3080* వ రోజు...........           04-Apr-2024

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం!

ఆటోనగర్ వద్ద జరిగిన నేటి శ్రమదానం - @3080*

         4.4.24 - గురువారం వేకువ విశేషాలన్నమాట. ఎప్పటిలాగానే 4:20 సమయానికే మొదలైన వీధి పరిశుభ్రతా ప్రయత్నం 100 నిముషాల పాటు జరుగుతూనే ఉన్నది.

         ముగ్గురు బెజవాడ రోడ్డు ప్రక్క డ్రైనులోనే పనిచేసుకుపోయారు. అక్కడున్న ఎంగిలి విస్తర్లూ, వరిగడ్డి పరకలూ, కాల్వ ఎండిపోయినా ఇంకా పచ్చగా పెరుగుతున్న రకరకాల పిచ్చి మొక్కలూ, సీసాలూ, సంచుల బారి నుండి ఆ 100 గజాల కాల్వకు విముక్తి కల్గించారు! అందుకు అక్కరకొచ్చినవి కత్తులూ, దంతెలూ!

         ఇక మురుగు కాల్వగట్టునూ, లోతట్టునూ ఆక్రమించి, ఏపుగా పెరిగిన ఈత, తదితర చెట్ల పొదల మీద యుద్ధం ప్రకటించిన మరొక బృందానిది చెప్పనలవికాని కష్టం!

         ఒక్కో తాడి చెట్టును సమూలంగా తొలగించిన ఇద్దరేసి ప్రయత్నం ఫలించినట్లే! బితుకు బితుకు మంటూ కాక - ఉత్సాహంగా, సామూహికంగా, సదుద్దేశంగా జరిగే నిస్వార్థ కృషి ఎలా ఉంటుందో చూడాలనుకొంటే అది ఈ చల్లపల్లిలో ఎప్పుడైనా కనిపించే దృశ్యమే!

         వాతావరణం మారిపోతున్నది - రోజు రోజుకూ ఉష్ణోగ్రత పెరుగుతున్నది. గాలి స్తంభించిన పొడి వాతావరణంలో పనిచేస్తున్న ప్రతి కార్యకర్త బట్టులు చెమటతో తడిసి, అంటుకుపోయి, నుదుటి చెమట చుక్కలు కళ్ళలోకి జారుతున్న సన్నివేశాలు మాత్రం ఇప్పటికీ నా మనస్సులో నిలిచి పోయినవి!

         6:00 తరువాత అ ఎగుడుదిగుడు కాల్వ గట్టు మీద పని ముగించి నీరసంగా నడిచి వస్తున్న కార్యకర్తలు మాత్రం ఈ స్వచ్ఛ సుందర చల్లపల్లికి గర్వకారణాలుగా మిగిలిపోతారు!

         కారకర్తలు కొద్దిమందే ఐనా, వాళ్ల శ్రమ ఫలితంగా అటు డ్రైనులోనూ, కాల్వ గట్టు మీదా పోగుపడిన వ్యర్ధాల గుట్టలు సజీవ సాక్ష్యాలుగా మిగిలాయి!

         6:15 కు కాఫీల - కబుర్ల పిదప - ఎక్కడో కన్నడ దావణగెరె నుండి వేమూరి అర్జున మాస్టారి పరామర్శల పిదప –

         BSNL నరసింహ కార్యకర్త ముమ్మారు పలికిన గ్రామ బాగుదల నినాదాలు విన్పించాయి,

         రేపటి వేకువ శ్రమ కోసం అందరూ బెజవాడ బాటలోని కాటాల వద్ద కలవాలని నిర్ణయించారు!

      అంకితులు మన చల్లపల్లికి – 44 - 49

ఒక్కరిద్దరు కారు నల్గురు గోళ్ల వంశపు కార్యశూరులు

అగ్రజుండగు సాంబశివుని అనుసరించిన కార్యకర్తలు

రామ్ ప్రసాదూ, ద్రోణ, వెంకట రత్న మనబడు కర్మ వీరులు

కొసరుగా ఒక కృష్ణ సైతం కొసరి కొసరీ ఊరి సేవలు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త                      

  04.04.2024