2960 వ రోజు ...... ....           04-Dec-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా?

వానకు తడుస్తూనే 7 గురి వీధి సౌకర్యాలు @2960*

సోమవారం – 4/12/23 నాటి సంగతులవి. రైతాంగాన్ని ఎడాపెడా వణికిస్తున్న – ఈదురుగాలుల్తో గూడిన - తుఫాను వానలు. గత ఐదారు నెలలుగా స్వచ్ఛ కార్యకర్తలు నాటి పెంచుతున్న 3000 వేల రకరకాల మొక్కలను తప్ప ఎవర్నీ ఉద్ధరించేవి కావు ఈ వానలు!

గాలీ - వానా జమిలిగా పడే సమయంలో 4:20 - 6:00 నడుమ నలుగురు రెస్క్యూ టీమ్ వాళ్లూ, ఇద్దరు వృద్ధులూ గంగులవారిపాలెం రోడ్డులో – మా ఇంటి సమీపంలో వడ్రంగి పనులకేల పూనుకోవలె? ఏడో వాడిగా నేను వెళ్లానంటే – మా వీధిలో – మా ఇంటి ముందర కనుక వెళ్లితిని!

అన్నట్లు - ఈ వేకువ జరిగింది వడ్రంగి పని కన్నా తాపీ పనే ఎక్కువలా ఉంది. గత రెండు పని దినాల్లో నిరుపయుక్తంగా పడున్న పెద్ద వృక్ష కాండాన్ని చిత్రిక పట్టి కూర్చొనే బల్లగా చెక్కిన కార్యకర్తలు ఈ వేకువ ఇసుక – సిమెంటు – చిప్ లు కలిపి కాంక్రీటుగా చేసి, సదరు భారీ వృక్ష కాండం తొర్రను నింపి, వానకు తడవకుండా పట్టాలు కప్పి, నేటి పని ముగించారు!

అంతకుముందూ, పని జరుగున్నంతసేపూ వాన వాళ్లని కవ్విస్తూనే ఉన్నది! - హనుమంతుళ్ల ముందు కుప్పి గంతుల్లా!

తిరిగి గస్తీ గదికి చేరుకొని, కస్తూరి శ్రీనుతో గలిసి, గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమ నినాదాలు పలికి ఇళ్లకు చేరారు!

 

ఇక ఆగదు అంటున్నా!

రికార్డుకో రివార్డుకో శ్రమదానం కాదు గదా

అంతఃకరణ సంతృప్తికి అది జరిగేదైనందున

ఆనందం, ఆరోగ్యం అది అందిస్తున్నందున

ఎన్ని దశాబ్దాలైనా ఇక ఆగదు అంటున్నా!

- నల్లూరి రామారావు

   సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   04.12.2023.