3081* వ రోజు...........           05-Apr-2024

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం!

                                 3081*వ నాటి శ్రమ సంచనలనం!

         అది 5-4-24 - శుక్రవారం వేకువ 4.18-6.10 సమయానిది. శ్రమజీవులు 20 మంది; శ్రమ ప్రదేశం విజయవాడ రోడ్డులో కాటాల ఎదుటి డ్రైను ఉభయ గట్లూ, 70-80 గజాల రహదారీ! కొసరుగా ఆటోనగర్ లోని 2 పెద్ద ముళ్ల చెట్లూ!

         నేనేదో పైపైన చూసి, వీలైన మేరకు పరిశీలించి, గుర్తున్నకాడికి ఇలా వ్రాస్తుంటాను గాని – ప్రతి ఒక్కరి ఖడ్గ చాలనాలూ, గొర్రుల పని విన్యాసాలూ, చీపుళ్లరిగేలా ఊడ్పులూ, ఒక్కొక్కరు కార్చే చెమటలూ, 68-73 ఏళ్ల వయస్కులు లోతైన మురుగు కాల్వలో దిగి బాలెన్సు చేసుకొంటూ చేస్తున్న పనులూ, అన్నిటినీ సవివరంగా తెలుపగలుగుతున్నానా!

         ఒక వేళ ఆ పని చేయగలిగితే ప్రతి రోజూ ఎన్నెన్ని పేజీలు నింపాలి? తమ గ్రామ సమాజం పట్ల ప్రతి కార్యకర్తకూ ఉన్న నిబద్ధతనూ, అతడు పదేళ్లుగా మాలాంటి వాళ్లకు పంచుతున్న ప్రేరణనూ, తన సాంఘిక బాధ్యతను  కొంతైనా తీర్చుకొంటూ పొందే సంతృప్తినీ ఈ 10-15 వాక్యాలలోనే చెప్పాలంటే శ్రీ శ్రీ లాంటి వాడెవడో దిగి రావాలి!

         గత 10 పనిదినాల్లో 20-30 మంది అనువుగాని చోట చూపిన తెగువ వల్లనే సుమారర కిలోమీటరు డ్రైను గట్టు అనవసరమైన చాల పిచ్చి-ముళ్ల చెట్లనూ, గడ్డిని కోల్పోయి, కొన్ని ఈత చెట్లను సుందరీకరించుకొని,  డ్రైను లో చాల భాగం బాగుపడింది!  ఆలస్యంగానైనా ఎట్టకేలకు వాళ్లు ఆ చిట్టడవుల అస్తవ్యస్తతను జయించారు.

         3-4 రోజులుగా రావీలు పడని వణిక్ప్రముఖుడొకాయన గోకుడు పారతో కసిగా పనిచేసి, సంతృప్తి చెందితే, 60 రోజులకు పైగా  స్వచ్చంద శ్రమ దానానికి దూరమైన మరొకాయన డ్రైన్ను శుభ్రం చేసి కొంత భారం తగ్గించు కొన్నాడు!  మొత్తానికి వీధి శుభ్ర- సుందరీకరణం మళ్ళీ ఊపందుకొన్నది!  

         6.20 సమయంలో 12 నెలల తర్వాత శ్రమదాన పునః ప్రవేశం చేసిన మాలెంపాటి అంజయ్య గారి ఉద్యమ సంకల్ప నినాదాలతోనూ, అడపా వాని బాబూ జగ్జీవన్ రామ్' గొప్పతనం వివరణతోనూ,

         రేపటి వేకువ మనం కలిసేది విజయవాడ రోడ్డులోని బాలాజీ అపార్ట్మెంట్ల       వద్దననే నిర్ణయంతోనూ -

               నేటి కృషి పరి సమాప్తి!

      అంకితులు మన చల్లపల్లికి – 50

ఇడుగో వీరాధి వీర సింహుడు మన కొర్రపాటి

ఉనికి చల్లపల్లి, వ్యవసాయం రాముడు పాలెం

 కొంచెం సేవానిరతీ, ఇంకొంచెం సమయ స్ఫూర్తి

ఏ కొంచెం తీరికున్న ఇతని గామ సేవనం!

 

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త                      

  05.04.2024