1954*వ రోజు....           18-Mar-2020


ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం! 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1954* వ నాటి శ్రమ దాన వినోదం. 

బాగా మంచు ముంచుకొచ్చిన ఈ వేకువ 4.08-6.10 నిముషాల నడుమ శివరామపురం గుడిసెల దగ్గర, కమ్యూనిస్టు వీధిలో- ఉభయత్రా జరిగిన స్వచ్చ-శుభ్రతా-సుందరీకరణ చర్యలలో 33 మంది బాధ్యత వహించారు.

రహదారులు కావచ్చు, గ్రామ ప్రధాన వీధులు, సందు గొందులు, కాలువ గట్లు, శ్మశానాలు, ఖాళీ దిబ్బలు- ఏ అపరిశుభ్ర- అనారోగ్య కారణాలైన చోటైనా కావచ్చు, స్వచ్చ కార్యకర్తల దృష్టిని దాటిపోవు-దృష్టికి వచ్చిన ఏ ఒక్కటీ తాత్కాలికంగానో, శాశ్వతంగానో శుభ్ర-సుందరాలుగా మారకపోవు!

శివరామపురం- 2 కిలో మీటర్ల దారైనా అంతే! పాతిక మందికి పైగా కార్యకర్తల దీక్షతో రెండు వారాల శ్రమతో నెమ్మదిగా శుభ్ర సుందరంగా, విశాలంగా మారిపోతున్నది! మరో 4 రోజుల్లో పూర్తిగా వస్తున్న ఈ రహదారి శ్రమదానం సామాజిక సందేశ పరంగా ఎంత విలువైన దో గ్రహించాలని మనవి! 7 ఏళ్ల నుండి 82 ఏళ్ల వయసు వారు- నేటి చలిలోనే- మంచులోనే శక్తి వంచన లేకుండ గ్రామం మేలుకోసం కష్టపడడాన్ని మనం ఎంతకాలం నిర్లక్ష్యం చేయాలి?

గ్రామ సుందరీకర్తలు బందరు దారి సమీపంలోని కమ్యూనిస్టు వీధిలో- ప్రేక్షక పాత్ర తప్ప, కార్యకర్త పాత్ర వహించని వీధి నివాసితుల సాక్షిగా- తమ 3 గంటల ప్రహరీ సుందరీకరణను పొడిగించారు. కళా తృష్ణ కు హద్దే ముంటుంది? ఇంకెన్నాళ్లు ఈ వీధిలో వీళ్లు తమ చిత్ర లేఖన సందేశాన్ని పొడిగిస్తారో చూడాలి!

6.30 కి శివరామపురం దారి ప్రక్క పొలంలో జరిగిన నేటి కృషి సమీక్షలో  ఆరవ్- ఆర్యలు చెరిసగంపంచుకొని, ముమ్మారు ముద్దుగా ప్రకటించిన సందేశాత్మక స్వచ్చ-సుందర సంకల్ప నినాదాల తో బాటు కరోనా హెచ్చరిక గూడ చేసి, 6.40 కి నేటి మన బాధ్యతలను ముగించారు.

అపరిశుభ్రత మీద మన రేపటి దండయాత్రను శివరామపురం పంట కాలువ వంతెన నుండి ప్రారంభించాలి.                                                                         

      మాట కాక- చేతలతో....!

అలనాడే గాంధీజీ కతి ఇష్టం స్వచ్చోద్యమ

మానాడే పదేపదే మహాత్ముడు ఉద్ఘోషించిన

మాట కాదు- చేతల- ఆ మహానీయుని స్వచ్చ సేవ

పంచాబ్దముల పర్యంతం స్వచ్చ సైన్య నిత్యసేవ!                                                                                                        

నల్లూరి రామారావు

స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

బుధవారం – 18/03/2020

చల్లపల్లి.    

 

4.06 కు శివరాంపురం రోడ్డులో
మంచు దుప్పట్లో స్వచ్చసేవ
కన్ను చించుకున్నా దారి కనపడని మంచులో సీనియర్ కార్యకర్త అర్జునరావు మాస్టారు