3075* వ రోజు...........           30-Mar-2024

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం!

                        3075* వ నాడు (30-3-24) కూడ ఆటోనగర్ దగ్గరే!

         ఈ శనివారం నాటి స్వచ్ఛ – సుందరరోద్యమ పాత్రధారులు 19+4 గురు. పని చోటొకటే గాని- కార్యకర్తల బృందాలు మూడు ! ముఖ్య బృందం విజయవాడ రోడ్డు ప్రక్కన మురుగు కాల్వ, దాని ఒడ్దున! 2 వది ఐదారుగురు పూనుకొన్న రోడ్డు దక్షిణ ప్రాంతం, ముగ్గురు మాత్రం అదేబాట ఉత్తరపు ఖాళీ జాగాలో వ్యర్థాలను ఖాళీ చేస్తూ!

         పని సమయం 4.18-6.10 వరకు. అసలక్కడ బాగు చేయదగిన వారు ఆటోనగర్ ప్రాంతీయులూ లేదంటే నారాయణరావునగరీయులూ, ఐతే - 1) శివరామపురం నుండి, 2)రామానగరం నుండి, 3) చల్లపల్లి నుండి వచ్చిన కార్యకర్తలు పూనుకొన్నారు.

         భక్తులో- కూలీలో లేక భక్తకూలీలోగాని, మరాఠీలు కొందరక్కడ రాత్రికి రాత్రి గుడారాలూ, అందుకు తగ్గ బాత్ రూమ్ లూ వేసుకొన్నారు - ఆ ఎగుడుదిగుడు- పిచ్చి మొక్కల మధ్య!

         స్వచ్ఛ కార్యకర్తల శ్రమైతే కనిపించింది గాని - పని పరిమాణమూ, వ్యాప్తి తక్కువ గానే ఉన్నది, 2 మార్లు కరెంటు పోయి, పంచమి చంద్రుని అరకొర వెలుగులో పని చేయవలసి వచ్చింది. అక్కడున్నవేమో గజమెత్తు పెరిగిన తాడిచెట్లూ, చిన్నా- పెద్దా ఈత చెట్లూ,  దోమలకంపా, గుర్తుపట్టడం కష్టమైన దురదగొండి మొక్కలూ!

         2 గజాలెత్తు తాడిచెట్టును సమూలంగా కొట్టడానికే ఇద్దరు కార్యకర్తలు 15 నిముషాల పాటు గొడ్డలితో, కత్తితో, దంతెతో ఎలా కష్టించిందీ చూశాను. అక్కడి డజను మందిలో ఎవరి కాలికోగాని ఈతముల్లు నాటుకొందట!

          ఎందువల్లోగాని - బహుశా, నిన్నటి పరిశుభ్రత వాళ్లకు నచ్చలేదేమోగాని, ఐదారుగురు ఆవిశాలమైన రోడ్డు దక్షిణపుటంచుబారునా మొక్కలు తొలగించి, ఊడ్చి శుభ్రపరిచారు.

         మరాఠీలకుఈ పనేమిటో తెలియక వింతగా చూస్తుండి పోయారు! అంతలో ఒక బృందావన కుమారుడు గబగబా వెళ్లి అందరికీ కాఫీలు తెచ్చి ఇచ్చాడు.

"కస్తూరి శ్రీను మైకందుకొని స్వచ్ఛ సుందరోద్యమనినాదాలకు పూను కొన్నాడు.

అందరూ రేపు ఆదివారం వేకువ మరొకమారు ఇదే ఆటోనగర్ ప్రాంతాన కలవాలని నిర్ణయించుకొని, ఇళ్లకేగారు!

    అంకితులు మన చల్లపల్లికి – 38

ఔర! జోడు కత్తులతో అడపా గురవయ్య పనులు!

గుబుళ్లలో- పొదలలోకి పోయి శ్రమిస్తున్నప్పుడు

వందలాదికొటేషన్లు వల్లెవేయు సమయమందు

ముక్కున వేలేసు కొనక తప్పదు ఎవ్వరికైనను!

 

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  30.03.2024