2950* వ రోజు ...... ....           24-Nov-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణం మానేద్దాం!

2950* పని దినాల స్థాయిలో చల్లపల్లి శ్రమదానం!

అది కార్తీక శుక్రవారం(24-11-23) నాటి శ్రమ రోజుల సంఖ్యైతే - పని బుద్ధిమంతుల సంఖ్య నిన్నటికన్నా కాస్త తగ్గి, 27 గా ఉన్నది. యధాప్రకారంగానే వాళ్లు చేరుకొని వీధి పనులు మొదలెట్టింది గంగులవారిపాలెం బాటలోని సన్ ఫ్లవర్ కాలనీ రోడ్డు వద్ద నుండే!

పనికి అర్హత పొందిన స్థలాలు రెండు - కాలనీ బాట - కొలిమి మేస్త్రీ గారి ఇంటి నడుమ 100 గజాలలోనూ, ఇక్కడికి దూరంగా మురుగు కాల్వ వంతెన దగ్గరా. ఒకటి వీధి పారిశుద్ధ్య చర్యా, రెండోది సుందరీకరణం! ఇక్కడ 18 మందీ, అక్కడ మిగిలిన శ్రామికులూ!

రెండు ముఠాలూ పోటీపడి పనిచేస్తుంటే - తగుదునమ్మా అని 3 మార్లు వానమిత్రుడి తొంగిచూపూ! తడిసిపోతున్నా అస్సలతగాణ్ణి లెక్కేచేయక కార్యకర్తల తెగింపూ! చివరికి అలిసి పోయి, వానే అక్కడ నుండి పలాయనం చిత్తగింపూ! కాకపోతే - ఆ చిత్తడి నేల మీద కాలు జారి ఒక ఆస్పత్రి ఉద్యోగీ, మరో స్థానిక లుంగీవాలా పడిన వైనమూ!

“ఎందుకీ మొండి కార్యకర్తలు ఇంత చలిలో – వానలో - చీకటి వేళలో – ఆల్రెడీ శుభ్ర - సుందరీకృత మార్గాన్ని మరింత మెరుగులు దిద్దుతూ – ఒకతనికి పూల మొక్క ముళ్లు గుచ్చుకొన్నా – ‘తగ్గేదేలే’ అని, ఊరి బాధ్యత నెత్తికెత్తుకోవాలి” అని మాత్రం గ్రామస్తులంతా గట్టి గా ఆలోచించదగిన సమయమిది!

పొరుగూళ్ళ నుండి కూడ వచ్చి మరీ శ్రమించే నలుగురైదుగురూ బెజవాడ నుండి వచ్చి, ఇక్కడే తిష్ఠ వేసి, “ఈ ఊరు దేశంలో నంబర్ వన్ ఐతే చూసి గాని వెళ్లను” అని భీష్మించుక్కూర్చొన్న ఒక వృద్దుడూ మన ఊళ్లో ఇప్పటికీ కొందరికి స్ఫూర్తినింపలేకున్నారెందుకని?

చినుకుల్లో కూడ తామీ పూటకు తలపెట్టిన వీధి పారిశుద్ధ్యం పూర్తిచేయగలిగామనే సంతోషంతో ఇద్దరు చిన్న పిల్లల్లాగా చిందు లేయడం చూశాను!

ఈ వేళ మరీ ఆలస్యంగా జరిగిన సమీక్షా సమావేశంలో:

- భోగాది వాసుని విస్పష్ట స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలూ,

- వేరే పని మీద చల్లపల్లి వచ్చి, ఉబుసుపోకకు ఈ వీధిలో కొచ్చి – “ఏమిటిదంతా” అని తెలుసుకొని, ఆనందం వెలిబుచ్చిన ఉల్లిపాలెం కోటేశ్వరావు స్పందనా, ముఖ్యాంశాలు!

మన రేపటి శ్రమదానం కోసం కూడ ఇదే గంగులవారిపాలెం వీధిలోని సన్ ఫ్లవర్ అడ్డబాట వద్దనే కలుసుకొందాం!

 

సాష్టాంగ ప్రణామములు!

మీ ఇంట్లో పనులో - మీవాళ్లకు లాభములో

కలిగించే పనులా ఇవి? గ్రామం సౌకర్యములకు

తొమ్మిదేళ్లు అహరహమూ దమ్ములున్న వీధి పనులు!

సాగించిన వీరులార! సాష్టాంగ ప్రణామములు!

- నల్లూరి రామారావు

   సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   24.11.2023.