2959 వ రోజు ..........           03-Dec-2023

    పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణం మానేద్దాం!    

                            డిసెంబరు 3 నాటి కార్యకర్తల శ్రమ విన్యాసాలు! @2959*

          ఆదివారమై నందున శ్రమదాతల సంఖ్య కొంత పెరుగుతుండడం మామూలేగాని, మరీ 43 మంది కాయ కష్టానికి బందరు NH 216 నోచుకోవడం- అదీ ఒక అనిశ్చిత వర్షాగమన వాతావరణంలో అరుదనే చెప్పాలి.

          కాని బ్రహ్మ ముహూర్తపు వేళ – ఏ మోపిదేవి గుడి వద్దనో- అన్నసమారాధనల దగ్గరో- ఓట్లకు డబ్బులు ముట్టే చోటికో ఎందరైనా చేరతారు గాని - మద్యం దుకాణాల ముందు బారులు తీరి నిలుస్తారు తప్ప –

 - వీధులూడ్చేందుకూ, ఎంగిలాకులేరేందుకూ, మురుగ్గుంటలు బాగు చేసే దిక్కుమాలిన  పసులకూ ఎక్కడన్నా ఇలా ప్రోగడతారా?

          కాని, ఠంచనుగా హాజరౌతారు - చల్లపల్లిలో! ఒకటీ – అరా రోజులు కాదు సుమా 2-3 వేల రోజులు!

ఫోటోలకు ఫోజులకో- మీడియా ప్రచారానికో అనుకొనేరు - అవన్నీ మూడు రోజుల ముచ్చటగా ముగిసిపోయేవి- ఒక నిర్దిష్ట లక్ష్యం కోసం- తమ క్షేమంతో బాటు చుట్టూ సమాజ సంక్షేమాన్ని లక్ష్యించి, ఒక పండుగ వాతావరణంలో నిరంతర ప్రక్రియగా సాగుతున్న శ్రమదానమిది!

          సమాజంలో లబ్ద ప్రతిష్ఠులైన డాక్టర్లు, ఉద్యోగులు, ఇంటి పనుల్ని సర్దుబాటు చేసుకొన్న గృహిణులు-ఎవరెవరో ఇందులో కలిసి పని చేస్తారు! ఏ ఎంట్రీ కార్డూ దీని కవసరం లేదు! – అనుకోకుండా ఒక బేబీ సరోజ అనే గృహిణి వచ్చినట్లు! నిన్నా మొన్నట్లో మేజర్ సర్జరీలు జరిగిన వయోధికులూ వచ్చి, తోచిన పని చేస్తుంటారు, పొరుగూళ్ల నుండీ. అమెరికా నుండీ వచ్చిన కార్యకర్తలూ ఉండొచ్చు!

          "ఒకేటే  పయనం- ఒకటే గమ్యం

గెలుపుపొందు వరకూ- అలుపు లేదుమనకూ...." అనుకొంటూ బలవంత బాహ్మణార్థంగానో, తప్పని సరి తద్దినంగానో కాక - తమ విద్యుక్త ధర్మంగానో, కష్టాన్ని ఇష్టంగా మార్చుకొంటూనూ చేస్తున్న గ్రామ పారిశుద్ధ్య కార్యక్రమమిది!

          అలా 2 వీధుల్లో జరిగిన మెరుగుదల కృషితో :

 1) కళా నర్సింగ్ హోమ్ నుండి భగత్ సింగ్ ఆస్పత్రి దాక ట్రాన్స్ఫార్మర్ల క్రిందతో సహా- 200 × 20 గజాల రహదారిలో నానా కశ్మలాలు తొలగిపోయాయి!

2) గంగులపాలెం రోడ్డులో గుంటపడి క్రుంగుతున్న రోడ్డుకూ, భారీ వాహనం దిగబడిన పల్లానికీ రక్షణ లభించింది! ఆ ఇసుకా- ఆ మట్టీ బందరు దారిలో ఊడ్చి ప్రోగేసినవే మరి!

          తక్కిన  ఉద్యమాలకీ, చల్లపల్లి స్వచ్ఛ- సుందరోద్యమానికీ స్పష్టమైన తేడా ఏదో-6.25 కు జరిగిన ముగింపు సమావేశంలో తెలిసింది!  2 గంటలు శ్రమించాక – 43 మందీ BSNL నరసింహుననుసరించి నినదించడమూ, నందేటి వాని శ్రవణ సుభగ గేయమూ, కొర్రపాటి వీరసింహుని మిఠాయిల పంపకమూ, మరొకరి జామ పళ్ల పందేరమూ,ఇంకొక ప్రవచనకుని సూక్తి ముక్తావళీ, జోకులూ, నవ్వుల పువ్వులూ... ఆ వాతావరణమే వేరు !.

వీటన్నిటికి దీటుగా సమీక్షకుని పట్టరాని ఆనందమూ!

          బుధవారం వేకువ కూడ మన కృషి భగత్ సింగ్ దంత వైద్య శాల నుండే మొదలు కావలెనని నిర్ణయించారు!

      ఒక కొలిక్కి రావచ్చును!

ఐదువేల గృహాలలో స్వచ్ఛ- స్పృహ పెరిగినపుడు

ఊరిమెరుగుదల కందరు ఉత్సహించి కదలినపుడు

'మనకోసం మనమే' అని జనం నిశ్చయించినపుడు

 ఈ సుదీర్ఘ శ్రమదానం ఒక కొలిక్కి రావచ్చును!

- నల్లూరి రామారావు

   సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   03.12.2023.