3065* వ రోజు...........           20-Mar-2024

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం!

రహదారి పనుల్లో మార్పు – చేర్పులు - @ 3065*

          మార్పూ - చేర్పూ బుధవారం (20.3.24) వేకువ సమయానివి; రహదారి శివరామ - వెంకటాపురాల నడిమిది; ఉద్దేశం ఉభయ గ్రామాల మధ్య 1 కిలోమీటరు రోడ్డు శుభ్రంగా, చూసే వాళ్లకు ఇంపితంగా, ప్రస్తుతానికి సుమ సుందర సౌరభంగా, మరొక ఏడాది తర్వాత నాలుగైదురకాల ఫలవృక్షాలూ - వాటి పైన లంచ్ లు చేసుకొనే పక్షుల కిలకిల సందడులమయంగా కనువిందు చేయాలన్నదే!

          ఆశలూ, కలలూ చాల మందికుండవచ్చు గాని - మరీ ఇంతగా రోడ్లు ఊడ్వాలనీ, గుంటలు సరిజేయాలనీ, పూల - పండ్ల మొక్కలు నాటాలనీ, తమ చల్లపల్లే గాక - దూరంగా ఉన్న రహదార్లు కూడ పరిశుభ్ర – సుందర - మనోజ్ఞంగా ఉండాలనే కోరికలూ – కలలూ కని, అవి సాధించుకొనేందుకు చెమటలు కార్చాలనీ చూసే పిచ్చిమారాజులీ కాలంలో ఉండడమే ఇక్కడి విశేషం!

          ఏమైనా అనుకొన్నది సాధించాలనే పట్టుదలతో చల్లపల్లి – శివరామపురం - బోడగుంట మనుషులు కొందరు 4:23 కే  చిమ్మ చీకట్లో పలుగు-పారల్తో మట్టి పని మొదలెట్టారు.

          కొద్ది సమయానికే మట్టి పని ఐపోయి, రోడ్డు కిరువైపులా గడ్డీ-పిచ్చిమొక్కల మీద, ప్లాస్టిక్ వ్యర్థాల మీద - కొందరు కత్తుల్తో, కొందరు దంతెలతో, మరికొందరు చీపుళ్లతో విరుచుకుపడ్డారు . బాట కుడి ప్రక్కన కూడ చిన్న డొంకదారినీ శుభ్రపరిచారు.

 

          సుమారు 2 గంటల శ్రమదాన సమయంలో వారు చెమటలే క్రక్కారో, బట్టలకూ-మొహాలకూ. చేతులకూ దుమ్మే కొట్టుకున్నారో, మధ్యలో గడగడా మంచి నీళ్లే త్రాగారో – అదంతా ఒక రొటీన్ మాటర్!

          వెంకటాపురం బడిపిల్లలు రాకపోవడంతో సందడి మాత్రం తగ్గింది. నెల రోజులుగా తన కాలి దెబ్బ వల్ల రాలేక పోయిన షణ్ముఖ శ్రీనివాసుడే నేటి స్వచ్ఛ సుందరోద్యమ నినాద ప్రవక్త!

 

     ఇంకా 3 నాళ్ళు - గురు, శుక్ర, శని వారాల్లో శివరాంపురం దాక ఈ రహదారి శుభ్రతను సాధించాలనే Dr. D.R.K. గారి సంకల్పం!

          కనుక గురువారం సైతం మన కలయిక శివరామపురం సమీపాననే!

అంకితులు మన చల్లపల్లికి – 26

మహామురికి పనులన్నీ మాలెంపాటి అంజయ్యవె

మురుగ్గుంటలోనతడే- చెత్త బండి పైన తడే

రిస్కీ పనులేవైనా- కాస్కో చేసేస్తడే

ఎందుకొ నెలరోజులుగా ఇచ్చట కనిపించడే?

 

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  20.03.2024