2957 వ రోజు ...... ....           01-Dec-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెన్నాళ్లు వాడుదాం?

ప్రస్తుత పని దినం 2957*వది!

అనగా - అది డిసెంబరు తొలి దినం - శుక్రవారం నాటిది , దాని పని వేళ 4.17 – 6.20 కనుక, నికరంగా 30 మందిది కాలం కొలతతో ఐతే 50 పని గంటలూ, స్ఫూర్తి కొలతైతే నావల్ల కానిది!

మరొకమారు ఈ శ్రమ (దానం అనాలో, వేడుకనాలో -) గంగులవారిపాలెం దారిలోని సన్ ఫ్లవర్ అడ్డ బాట కేంద్రంగానే జరిగింది. నిన్నటి వేకువ ఈ సిమెంటు బాటకు దక్షిణాన కొంత భాగం తమ నుండి తప్పించుకొనగా - గుర్తుపెట్టుకొని మరీ డజను మంది ఆలోటును పూరించారు.

మాజీ డి.ఎస్సీ. గారి ఇంటి వెనుకా అక్కడి పెద్ద ఖాళీ స్థలం దక్షిణపు టంచునా కాలుష్యం నిధులు - పిచ్చి, ముళ్ల చెట్లూ, గడ్డీ, ప్లాస్టిక్ దరిద్రాలూ తమకంట బడితే కార్యకర్తలు రెచ్చిపోకుండా ఉంటారా? ఏడెనిమిది మందికి ఆ రెండు చోట్లా పని సరిపోయింది.

ఇక మూడోది భారీ చెట్టు కాండం. నిన్న వేకువనే దాన్ని ట్రాక్టర్ కు కట్టి, లాక్కొచ్చారు గాని – దాన్ని శిల్పంగా మార్చడం మొదలయింది గాని – పూర్తి కాలేదు. బెంచీలాగా చెక్కి, నగిషీలు దిద్ది, రంగులద్ది, ఆకర్షణీయంగా, రూపొందిస్తే పాదచారులో, అక్కడి గృహస్తులో ఉపయోగించుకుంటారనే ఆశయం! ఇందులో నలుగురి శ్రమ ఖర్చయింది.

నేటి పనిలో తదుపరి భాగం మా ఇంటి ముందు రహదారి వనం. అందులో కలుపు తీసి, క్రోటన్ కంచెను మట్టంగా కత్తిరించి, మర్యాదగా కనిపించడం నేర్పింది నలుగురు. గేటు వైపున్న పెద్ద కొమ్మలు కొన్నిటిని ఇద్దరు తొలగించారు.

పని జరిగిన 200 గజాల వీధుల్నీ మరొకమారు ముగ్గురి చీపుళ్లు ఊడ్చి శుభ్రం చేశాయి.  ఈ పనులన్నిటా దంతెలూ, కత్తులూ, మర రంపమూ, కత్తెర్లూ అవసరాన్ని బట్టి వాడారు. డిప్పల్తో త్రుక్కు మోసి ట్రక్కు నింపేశారు.

ఇదండీ - 30 మంది శ్రమదాతల వేకువ పనుల సంగతి!

కాఫీ కార్యక్రమం ముగిసి – 6.20 కి అర్థవలయంగా నిలిచి, పెద్దలకు నమః పూర్వకంగా పల్నాటి అన్నపూర్ణ ప్రకటించిన సరిక్రొత్త నినాదాలు కామెంట్లకు గురయ్యాయి!

అడపా వాని సూక్తులా కట్టుకొని నవ్వులు పూయించాయి! ఇదొక అర్ధం పర్ధం లేని గ్రుడ్డి  శ్రమదానం కాదనీ – ప్రణాళికా బద్ధంగా, ప్రయోజనకరంగా, సృజనాత్మకంగా జరిగే ప్రయత్నమనే ఎవరైనా ఒప్పుకోవాలి!

ఈరోజు కూడా మా పెరటి జాంచెట్టు పళ్ళ పంపకం జరిగింది.  

రేపటి శ్రమదానం బందరు రహదారిలోని 6 వ నంబరు కాల్వ వంతెన దగ్గర ప్రారంభమగునని ఇందుమూలముగా తెలియజేయడమైనది!

 

ఒక సత్కర్మాచరణం - ఒక నిత్యానుష్ఠానం

గుడులు గోపురాలివ్వని - పుణ్య తీర్ధములు పంచని

గురుబోధన లందించని - పారాయణలొసగలేని

ఒక సత్కర్మాచరణం ఒక నిత్యానుష్ఠానం

తోనె స్వచ్ఛ కార్యకర్త పొందుతున్న సంతోషం!

- నల్లూరి రామారావు

   సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   01.12.2023.