2937* వ రోజు ......... ....           11-Nov-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణం మానేద్దాం!

మళ్లీ గంగులవారి పాలెం వీధిలోనే - 2937*

          శనివారం వేకువ కూడ తరగని ఉత్సాహంతో 4.18 కే బందరు బైపాస్ లో క్రిక్కిరిసిన కార్యకర్తల వాట్సప్ చిత్రాన్ని గమనించారా? ఈ కిలోమీటరు పైగా వీధిని ఇంకా ఎంతగా సుందరీకరించగలమనే వాళ్ల పట్టుదలను గుర్తించారా?  కార్యకర్తలు ఇంటి వద్ద బయలు తేరింది  మొదలు మళ్లీ ఇళ్లకు చేరింది 3 గంటల తర్వాత అనే సమయాన్ని గణించండి.

          కార్యకర్తలుగానీ, ఉద్యమాభిమానులుగానీ ఈ ఉదయం పని స్తలంలో 41 మందీ , అందులో యువ కార్యకర్తలూ పనిచేస్తుంటే ఆ దృశ్యం ఎంత మజా నిస్తుంది?  సన్ ఫ్లవర్ – సన్ సిటీ కాలనీ అడ్డ రోడ్డు నుండి బందరు NH 216 దాకా జరిగిన వీధి మెరుగుదల కృషి వివరాలిలా ఉన్నాయి.!

          ఎనిమిది మంది సుందరీకరణ + పనులవారు బోగన్ విలియా ముళ్ల చెట్ల కొమ్మలకి కాస్త క్రమశిక్షణ నేర్పారు. అందులో ఒకాయన నేరేడు చెట్టెక్కి ఎత్తైన కొమ్మల్ని నరకడమే నన్నాకర్షించింది.

          మరికాస్త ముందు కెళితే - చెట్టుకొకరూ, పుట్టకొకరూ అన్నట్లుగా పాతికమంది కార్యకర్తలు ఎక్కడ పిచ్చిమొక్కలు, గడ్డి కన్పించినా తొలగిస్తూ, ప్లాస్టిక్ బాటిళ్లూ, కవర్లూ ప్రోగేస్తూ, రోడ్డు దుమ్మును ఊడుస్తూ, చెట్ల పాదుల్ని సవరిస్తూ, అరకిలోమీటరు బారునా - అంటే నిన్న బాగుచేసిన వంతెన తరువాయిగా – తీరిక లేకుండ శ్రమిస్తున్నారు!

          రెండు రోడ్ల కూడలి దగ్గర మరో ఏడెనిమిది మంది పనేమంటే - రేపు ముఖ్య అతిథి మొక్కలు నాటబోయే చోట్లను తయారు చేయడం, అక్కడి రాళ్లను అందంగా పేర్చడం !

          బాట అందాన్ని మెరుగు దిద్దే ప్రయత్నంలో ఎవరి పనివాళ్లది - ఎవరి సంతోషం వాళ్లది- ఇక 6.35-6.50 కాలంలోని సమీక్షా - సమావేశం వివరాలిలా.....

- స్వచ్చ- సుందర చల్లపల్లి ఉద్యమ నినాదాలను తాపీగా వినిపించింది అయ్యప్ప దీక్షా దక్షితుడైన కొర్రపాటి వీరసింహుడు.

- నేటి కృషి పట్ల నిండు సంతృప్తిని ప్రకటించి, రేపటి కార్యక్రమాన్ని సవివరంగా తెలిపింది DRK వైద్యుడు.

- రేపటి ముఖ్య అతిథి విరచిత సుప్రసిద్ధ గేయాన్ని ఆలపించింది శేషు వైద్యుడు.

-  క్రమం తప్పని తన నెలవారీ స్వచ్చోద్యమ చందా 520/- సమర్పించినది కోడూరు వేంకటేశ్వరుడు.

- మొత్తం 41 మంది తో క్రమశిక్షణగా జరిగిన సమావేశం ముగిసింది 6.50 కీ!

          రేపటి ప్రముఖ వేడుకకు పద్మావతి ఆస్పత్రి వద్ద గల “పద్మాభిరామం” లో మనం ఆలస్యం కాకుండా డ్రెస్ కోడ్ తో చేరవలసిన సమయం 4.30 కు.

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   11.11.2023.