3083* వ రోజు....... ....           07-Apr-2024

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం!

    ‘మా గ్రామం కోసం మేమున్నాం’ అనే 32 మంది శ్రామిక సమూహం @ 3083*

         ఆదివారం (07-04-24) వేకువ కాలపు వీధి శ్రామికుల్లో బాగా అణచి పెట్టి, చెమటలు కార్చిన వాళ్లు పాతిక మందైతే అరేడుగురం రకరకాల కారణాలతో అలస్యంగా వచ్చి, చిన్న చిన్న పనులు చేసిన వాళ్లం!

         ఐతే- సొంత అవసరాలకు తప్ప, గ్రామ ఉమ్మడి ప్రయోజనం కోసం ఏనాడూ చింతించని - వేకువ సమయాన కాలు బైటకు పెట్టని గ్రామ సోదరుల కంటే మేం కాస్తనయం!

         నిన్నటి నిర్ణయానుసారం ఈ వేకువ వీధి పారిశుద్ధ్య – శుభ్ర - సుందరీకరణ కృషి 4.18 కే మొదలై, 6.10 దాక జరుగుతూనే ఉండెను!  మురుగు నీటితో బాటు వెదురు బుట్టల్నీ, పచ్చళ్ళ జాడీలనీ, ఖాళీ ప్లాస్టిక్/ గాజు సీసాల్ని నింపుకొన్న బెజవాడ రోడ్డు పడమటి డ్రైను మాంచి ఒకటో రకం దుర్గంధాన్ని వెదజల్లుతూనే ఉండెను!

         సదరు డ్రైన్ దగ్గర ఆ కంపునే ఇంపుగా పీలుస్తూ డజను మంది కార్యకర్తలు వ్యర్థాల్ని  పైకి లాగుతూ, విడగొడుతూ, ట్రాక్టర్ లోకి ఎగుమతి చేస్తూ, ఎవరి స్థాయికి తగ్గట్లు చెమటలు క్రక్కుతూ - మంచినీళ్లు త్రాగేందుకు తప్ప పని ఆపకపోయిరి!

         ఎండు ముళ్లకంపలున్నా, లోపలేముందో తెలీని ప్లాస్టిక్ మూటలున్నా, దురద గొండాకులు తగిలినా, ‘ఈనాటి లక్ష్యం నెరవేరాల్సిందే’ అనే శ్రమదాతల పట్టుదలను గమనిస్తూనే ఉంటిని!

         మరో నలుగురు కత్తులు, చీపుళ్ళతో అపార్ట్మెంట్లకు ఉత్తరాన చిన్నరోడ్డునూ, ఖాళీ స్తలాన్నీ శుభ్ర పరుస్తూనే ఉండిరి !

         మరో10 మంది బాలాజీ అపార్ట్మెంట్ల గేటు ర్యాంపుల మీద పేరుకు పోయిన మట్టినీ, ఆ ప్రక్కనున్న 2 చెట్లనూ తొలగిస్తూ – ట్రిమ్ చేస్తూ -

         తాడిచెట్ల నడుమ రకరకాల వ్యర్థాల్ని  పరిష్కరిస్తూ, దూరంగా ఉన్న ట్రాక్టర్ లోనికి చేరవేస్తూ తీరిక లేకుండిరి!

         ఎవరెంత శ్రమించి, చెమటలతో బట్టలు తడిసి, దుమ్మంటుకొంటే ఏమి గాని, 6.03 సమయపు ఒక్క వాట్సప్ ఫొటో చూడండి – బెజవాడ రోడ్డు గానీ, మార్జిన్లు గానీ. ఉభయ డ్రైన్లు గానీ ఎంత చూడ ముచ్చటగా ఉండెనో !

         6.20 కి జరిగిన తుది సమావేశంలో జపాను దేశ వింతల్ని పర్యాటక వైద్యులు తెలియజేసి, విన్న ఒకరిద్దరు తాము కూడ వెళ్లాలని ఆవేశపడి, గ్రామ సర్పంచమ్మ దైనందిన స్వచ్చోద్యమ నినాదాలను ప్రకటించి, నేటి 2 గంటల కార్యక్రమం ముగిసెను!

         వరుసలో నా ప్రక్క నిలబడిన ఒక కార్యకర్త మూణ్ణాలుగుమార్లు ఆనుకొని అరగంటైనా ఆరని అతని చెమట నాకంటుకొని ధన్యుడి నైతిని!

         పోతే, సోమ మంగళ వారాలను రెస్క్యూ టీమ్ వారికి కేటాయించి,

          బుధవారం వేకువ కూడా మన శ్రమదాన క్షేత్రం బాలాజీ అపార్ట్ మెంట్ల దగ్గరే అని కూడ తెలిసెను !

అంకితులు మన చల్లపల్లికి – 53

రక్త పరీక్షల మిత్రుడు ఈ ఎద్దు రవీంద్రుడు

స్వచ్చోద్యమ తీరు-తెన్ను చురుకగు పరిశీలకుడు

వారానికి ఒక్కమారు వచ్చి చేయు శ్రమదానం

చెప్పకనే చెప్పుతోంది ఆతని అంకిత భావం!

 

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త                      

  07.04.2024