పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వద్దనే వద్దు!
రెస్క్యూ దళ సభ్యుల 2789* వ నాటి ఉరుకులు!
సోమ - మంగళవారాల్ని తమ గ్రామ భద్రతా పనులకు కేటాయించుకొన్న వాలంటీర్ త్రిమూర్తులూ, ‘మిము వీడని నీడను నేనే’ అంటూ - సర్వకాల సర్వా వస్థల్లో వాళ్లను ప్రోత్సహించే మరొక వృద్ధమూర్తీ – 5.6.23 వేకువ 4 ½ మొదలు - 6.00 దాటే దాక ఇటు బందరూ అటు బెజవాడ రహదార్లలో అనుష్టించిన కర్తవ్యము లిట్లుండెను:
వాన బురదల్లో, ఎండ ఉష్ణంలో - తాము బ్రతుకుతున్న ఇంత పెద్ద ఊరి సౌకర్య కల్పనల రీత్యా - తాము చేస్తున్నవి సేవలంటే కార్యకర్తలు ఒప్పుకోరు - తమ సమాజానికి పడిన అప్పును తీర్చుకొంటున్న పరిమిత బాధ్యతలే అనుకొంటారు! అలా అనుకోబట్టే 2-3 వేల రోజులుగా వాళ్ల కృషి!
నిన్నటి చిరుజల్లులకీ - పెనుగాలులకీ బెజవాడ రోడ్డు ప్రక్కన మర్రి కొమ్మలు విరిగిపడి, రాకపోకలకు
సమస్య వస్తే – ఎకాయెకీన అక్కడ వాలి, గొడ్డలి - కత్తులు – మర రంపం వాడి ప్రయాణాన్ని నిర్నిరోధంగా మార్చినవి కేవలం 6 చేతులు!
అది ముగించి, మళ్ళీ బందరు రహదారిలో తామే ఎక్కడెక్కణ్ణించో సేకరించిన మట్టి – రాళ్ల - రద్దును ఈ తడి - పొడి వాతావరణమైతే బాగా చదునౌతుందని - సర్దినదీ బాధ్యత నెరిగిన ఆ హస్తాలే!
పోనీ – ‘చేసిందేదో చేశాంలే’ అని ఇళ్ల కెళ్లి ఆ చేతులు ముడుచుక్కూచ్చోవు - ఏ మజ్జిగ పంపకానికో – ఉద్యోగ విధులకో తయారైపోతాయి!
మరి – ఇంత కన్న ఈ సాదాసీదా సామాన్యులు సమాజానికేం మేలొనర్చాలో చెప్పండి!
వీళ్లలో ఏ బ్రహ్మో, విష్ణువో గాని - 6.20 సమయాన - తమ ఊరి స్వచ్ఛ - సుందరోద్యమ శీలాన్ని వ్యక్తీకరించే నినాదాలందుకొని - నేటి తమ పని ముగించాడు!
ఎలా బాగు పడును ఊరు?
కార్యభారమా ఎక్కువ - కార్యకర్తలే తక్కువ
వందలాది రోడ్లున్నవి - మురుగు కంపు వెగటున్నది
ఊరి నిండ బద్ధక పెనుభారం సైతం ఉన్నది!
ఎలా బాగు పడును ఊరు? ఏ మాత్రం కష్టించక?
- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,
05.06.2023.