3066* వ రోజు...........           21-Mar-2024

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం!

3066* వ నాటి శ్రమదానాన్ని సచిత్రంగా తిలకించండి!

        ఆ దానం గురువారం (21-3-24) వేకువ 4:19 – 6:15 కాలానిది; ఆ 20 మంది శ్రమదాతలు చల్లపల్లి, శివరామపురం, వెంకటాపురం, బోడగుంట నివాసులు. శ్రమ గ్రహీత శివరామపురం శివారు రహదారి; 2 గంటల శ్రమకు సాక్షులు వచ్చే - పోయే 70-80 మందైతే ఆగి సహకరిచినవారు ‘0’ మంది!

        తమకు కూడూ - గుడ్డా ఇవ్వని, పైసా ప్రతిఫలం దక్కని 30-40 పని గంటల శ్రమను ఇన్నేళ్లుగా స్వచ్ఛ కార్యకర్తలెందుకు ధారపోస్తున్నారంటే - అది కేవలం ‘ఏరోజుకారోజు ఒక చిన్న మంచి పని చేయగలిగాము’ అనే సంతృప్తి కోసమే! తాము బ్రతుకుతున్న సమాజం నుండి తీసుకోవడమే కాదు – కొంత ఋణం తీర్చగలమని ఋజువు చేయడానికే!

        ఇలా బుజువు పరచే వాళ్లలో పదేళ్ళ నుండి 76 ఏళ్ళ వయస్కులున్నారు. ఉద్గ్రంథాలు చదవని గృహిణులున్నారు; మేధావులూ ఉన్నారు! అందరి ఏకోన్ముఖ లక్ష్యం ప్రతి వేకువా ముందుగానే ఎంచుకొన్న వీధినో – డ్రైనునో – శ్మశానాన్నో - పదిమందీ వాడుకొనే ఏ బహిరంగ ప్రదేశాన్నో శుభ్రపరచడమే – సుందరీకరించడమే - ఆహ్లాదకరంగా మార్చడమే! అనగా – తమ సొంతలాభం కాస్త ప్రక్కన పెట్టి, తమ చుట్టూ ఉన్న మనుషుల కోసం ఆలోచించడమూ - తదనుగుణంగా కార్యాచరణమూ!.

        ఇలాంటి చల్లపల్లి స్వచ్ఛోద్యమ నడక దశాబ్దకాలంగా అప్రతిహతంగా - అభ్యుదయ పరంపరగా – ఆత్మ సంతృప్తిదాయకంగా – చాల వరకు సాఫీగా నడిచిపోతూనే ఉన్నది!

        పని చోటు దూరమై, గుంటల రోడ్డు మీద ప్రయాణం అభద్రమై, ఇంకా 10th పరీక్షలూ, ఒంటిపూట బళ్లూ రావడంతో విద్యార్థులూ, ఉపాధ్యాయులూ కార్యకర్తల సంఖ్య తగ్గినా పని తగ్గలేదే – ఉన్నవారికైనా బాటను ఊడ్వడంలో, ఎండిన డ్రైన్లో పచ్చి గడ్డినీ, పనికి మాలిన మొక్కల్నీ వేటాడడం ఆగలేదే. ఒక గురవయ్య పంతులు గారు తూము దగ్గర 2 కత్తుల్తోనే పనీ మానలేదే -  

        ఈ స్వచ్ఛ - సుందరోద్యమ సంకల్ప బలం అలాంటిది మరి! ఉన్న ద్విదశ కార్యకర్తలే శివరామపురం దాక – 100 గజాల రహదారి బారునా వీర విహారం చేశారు చూడండి – 5:59 నిముషాల కాలపు ఫొటోలో ఈ వేకువ పూట శుభ్ర - సుందరీకృత రహదారి భాగం ఎంత అందంగా ఉన్నదో!

        ఇంత పరిశుభ్రతకీ, అందానికీ వెనక చెమటలు చిందే 30 పని గంటల శ్రమ ఉండటం వేరే విషయమనుకోండి!

        కార్యకర్తల కాఫీలూ, కబుర్లూ ముగిసి, పల్నాటి అన్నపూర్ణ - భాస్కరుల కళ్యాణ జ్ఞాపక బిస్కట్ల పంపకం తర్వాత, అడపా వారి స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలతోనూ, రెండు ప్రవచనాలతోనూ,

        రేపటి వేకువ సైతం శివరామపురం దగ్గరే కలవాలనే నిర్ణయంతోనూ నేటి శ్రమదాన పరిసమాప్తి!

       అంకితులు మన చల్లపల్లికి – 27

ఎచట పుట్టెను – ఇచట మెట్టెను - ఎంత కృషి ఈ చల్లపల్లికి ?

వీధులూడ్చుట, ముగ్గులేయుట, వీధి గోడల రంగులద్దుట

చిత్ర లేఖన ఆకృతులతో విచిత్రములను తీర్చిదిద్దుట

దేసు మాధురి గ్రామ సేవలు తెలుసుకొనుటే మంచి ముచ్చట!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  21.03.2024