాల మేలికలయికే

 – 2038 దినాల స్వచ్చోద్యమ విజయ రహస్యం.

          ఇవన్నీ సార్వకాలిక ఆదర్శ గుణాలు! జనం కోసం జనం మధ్య పనిచేయాలనుకొనే కార్యకర్తకుండదగిన విశిష్ట లక్షణాలు! స్వార్ధం ఎరగని – ఏ కాస్తయినా త్యాగమే ముందుకొచ్చే చల్లపల్లి స్వచ్చ కార్యకర్తల కుటుంబం వేరు అనిపిస్తున్నది! చిన్న పిల్లలు, గృహిణులు, ఉద్యోగులు, పెన్షనర్లు, వృత్తి నిపుణులు ఇంత మంది తమ కులం – మతం – ప్రాంతం ఐడెంటటిలను మర్చిపోయి, తమ కోసం కాక – ఊరి హితువు కోరి ఇంత సుదీర్ఘ సమయం పాటు పడడమంటే మాటలా?

          “ఇంత పెద్ద ఉద్యమం ఎందుకోసమయ్యా?” అని అడిగితే –

“మన వైద్య విద్యలో ప్రాధమిక సూత్రాలలో ప్రివెంటివ్ మెడిసిన్

(నివారణ వైద్యం) ముఖ్యమైనది కదా!” అని DRK ప్రసాదు సమాధానం!

“ఈ కఠోరసాధన ఎన్నాళ్లు?” అనే ప్రశ్నకు కనీసం ఒక ఏడాది” అని ప్రత్యుత్తరం!

          “మరి 2000 రోజులకు పైగా ఈ శ్రమదానంతో మీకేం ఒరిగిందయ్యా!” అంటే “ఊరికోసం చాతనైందిచేస్తున్నామనే ఆత్మ సంతృప్తి” అని కార్యకర్తల ప్రకటన!

          ఈ వయసులో “ఇంత వేకువనే ప్రతి రోజూ చలిలో – వానలో వచ్చి కష్టపడుతున్నారేమిటని” ప్రశ్నిస్తే – మన ఆరోగ్యానికి, ఆత్మ తృప్తికీ, ఆనందానికి ఇంతకన్న మంచి కాలక్షేపం ఉందా?” అని పించనుదార్ల ఎదురు ప్రశ్న!

          ఈ అన్ని వివరణల్లో నూ చిట్ట చివరదే నాకూ వర్తించి, నచ్చి, 77 – 80 ఏళ్ల వృద్ధాప్యంలో నేను కూడ స్వచ్చ శ్రమదాన ఉద్యమంలోనికి నడిచాను. పైన నాకు అందిన సమాధానాలన్నీ నాకూ అప్పుడు అనుభవంలోకి వచ్చాయి; పూర్తిగా నచ్చాయి. కార్యకర్తలు గాని, ఉద్యమ నాయకులు, ఎన్నెన్ని ప్రయత్నాలతో ఈ గ్రామాన్ని ఎంతగా మారుస్తున్నారో గమనించాను. వరప్రసాదరెడ్డి, గురవారెడ్డి, గోపాళం శివన్నారాయణ వంటి దూర ప్రాంత వదాన్యుల సహకారం, అధికారుల, పంచాయతీ – రెవెన్యూల సహకారం కూడ దొరికి, ఈ ఐదేళ్లలో చల్లపల్లి గుర్తుపట్టలేనంతగా ఎలా మారిపోయిందో కనిపెట్టుతూ వచ్చాను. ఈ స్వచ్చోద్యమ సారధి ఒక సంవత్సరం అని తొలుత నిర్ణయించుకొన్నా అది ఇప్పుడు 6 సంవత్సరాలను సమీపిస్తున్నది.  

          నా వంతుగా ప్రతి నెలా 500/- చొప్పున ఈ ఉద్యమానికి ఆర్ధిక సహకారం అందించాను. నా భార్య రాజేశ్వరీ దేవి స్పృతి కోసం మన అత్యద్భుత శ్మశానానికి తగ్గట్లు దహనవాటికను, వెయిటింగ్ హాల్ ను నిర్మించి ఇచ్చాను. ఇంత మండు వేసవిలో కొద్ది రోజుల నుండి స్వచ్చంద శ్రమదానం చేయలేక అప్పుడప్పుడూమాత్రం వెళ్తున్నాను.

          గ్రామంలో వంద శాతం ప్రజల – ప్రవాస ఆంధ్రుల – పంచాయతీ, పోలీసుల పూర్తి తోడ్పాటు కనుక త్వరలో అందితే ఈ స్వచ్చ కార్యకర్తలు ఎన్ని అద్భుతాలు సృష్టించగలరో చూడాలని ఉన్నది.

          నేను గత రెండేళ్లుగా గుంటూరో – విజయవాడో – హైదరాబాదో – ఎక్కడికి వెళ్ళినా – ఏ విందు, వేడుకలలోనైనా సరే – “మీది చల్లపల్లి గదండీ! బాబోయ్! అన్ని వేల రోజుల్నుండి – అంత పెద్ద గ్రామాన్ని అంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు గదండి... అనే పలకరింపుతో పరామర్శించడం చూస్తున్నప్పుడు మనసు పులకిస్తున్నదే – అది శాశ్వతం కావాలనీ – అందుకు నా వంతు కృషి చేస్తూనే ఉంటాననీ విన్నవిస్తూ ......

- డాక్టర్ దుగ్గిరాల శివప్రసాదరావు

                            పోలీస్ స్టేషన్ వీధి – చల్లపల్లి (09/06/2020)