2961 వ రోజు ...... ....           07-Dec-2023

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా?

2961* వ నాటి శ్రమ విశేషాలు!

ఇది గురువారం – 7/12/23 వ తేదీ - రైతాంగాన్ని తుఫాను భీభత్సం క్రుంగదీసిన మరునాటి వేకువ 4.17 - 6.10 సమయం; ఇక - చివరగా వచ్చిన గ్రృహిణి - టీచర్ తో గలిపి మొత్తం 30 మంది; స్థలం -NH216 లో దంత వైద్యశాల కేంద్రంగా అటూ ఇటూ 250 గజాలు!

అందులో తెట్టు గట్టి ఆగిన మురుక్కాల్వలుండవచ్చు - కర్మకాండల భవన ఆవరణే ఉండొచ్చు - మునసబు వీధి మార్జిన్ల గడ్డీ - పిచ్చి, ముళ్ల మొక్కలే కావచ్చు - రోడ్డు మార్జిన్లలో భారీ వాహన చక్రాలు దిగితే పడిన గుంటలే ఉండొచ్చు - అక్కడ దొరికిన ప్లాస్టిక్ - గాజు - సీసాలో, లోపలేముందో తెలీని కాగితం పొట్లాలో, ప్లాస్టిక్ సంచులో కావచ్చు - అన్నీ ఈ గంటా ఏభై నిముషాల శ్రమతో తొలగిపోయి, సరైపోయినదొక విశేషం!

ఇంత చలిలో - ఇంటి వద్ద డ్యూటీలు సర్దుబాటు చేసుకొని గృహిణులు వచ్చి వీధికి మెరుగులు దిద్దడం మరొక విశేషం!

కార్యకర్తల్లో కొన్ని వర్గీకరణలుంటాయి – రెండు చేతుల్లో 2 కత్తుల్తో పని చేసే, రెండు చీపుళ్ళు ప్రయోగించే సవ్యసాచులుంటారు, వంగి పనిచేసే వాళ్లూ, ,తడి నేల మీదనే చతికిలబడి గడ్డి పీకి/చెక్కే వారూ, నడుం బాగా వంగక ఒక చేత్తో గొర్రు ఊతంగా కొంచెం వంగి మార్జిన్లలో శుభ్రపరిచే వారూ, డిప్ప పని వారూ, చీపుళ్ల ఆయుధ ప్రయోక్తలూ వగైరాలన్నమాట!

మరి - ఇంతగా కష్టించిన ఫలితమేమనగా -

1) షరామామూలుగా 2 వీధి భాగాలూ, కర్మకాండల వెనుక భాగమూ, పరిశుభ్ర సుందరంగా మారడమూ,

2) మురుగు కాల్వల్లో చెత్త ఒడ్డుకు చేరి, అవి నడక మొదలెట్టడమూ

3) చూస్తున్న వారికి - పొందగలిగితే స్ఫూర్తీ, చేస్తున్న వారికి ఆత్మ సంతృప్తీ,  

- ఇక - ఆఖర్న - సమీక్షా కాలంలో – గాలి వానానంతర 2 రహదార్లలో ట్రస్టు కార్మికుల కృషి, పంచాయితీ వారి అప్రమత్తతతో మొన్నటి తుఫానుకు ఊరి మురుగులు రోడ్ల మీదికెక్కక మర్యాదగా ముందుకే నడిచిన ప్రత్యేకతను, తన్మూలంగా DRK గారి ఎనలేని సంతోషమూ, ప్రాతూరి శంకర శాస్త్రి, మాలెంపాటి గోపాలకృష్ణయ్య గార్ల 5 వేల, 2 వేల నెలవారీ చందాలూ,

చదువు మానేసే కారణం గురించి అడపా, మాలెంపాటి గార్ల చమత్కారమూ, అతగాడు ప్రకటించిన నినాదమూ

రేపటి వేకువ కూడ మన శ్రమ వేడుక ప్రారంభం దంత వైద్యశాల వద్ద నుండేననే ప్రకటనా....

 

ఏదీ తగు సహకారం

ఇంత సదుద్దేశానికి ఏదీ తగు సహకారం

ఇంతటి సత్కార్యానికి ఏది తగు సహానుభూతి?

ఇది ఊరికి శుభకార్యం - ఎందరు పాల్గొంటున్నరు

సామాజిక సామూహిక సదాచరణ స్థానమిదా?

- నల్లూరి రామారావు

   సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

 

   07.12.2023.