3099* వ రోజు...........           23-Apr-2024

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

3100* కు ఒక్కడుగు దూరంలో!

         మంగళవారం(23/4/24) వేకువ వీధి పారిశుద్ధ్య శ్రమను దక్కించుకొన్నది - చల్లపల్లికి కాస్త దూరంగా, పాగోలు పంచాయతీ పరిధిలోని NTR ఉన్నత పాఠశాలకు దక్షిణ భాగమే! ఏమార్పు - చేర్పులు లేకుండా నిన్నటి 6+2 కార్యకర్తల బృందమే!

         కాకపోతే - నిన్నటి దాక ఈ రెస్క్యూ పనివాళ్ల శక్తంతా ప్రధానంగా పాఠశాల ప్రక్క డ్రైనైతే, నేడది పొలం వైపుకు మారింది! ఈ డ్రైన్ నిన్నటి దాంతో పోలిస్తే చిన్నదే గాని - వ్యర్ధాల విషయంలో తక్కువదేం కాదు. ఎన్నెన్ని ముళ్ల మండలు, వరిగడ్డి, ప్లాస్టిక్ తుక్కులు, ప్రాత గుడ్డలు, తాటాకులు, ధర్మోకోల్ అట్టలకో అది నిలయం!

         ఈ దిక్కుమాలిన వ్యర్ధాల సమీకరణ 5 గురు స్వచ్ఛందయోధులదైతే - పాఠశాల వైపు మార్జిన్లో శుభ్రపరచిన బాధ్యత మరో ఇద్దరిది!

         ఒక సందర్భంలో చేతికి గద్ద గోరు ముళ్ళు గీసుకుపోయిన ఒకాయన్ని “కాస్త పనాపి, ఆ గాయం సంగతి చూడొచ్చు గదా’ అని నేనంటే - “ఏవండీ! మనం చేస్తున్నదే 2 గంటల్లోపు శ్రమదానం - మధ్యలో పనాపడమా? ఇంటికివెళ్లాక చూసుకొంటాలే” అని బదులిచ్చాడు!

         అదీ సొంతూరి కోసం శ్రమదాన స్ఫూర్తంటే! ఇలాంటి ఏ బలమైన తాత్త్విక పునాది లేకుండానే 3099 రోజుల స్వచ్ఛ సుందరోద్యమం సాధ్యపడిందా?

         నేటి పనులు ముగించాక - వారు పొలంలో దిగిన ఫొటోలో వాళ్ల ముఖాల్లో కాస్త అలసటుంటే ఉన్నది గాని ఎంత సంతృప్తో గమనించండి!

         రామబ్రహ్మంగారి ఫల పందేరంతో, శాస్త్రి గారి మరొక తినుబండారంతో 6.30 కి ముగిసిన ఈ వారపు రెస్క్యూ పనుల్లో – స్వచ్ఛ సుందరోద్యమ నినాదకర్త తూములూరి లక్ష్మణుడు!

         రేపటి విసృత కార్యకర్తలు కలిసి శ్రమించవలసిన చోటు – విజయవాడ రోడ్డులోని 6 వ నంబరు కాల్వ వంతెనే!

         అంకితులు మన చల్లపల్లికి – 70

శ్రమ తెలియక సంగీతం, సాహిత్యం వినునప్పుడు

ప్రతి వేకువ స్నేహంపై పాటవినే మిత్రులార!

దాసరి స్నేహ సృజించిన స్తవనీయ శ్రమ దాతృత –

ఆ సరళత - విస్పష్టత అందరమూ పాటిద్దాం!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త     

  23.04.2024