2953 వ రోజు ...... ....           27-Nov-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెన్నాళ్లు వాడుదాం?

రెస్క్యూ టీమ్ వారికి ఎందుకింత శ్రమ? - @2953*

అనే ప్రశ్న నాది కాదు - కొందరు గ్రామ సహృదయుల సందిగ్ధం! సేవలు చేయొచ్చు గాని - మరీ ఇన్ని వేల రోజులు వానల్నీ చలీ, మంచుల్నీ తట్టుకొని ఈ మానుషరూపేణాగ్రామ సేవకుల శ్రమ సఫలీకృతమా, ఊరి జనులు కొందరి నిర్లక్ష్య నిర్వాకం వల్ల బూడిదలో పోస్తున్న పన్నీరా?” అని సదరు సానుభూతి పరుల శంకలు!

ఈ సోమవారం (27-11-23) బ్రహ్మముహూర్తంలో - ప్రభుత్వాస్పత్రి వీధిలో అలాంటి కష్టతర బాధ్యతలకు పూనుకొన్నది పరిమిత సంఖ్యాక కార్యకర్తలే గాని - ఆ ఐదారుగురికి సైడ్ హీరోల్లాగా నలుగురు 67-84 వర్షీయసులు తోడయ్యారు.

ఓర్నాయనో! అసలే ఇరుకు వీధి గుంటలు పడ్డ ఎగుడు దిగుడు రోడ్డు - వేధించే చలి గాలీ - ఇలాంటి పరిస్థితుల మధ్య మురుగ్గుంటల్లో కరెంటు కార్మికులు నరికి వదిలేసిన చెట్ల కొమ్మలూ మూడు నాలుగు వారాల్నుండీ చూచ్చీసి, సమస్య పరిష్కారినికి దిగిన కార్యకర్తలూ!

కొమ్మలు పచ్చిమీదుంటే ఆ కథ వేఱు! దెబ్బకొక కొమ్మ కత్తికి బలైపోయేది. ఎండు కొమ్మమురుగు నీళ్లలో తడి కొమ్మ కూడ ఒక ఎడమ చేతి వాటం వాని కత్తి దెబ్బకు తుంపులు కావడం చూశాను.

ఇంకొకాయన్ని చూడండి - చిటారు కొమ్మ మీద నిటారుగా నిలబడినట్లు నిండు ట్రాక్టర్ పైన నిలబడి, ఎన్ని కొమ్మల్ని అమర్చుతున్నాడో!

ఆస్పత్రి సిబ్బందో - వీధి ప్రయాణికులో కాస్త బాధ్యత వహిస్తే - ఇద్దరు సీనియర్ డాక్టర్లు చీపుర్లు పట్టి ఆ వీధినంతగా ఊడ్చే పని పడేదా!

- ఇలాంటివి నా ఫీలింగ్సే గాని, అక్కడున్న 11 మంది స్వచ్ఛ కార్యకర్తలవి కావు వాళ్ళకల్లా ఈ ఉదయం అనుకొన్నట్లుగా అనుకొన్న చోట వీధి పారిశుద్ధ్యం చేశామా లేదా?” అనే ఆలోచన్లే సుమా!

ఇదీ - 2953* వ వేకువ సమయపు శ్రమదాన కథ! తర తమ వ్యత్యాసాల్తో వేల నాళ్లుగా చల్లపల్లిలో ఈ గాథ పునః పునః పునరావృతమౌతున్నదే! పాఠకుల్ని విసిగిస్తూ చాల కాలంగా నా వ్రాతలు చర్విత చర్వణాలే!

 

చిత్త శుద్ధితో కర్మయోగం

తొమ్మిదేళ్లుగా స్వచ్ఛ - సుందర దుందుభులు మోగించిరెవ్వరు

నిత్య నూతన శ్రమ విధానపు నిర్వచనమిస్తున్న దెవ్వరు

చిత్త శుద్ధితో కర్మయోగం చేసి చూపిస్తున్న దెక్కడ?

స్వచ్ఛ సుందర కార్యకర్తలె స్వచ్ఛ సుందర చల్లపల్లే!

- నల్లూరి రామారావు

   సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   27.11.2023.