2951* వ రోజు ...... ....           25-Nov-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణం మానేద్దాం!

2951* వ వేకువ సమయపు శ్రమదాన సిత్రాలు!

ఆ ‘సిత్రాలు’ శనివారం - 25-11-23 నాటివి; ఎక్కడో శ్రీకాళహస్తి నుండి చల్లపల్లికి చుట్టం చూపుగా వచ్చిన వ్యక్తితో సహా 35 మందివి; తెల్లారగట్ల - 4.13 నుండి 6.07 దాక తప్పనిసరి తద్దినంగా కాక - ఒక వేడుకగా ఉన్న ఊరి పట్ల అంకితభావంతో జరిగినవి, విసుగూ విరామం లేకుండ తొమ్మిదేళ్లుగా జరుగుతూనే ఉన్నవి!

“ఇదేమిటి - ఊరి సర్పంచులు కూడ ఈ వేళ కాని వేళ బురద – చెత్త డిప్పల్ని మోస్తారా? చేయి తిరిగిన వైద్య శస్త్రకారులు రోగులకు కాక - పెద్ద కత్తెర్లు పట్టి చెట్ల కొమ్మలక్కూడ శస్త్ర చికిత్సలు చేయడమా? లక్ష రూకల పెన్షన్లు తీసుకొనే వయోధిక విశ్రాంత ఉన్నతోద్యోగులు చీపుళ్లు పట్టి తమ ఊరి వీధులూడుస్తుంటారా? గృహిణులూ, వ్యాపారులూ, రైతులు వాళ్ళ సొంత పనులు. చాలక - ఇలా ఊరి స్వచ్ఛ - సౌందర్య బాధ్యతలు మోస్తారా.....?” అని క్రొత్త వాళ్ళకనిపించవచ్చు.

గాని - అలాంటి పనులకు కేరాఫ్ అడ్రసు స్వచ్ఛ సుందరోద్యమ చల్లపల్లి! ఊరి ప్రజల సుఖ సౌకర్యాల కోసం – మంచి వాతావరణ లభ్యత కోసం – వంక బెట్టలేనంతగా - దేశంలో నంబర్ వన్ గా సొంతూరిని తీర్చిదిద్దడం కోసం ప్రతి వేకువా 30-40-50 మంది అక్కడ దాదాపు 3 వేల రోజులుగా శ్రమిస్తూనే ఉంటారు!

“ఆc! ఇదెలా సాధ్యం? వాళ్ళకింకేం స్వార్ధాలు, సొంత పన్లూ ఉండవా?” అని సందేహించే వాళ్ళు దయచేసి ఏ వేకువైనా స్వయంగా వచ్చి, పరిశీలించండి! పని సమయంలో వాళ్ళ ముఖ కవళికల్ని కనిపెట్టండి! అందులో ఎవరితోనైనా మాట కలపండి!

ఉదాహరణకి – ఈ వేకువ – గంగులవారిపాలెం రోడ్డు పడమటి డ్రైనులో దుర్వాసన తట్టుకొంటూ నలుగురు కార్యకర్తలు చలిలో గూడ చెమటలు చిందిస్తూ – సిల్టు తోడి, ఎండు కొమ్మలూ, ప్లాస్టిక్ బాటిల్సూ, తాడి మొద్దులూ బైటకు లాగి, మురుగుకు పరుగులు నేర్పుతున్న దృశ్యమూ –

- రోడ్డు మరింత విశాలంగా, శుభ్రంగా, సుందరంగా ఉండేందుకు చీపుళ్లతో నలుగురూ, కత్తులతో ఏడెనిమిది మందీ, దంతెలతో నలుగురూ పాటుబడే కనువిందైన దృశ్యమూ –

- వ్యర్ధాల్ని డిప్పలకెత్తి మోసి – పెద్ద ట్రాక్టర్ లో నింపిన సన్నివేశమూ చూడవచ్చు.

- అన్నిటికన్నా ముఖ్యంగా ఒక స్కూల్ టీచరమ్మ చెత్త బండెక్కి వ్యర్ధాల్ని పొందికగా సర్దుతున్న వింతనూ చూడగలరు!

ఇక చివరగా సమీక్షా సభలో-

ఒక రాజు గారు ఎలుగెత్తి గ్రామ సామాజిక చైతన్య ప్రయత్నంగా - ఉద్యమ నినాదాల్ని వినిపిస్తే – తొలి స్వచ్చోద్యమ సంచాలక వైద్యుడు – నిన్నటి - నేటి - రేపటి శ్రమదాన అవసరాన్ని వివరిస్తే – రేపటి 21 సంవత్సరాల వైద్య శిబిరాన్ని ప్రస్తావిస్తే –

నేటి శ్రమ వేడుక రేపటికి వాయిదా పడెను! సదరు శ్రమ సంగతి రేపటి వేకువ బెజవాడ దారిలోని విజయా కాన్వెంట్ దగ్గర అని కూడ తెలిసెను!

 

జయం సూచన తెలుస్తున్నది

స్వచ్ఛ శుభ్రత నిలుపుకొంటూ ఊరు కొంచెం మారుతున్నది

కార్యకర్తల శ్రమకు గ్రామం కృతజ్ఞత చూపించుచున్నది

“శ్రమ మూల మిదం జగత్" అను సామెతకు గౌరవం ఉంటది

స్వచ్ఛ - సుందర ఉద్యమానికి జయం సూచన తెలుస్తున్నది!

- నల్లూరి రామారావు

   సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   25.11.2023.