2786* వ రోజు....... ....           02-Jun-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుటేల?

కళ్లెదుటి అరుదైన 2786* నాళ్ల స్వచ్ఛ - సుందరోద్యమం

          2-6-23 - శుక్రవారపు సుప్రభాత పూర్వ శ్రమదానం సంగతి అది! వెగటు పుట్టక - చీదరించుకోక - దిక్కుమాలిన ఎంగిళ్లనూ, వీధి కశ్మలాలనూ కష్టంతోనైనా ఇష్టంగా, ఒకానొక స్ఫూర్తిమంత్రంగా, సమకాలిక సమ సమాజ ప్రబోధకంగా, అసిధారావ్రతంగా, మంచినీళ్ల ప్రాయంగా, ఉన్న పూరి సంస్కరణంగా నడిపిస్తున్న స్వచ్ఛ - సుందర కార్యకర్తల శ్రమదాన చర్యలు రోజు పరిశీలించినా ఆశ్చర్య - అద్భుతావహాలే!

          1 వ వార్డు దగ్గర 4.19 - 6.06 సమయాల నడుమ ప్రారంభమైన సదరు చర్యలు సుమారొక 60 - 70 గజాల బైపాస్ వీధిని మెరుగు పరచాయి! పుర చేతి కత్తి విన్యాసాలూ, జోడు కత్తులు వాని పిచ్చి మొక్కల నరుకుళ్లూ, నలుగురి గడ్డి చెక్కుడులూ, ముగ్గురి రోడ్డు మట్టి గోకుడులూ, నలుగురి వీధి ఊడ్పులూ, చివరి అరగంటలో నలుగురైదుగురి చెత్త లోడింగులూ......

          ఇలా – “నా విన్నవి కన్నవి విన్నవించగా - మాటలకై వెదుకాడగబోతే... మాటలిక ఎన్నెన్ని పేజీలు నిండుతాయో తెలియదు!

          చల్లపల్లి స్వచ్చంద శ్రమదానాన్ని ఆహా! ఓహో!అని కీర్తించిన వారున్నారు, మాట హాయకులు - నగదు దాతలూ ఉన్నారు, స్వయంగా చ్చి పాల్గొన లేక - బాధపడే వాళ్ళ నెరుగుదును, దూర దేశ నివాసం వల్ల ఆత్మిక  సంఘీభావుకులూ గుర్తున్నారు, మరి - వీటన్నిటికి భిన్నంగా - ఊళ్లోనే నివసిస్తూ - కార్యకర్తల స్వచ్ఛ - సుందరీకరణ ఫలితాల్ననుభవిస్తూ - తొమ్మిదేళ్ళుగా ఈ పనుల్ని పట్టించుకోని 40 - 50 శాతం గ్రామస్తులూ ఉన్నారు!

          ఎంత వైరుధ్యం! ఎంత వైవిధ్యం! మైనా సరే - మేం బ్రతుకుతున్న ఊరి అస్తవ్యస్తతల్నీ అపరిశుభ్రతల్నీ - అసౌకర్యాల్ని అంతు చూసి, ఊరు ఊరంతటినీ ఒక గంగులవారిపాలెం బాటలాగా, ఒక కమ్యూనిస్టు బజారులాగా తీర్చిదిద్దందే అగబోమని భీష్మించుకొన్న 50 - 100 మంది ఒక వంక “తూచ్ - మాకేం సంబంధం లేదు, అవసరమున్న వాళ్లు మరో తొమ్మిదేళ్లు చేస్తే చేసుకోండిఅన్నట్లుగా కొందరింకొక ప్రక్కా!

          తెల్లారిం తర్వాతైనా ఆ వీధి గేస్తులూ, పరిచయస్తు లూ తలుపులు తీసుకొని - తమ ముంగిళ్లలో జరిగే స్వచ్చ - సుందర ప్రయత్నంలో పాల్గొనకపోతే పోయిరి - 6.30 కు కార్యకర్తలు నిష్క్రమించాకనైనా తమ వీధిని తనివి తీరా చూసుకొంటే చాలు!

          6.00 సమయానికి చర్చి గంటలు మ్రోగినా 90% మంది పని విరమించలేదు. 6.10 కి ఎక్కువ మంది అలసిన మొహాల్తో హాస్టలు గేటు దాక వచ్చారు గాని - ఇద్దరు పెద్దల్ని జమ్మి లంకమ్మ గుడి దగ్గర్నుండి తీసుకురావలసి వచ్చింది!

          ఈ వేకువ చల్లపల్లి మేలిమి కోసం శ్రమించిన చేతులు 52! ఇవి కాక దావణగిరి నుండీ, కాశ్మీరం నుండీ మూడు మనసులు ఈ 1 వార్డు వీధిలోనే ఉన్నాయి!

          నేటి ప్రాభాత సేవల అనంతరం కార్యకర్తలందరికీ ఖర్జూర ఫల ప్రదానం చేసిన, టాంజానియా నుండి చ్చి కొర్రపాటి వీరసింహుడే ఉద్యమ నినాద ప్రకటన కర్త!

          స్వల్ప తర్జన భర్జనానంతరం రేపటి మన శ్రమదానం బందరు రహదారిలోని SBI వద్ద ప్రారంభం కావలెనని అంగీకారం!

          ఏం లాభం కష్టించక?

సమస్యలెన్నొ గ్రామంలో - ఆశలు ఆకాశంలో

కసవులు, మురుగులు మెండుగ - కబుర్లేలరిదండగ  

చాతైతే ఏ వీథో - వార్డో బాగుచేయ దగును

రచ్చబండ కబుర్లతో ఏం లాభం కష్టించక

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   02.06.2023.