3082* వ రోజు...........           06-Apr-2024

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం!

20 మంది స్వచ్ఛ కార్యకర్తల శ్రమదానం మెరుపులు - @3081*

         6.4.24 - శనివారం కూడ 9 మందికి 4:20 కే తెల్లారింది - అప్పటి వాట్సప్ ఫొటో ప్రకారం! స్థలం బెజవాడ రోడ్డులోని బాలాజీ భవన విభాగాల ప్రాంతంలో నిన్నటి తరువాయిగానే!

         నిన్నటి పనులకూ, నేటి కృషికీ తేడా ఏమంటే - నిన్న పనిచేసిన డ్రెన్లు రెండూ పొడివి, నేటిదేమో అపార్ట్మెంట్స్ నుండి నిరంతర కుజల స్రవంతి వల్ల తగుమాత్రం దుర్గంధ మయ మురుగు కాల్వగట్టు! పైగా ఈ కార్యకర్తలే  పెంచిన బోగన్ విలియా ముళ్ల పూల చెట్లున్న భాగం! ఇక్కడ పనిమంతులు గ్రామ సర్పంచితో సహా 10 మంది!

         ఈ చోటుకు తూర్పు డ్రైను గట్టు మీద కత్తితో - గొర్రుతో ఒంటరి పోరాటం చేస్తున్న 68 ఏళ్ల మాజీ ఉద్యోగి.

         అపార్ట్మెంట్స్ ఎదురుగా చకచకా పని చేసుకుపోతున్న ముగ్గురు ప్రసాదుల కర్ర ఖడ్గ చాలనాలూ, వాటితో రకరకాల మొక్కల, తీగల కాలుష్య విధ్వంసం!

         అందమైన భవనాల ఎదుటి తుక్కూ, మురికీ, దుమ్మూ ఈ ముగ్గుర్నీ ఎంతగా టెంప్ట్ చేయకపోతే వాళ్లు ట్రాన్స్ఫార్మర్ క్రిందా చుట్టూ శుభ్రపరుస్తారు? ఆ పావుగంట పాటూ వాళ్ళ వదనాల్లో నిశ్చింత! చూస్తున్న నాకు మాత్రం భయం రవ్వంత!

         సుమారు 2 గంటల సమన్వయ శ్రమదానానికి శంకర శాస్త్రి గారి వాట్సాప్ ఛాయాచిత్రాలూ, ద్వాదశి వంకర చంద్రుడూ సాక్షులు! 6:15 దాటాక పరిశుభ్ర సుందరీకృత 70-80 గజాల రహదారి మరొక సాక్షి!

         కాఫీ కబుర్లు ముగిసి, 6:20 కి జరిగిన నేటి శ్రమ సమావేశంలో పసుపులేటి సత్యం గారి విస్పష్ట నినాదాలూ,

         రేపటి వేకువ మనం ఆగి శ్రమించవలసింది క్రొత్త అపార్ట్మెంట్ల వద్ద (నూకల సుబ్బారావు గారి అపార్ట్మెంట్స్) అనే నిర్ణయమూ!

అంకితులు మన చల్లపల్లికి – 51, 52

ఒక బలమగు కార్యకర్త వక్కలగడ్డ రామకృష్ణ

ఆతని సహచరి - అదిగో ఆసుపత్రి నాగలక్ష్మి

సకుటుంబ స్వచ్ఛసేవ సాగుచున్న దిచ్చట

ఒక్క చల్లపల్లిలో మాత్రమే ఒనగూడే ముచ్చట!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త                      

  06.04.2024