3064* వ రోజు....... ....           19-Mar-2024

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం!

అదే రహదారి - ఆ పనులే అంతమందే శ్రమదాతలు - @3064*

          19.3.24 (మంగళవారం) వేకువన తారీఖైతే మారింది గాని, కార్యకర్తల సంఖ్య మారలేదు - 21 మందే; మళ్ళీ శివరాంపురం దగ్గరి గుంటల రోడ్డే; 4:22 – 6:15 సమయమే, మట్టి గుట్టల్ని త్రవ్వి - ట్రక్కులో నింపుకొని ఎక్కడ పూల, పండ్ల మొక్కల పాదుల్లో అవసరముందో కనిపెట్టి, మొక్కలకు ముళ్ల కంచె చెడకుండా పాదుల్లో పోసి, సర్దే పనులే!

          “జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యంవాట్సప్ సందేశం క్రమం తప్పక చదువుతున్న వాళ్లకి ఒకే రోడ్డు మీద - ఒకే పని వేళ - ఇంచుమించు ఒకే కార్యకర్తలు విసుగూ విరామం లేక చేస్తున్న శ్రమదాన వార్తలు చదివీ - చదివీ బోరనిపిస్తున్నదేమో గాని

          తమది కాని రహదారిని స్వచ్ఛ - పరిశుభ్ర - సుందరంగా మార్చి, నిర్వహించేందుకు ఒక కోనేరు ట్రస్టువారెంత వ్యయిస్తున్నారో, కిలోమీటరు నిడివి గల రోడ్డు కిరు ప్రక్కలా పండ్ల పూల మొక్కలు నాటి, పాదులు చేసి, సారవంతమైన మట్టిని నింపేందుకు స్వచ్ఛ చల్లపల్లి సైనికులూ, వారి అడుగు జాడల్లో, వెంకటాపురం పాఠశాల పిల్లలూ ఎలా శ్రమిస్తున్నారో తెలుసుకోవడం అవసరమే!

          ఈ అన్ని వయసుల అన్ని హోదాల కార్యకర్తలు నిద్ర పట్టక మంచాలు దిగి వేకువనే 3-4 కిలోమీటర్లు వచ్చి మరీ శ్రమించండం లేదు

తమ సామాజిక బాధ్యతగా మాత్రమే వాళ్ళ శ్రమ!

నేనీ పూట మెచ్చిన శ్రమ దృశ్యములేవంటే :

- ఏడో, ఎనిమిదో తరగతి విద్యార్థినులిద్దరు టాటా ఏస్ లో మట్టి పెళ్లలు సర్ది, చెంగున క్రిందకు దూకడం;

- పట్టుమని పద్నాలుగేళ్ళు లేని స్కూలు పిల్లలు పారల్తో మట్టి లాగి, డిప్పలకెత్తి, అవసరమైన మొక్కల వద్దకు మోయడం;

- ఒక గంధం లక్ష్మణ చాలీచాలని వెలుతుర్లోనే ముళ్ల కంచె లోపల ఒడుపుగా మట్టిని పేర్చడం;

          ఇవే కాక మరో రెండు ఆకర్షణీయ దృశ్యాలను మన వాట్సప్ మాధ్యమంలో మీరైనా చూడవచ్చు

          - నేటి పని వేళ ముగిశాక రెండు వైపులా మొక్కల్తో శుభ్రమైన శివరాంపుర - వెంకటాపురం బాట ఎంత చక్కగా కనిపిస్తున్నదో!

          ఈ పూట ఉభయ గ్రామాల స్వచ్ఛ సుందరోద్యమ నినాదకర్త నందేటి శ్రీనివాసుల వారే!

          చల్లపల్లి స్వచ్ఛ సుందరోద్యమ ప్రాతకాపు గౌ.రావూరి సూర్యప్రకాశరావు గారు ఈ ఉదయం ఉద్యమ ఖర్చులకు గాను 25,000/- డ్రాఫ్ట్ రూపంలో ఇచ్చినందుకు కార్యకర్తలందరి ధన్యవాదములు.

          రేపటి వేకువ సైతం మనం కలిసేది శివరామపురం దగ్గరి రహదారి మీదనే!

     అంకితులు మన చల్లపల్లికి – 25

స్వచ్చోద్యమ తొలి దశలో సాహసించి ముందుకొచ్చి

వీధి కాపలాలు కాసి, వెలిగిన కప్పుర హారతి

చురుకుదనం - కరకుదనం చూపించిన భారతి

ఆర్థిక ముగ - హార్దికముగ అండనిచ్చు ధీమతి!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

 

  19.03.2024