3058* వ రోజు....... ....           13-Mar-2024

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

3058* వ వేకువ సామూహిక శ్రమ సంతర్పణ!

            బుధవారం (13-3-24) వేకువ 4:25 కే చల్లపల్లికి నాలుగైదు కిలోమీటర్ల దూరంగా శివరామ  వెంకటాపురాల మధ్యస్తంగా మొదలైన సదరు శ్రమ 6:20 కి ముగిసింది. నేటి రహదారి సంస్కారక పండ్ల చెట్ల సంరక్షక శ్రామికులు 33 మంది.

            వెంకటాపురం జిల్లా పరిషదున్నత పాఠశాల చిన్నారులు 10 మంది పని హుషారును మరింత రెచ్చగొడుతూ ఒక మాజీ చెక్ పోస్టు ఉద్యోగి కేకలు, ఛలోక్తులో అక్కడ కావలసినంత సందడి!

            ఇద్దరు - ముగ్గురు కత్తి వీరులు ఎడం ప్రక్క డ్రైన్ లో దిగి పనిచేయడం తప్ప పాతిక మందికి పైగా శ్రమించింది 2 చోట్లనే - శివరామపురం దగ్గరగా బాటకు కుడి వైపున చట్టులుగా బిగిసిన డ్రైను మట్టి దిబ్బల వద్దా, వెంకటాపురం చెరువు సమీపాన కోనేరు ట్రస్టు వారి సౌజన్యంతో దినదినాభివృద్ధి చెందుతున్న పండ్ల మొక్కల దగ్గరా!

            పని షరామామూలే - నిరర్థకంగా, కొంత వికృతంగా బాట ప్రక్కన పడి ఉన్న మట్టి దిబ్బల్ని ఐదారుగురు గునపాల బల ప్రయోగంతో త్రవ్వుతుంటే,

            ఆరేడుగురు మట్టి పెళ్లల్ని డిప్పల్లో కెత్తడమూ, పారల్తో కూడ మట్టిని లాగుతున్న స్త్రీ కార్యకర్తల పనితనమూ,

            టాటా ఏస్ రాగానే పొలోమంటూ డజను మంది డిప్పల్ని మోసి, మట్టి పెళ్లల్ని తరలించి ట్రక్కును నింపడమూ,

            నిండు ట్రక్కు మట్టిని త్వరగా మామిడి - సపోట - నేరేడు పండ్ల చెట్ల కుదుళ్లలోకి వంచి, సర్దడమూ,

            ఒక సీనియర్ వైద్యుడు ఈ శ్రమదానాన్ని క్రమబద్ధీకరించడమూ,

            కార్యకర్తల గొంతులు తడారకుండా ఒక ఆనందుడు అరగారగా మంచి నీళ్లందించడమూ,

            మరొక సీనియర్ మోస్ట్ విశ్రాంతోద్యోగి శ్రమ దృశ్యాల్ని కెమేరాలో నిక్షిప్తం చేయడమూ,

            ఒక పాట గాడు టైమ్ ప్రకారం చల్లపల్లి వెళ్లి, కాఫీలు తెచ్చి, కార్యకర్తల కందించడమూ...

            ఇదంతా చల్లపల్లి స్వచ్చంద శ్రమదాన నమూనాగా నిలిచిపోవడమూ,

            ఆఖర్న శాస్త్రి గారి బిస్కట్ల పంపకమూ, DRK గారి సమీక్షానందమూ, మేడిగడ్డ సంతోష్ స్వచ్చ - సుందర వెంకటాపుర జయజయధ్వాన నినాదమూ - అందుకు దీటుగా మిగిలిన కార్యకర్తల ప్రతి స్పందనమూ,

            రేపటి వేకువ మనం కలిసేది కూడ శివరామపురం తరువాత వచ్చే రోడ్డు వద్దననే నిర్ణయమూ!

     అంకితులు మన చల్లపల్లికి 20

తల నొప్పీ, ఇతరములూ తరచుగ వేధిస్తున్నా

అరవయ్యేడేళ్ల వయసు అభ్యంతరపెడుతున్నా

ఆ సందడి ఆ కలివిడి ఆకర్షణలోన పడీ

స్వచ్చంద శ్రమదానమె వ్యసనంగా మార్చుకొనీ

S.కుమారి దైనందిన శ్రమ వేడుక కొస్తుంటది!

- నల్లూరి రామారావు

   13.03.2024