3107* వ రోజు...........           01-May-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

కార్మిక దినోత్సవ శ్రమ సంకల్పం! - @3107*

         “మేడే అనబడే 1.5.24 - బుధవారం వేకువ 4.15 కే ఊరికి కొంత ఎడంగా - బెజవాడ బాటలో వంతెన వద్ద 10 మంది కార్యకర్తల హాజరు! సాధారణ పని సమయం 4.30 - 6.00 గా నిర్ణయించుకొన్నా -ఇంచుమించు ఏనాడూ ఆ సమయ నియమం అమలు కావడం లేదు - 4.00 లేక 4.15 కు తొందరపడేవాళ్లు పడుతూనే ఉంటారు! 6.15 లేక 6.30 వరకూ కొందరు కష్టిస్తూనే ఉన్నారు!

         ఇదేదో దైవకార్యమన్నట్లూ, ఉద్యోగ విధి అనేట్లూ – వానైనా, ఎండైనా, హిమపాతమైనా చాతనైనంత గ్రామ సామాజిక విధులు నెరవేరుస్తూనే ఉన్నారు! సోమ - మంగళవారాల ఎడబాటును భరించలేని కొందరైతే - బుధవారం వేకువ 4.00 ఎప్పుడౌతుందా అని ఆత్రంగా చూస్తుంటారు కూడ!

         ఈ వేకువ 4 కిలోమీటర్ల దూరం నుండి వచ్చిన ఒక కర్షక కార్యకర్తనే తీసుకొందాం - ఉదయం 6.30 కి తన పొలం తడపుకొటానికై అతగాడు. 6.00 కాకముందే హడావిడిగా వెళిపోయాడు! మిగిలిన 24 మందీ

         - పంటకాలువ దక్షిణ గట్టునూ, దాని ప్రక్కన డ్రైనునూ కొందరు క్షుణ్ణంగా బాగు చేసి గాని విరమించలేదు.

         - ఆదివారం నాడు విశ్లేషించిన వంతెన పడమటి గట్టును మరి కొందరు తెల్లారక ముందే బాగుచేశారు.

         - బెజవాడ రోడ్డును ఊడ్చి, శుభ్రపరచిన బాధ్యులు నలుగురు.

         - ఆదివారమూ, ఈ ఉదయమూ సుందరీకరణ ఫలితంగా పుట్టుకొచ్చిన కొమ్మ - రెమ్మల వ్యర్థాలను షెడ్దర్ తో పొడి చేసిన పనుల్లో ఆరేడుగురు!

         - మొత్తమ్మీద నేను చూసినంతలో ఏడెనిమిది మంది మొహాలు, దుస్తులు, షెడ్దర్ పొడో, దుమ్మో అంటుకొని చిత్రవిచిత్రంగా కనిపించారు.  

         ఇక - చల్లపల్లిలో చాల మంది కర్ధమైనదేమంటే - ఈ స్వచ్ఛ కార్యకర్తలుండగా తమ ఊరి స్వచ్ఛ - శుభ్రతలకు డోకా లేదని!

         కోడూరు వెంకటేశ్వరుని శ్రమదాన భీకర నినాదాలతో మొదలైన తుది సమావేశంలో - మొన్న గతించి, నిన్న తుది సంస్కారములు జరిగిన – ఎప్పటికీ మరువరాని – స్వచ్ఛ సైనికుల కుల గురువు - కంఠంనేని రామబ్రహ్మం గారి ప్రస్తావనా,

         కొడాలి జగన్మోహనరావు గారి పితృ వియోగమూ,

         రేపటి వేకువ కూడ ఇదే బెజవాడ బాటలో - వంతెన వద్దనే కలవాలనే నిర్ణయమూ జరిగిపోయెను!

         నిన్నటి మరొక దాతృత్వ విశేష మేమంటే ఇప్పటికే చాల విడతల ఆర్ధిక సహాయం చేసిన మల్లంపాటి ప్రేమానంద మోహన్ గారి తాజా విరాళం 50,000 /- ఇప్పటికి ఈ కుటుంబీకుల భూరి విరాళం మొత్తం 1,17,223/- గా తేలింది! (ఈయన శారీరక శ్రమదానం కాక).  

        అంకితులు మన చల్లపల్లికి – 78

మరొక సంఘజీవి కలడు - మండవ శేషగిరిరావు

మొదలు చెడే బేరంగా ముమ్మర సేవలు వానివి

ముందూ - వెనక చూడకుండ ముందు తరం వారి కొరకు

జ్ఞానం వాకిళ్లు తెరచు ధ్యానంలో తాను మునుగు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త     

   01.05.2024