3100* వ రోజు...........           24-Apr-2024

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

3100* నాళ్ల సుదీర్ఘ శ్రమదాన విశేషం!

         ఆ విశేషం బుధవారం (24-4-24) నాటిది; 27 మంది చేసిన 40 కి పైగా పని గంటల రకరకాల కర్తవ్యాలవి; వేసవి ఉక్కపోతల మధ్య – ఇంటి పనుల్ని ప్రక్కన పెట్టి, బెజవాడ రాదారిలోని 6వ నంబరు కాల్వ ప్రాంతంలో 6-7 గురు స్త్రీ మూర్తులు చీపుళ్లు పట్టి చేసుకుపోయినది;

         ఇంకా తమ ఉషోదయ సమయ వాహ్యాళి తదితర అవసరాలను వాయిదా వేసి, గ్రామ సామాజిక బాధ్యతకు పూనుకొన్న ఉద్యోగ – ఉద్యోగేతర – పింఛనుదార్ల - వృత్తికారుల ప్రయత్నమది! మొత్తమ్మీద – ఒక గ్రామానికి ప్రయోజనకరంగా, ఆహ్లాదకరంగా, తమకూ కొంత సంతృప్తిదాయకంగా, శారీరక శ్రమతో ఆరోగ్యప్రదంగా నిర్వహించిన శ్రమయజ్ఞమది!

         పదిహేను మంది రహదారి ఉభయ దిశల్లోని డ్రైన్లలో దిగి, పిచ్చి చెట్లనూ, ముళ్ల మొక్కల్ని నరికినా,

         స్కూలు పిల్లల LWD కాగితం ముక్కల్ని, ఎండుటాకుల్తో కలిపి ఉడ్చినా,

         రోడ్డునూ, మార్జిన్లనూ వ్యర్ధరహితంగా ఊడ్చి – మార్చేసి - అద్దంలా తయారు చేసినా,

         3 గోనె సంచుల్నిండా గాజు సీసాలూ, ప్లాస్టిక్ వస్తువులూ, సంచులూ ఏరినా,

         పెద్ద ట్రక్కు నిండా తాము ప్రోగులు చేసిన వ్యర్ధాల్ని నింపినా, ఒక కుడి చేతి ప్రసాదు సాయంతో మరొక ఎడం చేతి ప్రసాదు అడ్డదిడ్డంగా పెరిగి, ఒరిగిన భారీ బోగన్ విలియా ముళ్ల పూల చెట్టును 20 నిముషాల పాటు నరికి శిక్షించినా,

         ఈ సంఘటనలన్నింటినీ ఒక శాస్త్రి గారు కెమేరాలో బంధించినా...... ఇవన్నీ తమ ఊరి వీధులు శుభ్ర - హరిత సుందరంగా ఉండాలనే ఉమ్మడి లక్ష్యంతోనే!

         6.30 వేళ ఒక స్వచ్ఛ – సుందరోద్యమ ముఖ్య గాయకుడు పరవశంగా ఉద్యమ నినాదాలు ప్రకటించినా, స్వచ్ఛ కార్యకర్తల శ్రమను ఉత్తేజకరంగా

         “మేము స్వచ్ఛ సైనికులం – మాది వజ్ర సంకల్పం....” అని గానం చేసినా, ఎప్పటిలాగే DRK డాక్టరు గారు స్వచ్చోద్యమకారుల దైనందిన శ్రమకు నివాళులర్పించినా..... ఇదంతా అర్ధం చేసుకోగలిగిన వాళ్ళకు అనందప్రదమే!

         రేపటి వేకువ కాలపు శ్రమ సందడి కూడ విజయవాడ బాటలోని 6 వ నంబరు కాల్వ వంతెన నుండే మొదలుకానున్నది!

    అంకితులు మన చల్లపల్లికి – 71

BSNL బ్రాండు ఉన్న బాబూరావిడుగో

మురుగు కంపు తూముల్లో - చిటారు కొమ్మల్లో

ఎగబ్రాకుట - దిగిపోవుట ఈతని కలవాటే

గ్రామం కాలుష్యంపై కత్తి గట్టి నందుకే!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త     

  24.04.2024