3079* వ రోజు...........           03-Apr-2024

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం!

ఆటోనగర్ డ్రైను ఒడ్డుకు మారిన శ్రమదానం దృశ్యం - @3079*

         నిన్నా, మొన్నా బందరు రహదారి మీదా, నాగాయలంక బాట ప్రక్కనా జరిగిన ఊరి మెరుగు బాటు చర్యలు ఈ బుధవారం (3/4/2024) వేకువ 4:18 6:08 నడుము బెజవాడ బాట ప్రక్కన ఆటోనగర్ వద్ద జరిగాయి. అందుకు పూనుకొన్నవారు 20-1 మంది.

         చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తలు ప్రతి వేకువా నిర్వహించేవి ఏవి బరువైన రిస్కీ సేవలో, ఏవి కాస్త తేలికపాటి సాఫీ పనులో చెప్పలేం. ఒక్కోమారు ముందు అనుకొన్న అంచనాలూ తప్పుతుంటాయి.

         ఈ ఆటోనగర్ ప్రాంతం శుభ్ర - సుందరకరణమే తీసుకొంటే - 2/3 రోజుల్లో ముగించగలమని తొలి అంచనా. ఐతే - అది 10 పని దినాల వరకూ పూర్తి కాక పోవచ్చని ఇప్పటి లెక్క!

         అలాగే - భారమైన తాడిమొద్దుల్ని 2/3 కిలోమీటర్ల దూరం నుండి తీసుకుపోయి, రోడ్లు, కాల్వ గట్లు బలహీనంగా ఉన్న చోట్ల పెగ్గులు ప్రాతి ఆ పొడవాటి - బరువాటి మొద్దుల్ని అడ్డంగా సర్దడమా లేక – అనువుగాని ఎగుడుదిగుడు చోట్ల నరికి, గుట్టలుగా పేర్చడమా – ఏది కఠిన శ్రమ?

         అసలింతకీ “పాతిక వేల మంది ఉన్న ఊరి కోసం ఈ కొద్ది మందే ఎందుకింతగా పాటుబడాలి? ప్రతి వేకువా  2 గంటల పాటు ఎందుకింత అరాటపడాలి?” అంటే - అది ఆ కొందరి సార్థకమైన సామాజిక బాధ్యత మరి! ఎవరి ప్రారబ్దం వాళ్లది!

ఈ వేకువ నేను రెప్పవేయక చూస్తుండిపోయిన 2-3 దృశ్యాలు:

* ఏ పనైనా జెట్ స్పీడ్ & యాక్యురసీతో చేసుకుపోయే ఒక సుందరీకర్త కత్తి, కత్తెర, గొర్రు ఆయుధాల్ని వాడుతూ ఈత, రేగు, మేడి వంటి చెట్ల గుబుర్లను నరుకుతూ - లాగుతూ శ్రమ వీర విహారం చేయడం;

* ఇంకో భారీ వృద్ధ కార్యకర్త – అంతలోతు డ్రైనులోకి ఎలా దిగాడోగాని - చాలీ చాలని వెలుతుర్లోనే పిచ్చి మొక్కల పనిబట్టడం;

* ముగ్గురు మహిళా కార్యకర్తలు కత్తితోనూ, దంతెలతోనూ చేసిన కష్టతర శ్రమ విన్యాసాలు

         6:20 తర్వాత ఆటోనగర్ విశాల వీధిలో జరిగిన సమీక్షా సభలో ముమ్మారు ఉద్యమ నినాదాలు ప్రకటించినది ఆకుల దుర్గాప్రసాదు.

         రేపటి వేకువ కూడ మనం ఆగవలసింది విజయవాడ రోడ్డు ప్రక్కన గల ఇదే ఆటో నగర్ వద్ద!

         అంకితులు మన చల్లపల్లికి – 43

బాల్యమందే దేసు జాహ్నవి స్వచ్ఛ సుందర కార్యకర్తగ

గ్రామ శ్రమదానోత్సవాలకు రంగభూమి ప్రచారకర్తగ

జన్మ తేదీ నాడు ట్రస్టుకు చందాలిచ్చే దానకర్తగ

ఎట్లు నిలిచెనొ - సాగుచుండెనొ – ఇంత మంచిగ - బహుముఖమ్ముగ!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  03.04.2024