1953* వ రోజు....           17-Mar-2020

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం! 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1953* వ నాటి శ్రమ సుందర సంకేతాలు.

 

ఈనాటి వేకువ కూడ 3.58-6.05 నడుమ జరిగిన గ్రామ కర్తవ్య నిర్వహణలో కలిసి వచ్చిన వారు 30 మంది. ఇంచుమించుగా వీరందరి కార్యరంగం కీర్తి హాస్పటల్ నుండి బందరు రహదారిలోనే.

 

కేవలం చీపుళ్లనే ఆయుధ ప్రయోగం చేసిన 20 మంది ఈ సువిశాల రహదారే, సొంత ఇల్లనుకొన్నంతగా పట్టి పట్టి శుభ్రం చేస్తూ తూర్పు రామాలయం దాక వెళ్లారు. వీళ్లకు చేతులు, భుజాలు నొప్పి పెట్టడం మాట అటుంచి మితిమించిన వేగంగా దూసుకుపోతున్న- వస్తున్న వాహనాలే పెద్ద ఆటంకాలై పోయినవి. అయినా, వీరిలోని వృద్ధులు, మహిళలు కూడ గంటన్నరకు పైగా చాకచక్యంతో తమ కర్తవ్యాన్ని  పూర్తి చేయడం ఎంత నిష్కామ శ్రమదానమో మాకు అవగతమౌతున్నది.

ఈ రోజు ఎందుకో గాని – వీధి ప్రక్కన ఏ గోడ సుందరీకరించడానికి తటస్థ పడలేదేమో – సుందరీకరణ బృందం కూడ తమతో కలిసి రాగా రెస్క్యూ టీం వారు కీ.శే పింగళి నరసింహమూర్తి గారి ఇంటి ఎదుట – నర్సరీని తొలగించిన చోట మెరకను తీయడానికి చెమటలు క్రక్కారు. గట్టి పడి బిగుసుకున్న ఆ మట్టి పారలు, పలుగులు ప్రయోగిస్తే తప్ప లొంగి రాలేదు.  త్రవ్వుతున్న మట్టిని కొందరు డిప్పలలోకి ఎత్తుతుంటే, బరువైన ఆ డిప్పలను మోస్తూ ట్రక్కులో నింపుతున్న (తరువాత వీళ్లీమట్టిని ఊరిలో ఎక్కడ రోడ్ల పటిష్టతకు అవసరమైతే అక్కడ సర్ది భద్రత కల్పిస్తారు) నలుగురు కార్యకర్తలను, కాస్త కురసగా ఉన్నా ట్రక్కు పైకి ఎక్కి ఆ మట్టిని సర్దుతున్న ఒక కులీన యువతిని ఫోటోలలో గమనించండి!        

వేకువ నాలిగింటికే రోడ్డెక్కి రెండు గంటల పాటు శ్రమిస్తూ, చెమట చిందిస్తూ, ఆ కారణంగా సీసాల కొద్దీ నీళ్లు తాగుతున్న ఈ శ్రమ జీవన మూర్తులను, వారి నిస్వార్ధ కృషి సందేశాలను మిగిలిన గ్రామస్తులు ఇంకా ఎన్నాళ్లకు స్వీకరిస్తారో మరి.  

ఈ 30 మంది పది నిముషాల పాటు కాఫీ- టీ -  స్వచ్చ్యోద్యమ కబుర్ల తో సేద తీరి, 6.37 నిముషాలకు నేటి శ్రమదాన సమీక్షా సమావేశంలో పాల్గొని మాజీ ZPTC పైడిపాముల కృష్ణ కుమారి ముమ్మారు ప్రకటించిన స్వచ్చ – సుందర -గ్రామ సంకల్ప నినాదాలను పురుద్ఘాటించి, ఈ ఉద్యమ సంచాలకులు డాక్టర్ DRK ప్రసాదు గారి కరోనా హెచ్చరికలు శ్రద్ధగా విని, తమ తమ గృహోన్ముఖులయ్యారు.             

రేపటి కార్యక్రమం కోసం శివరామ పురం రోడ్డు వద్ద కలుద్దాం.  

           ఈ 1900 రోజులు

స్వచ్చోద్యమ చల్లపల్లికి మహా విజయ మార్గమేది?

సామాజిక ఋణ విముక్తి సదా శయంతో కొందరు

కాలుష్య కోర నుండి గ్రామాన్ని సముద్ధరింప

పందొమ్మిది వందల దిన పర్యంతం శ్రమ వేడుక!

 నల్లూరి రామారావు

స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

మంగళవారం – 17/03/2020

చల్లపల్లి.    

3.59 కు SBI వద్ద
ఊడ్చి శుభ్రం చేసాక బందరు రోడ్డు