3109* వ రోజు...........           03-May-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

చైత్రమాస దశమీ శుక్రవాసర వీధి కర్తవ్యాలు - @3109*

         అనగా 3-5-24 వేకువ సమయానివి. అవి ఇప్పటివి కావు - దశాబ్దకాల వేల రోజుల సామాజిక విజయ సంకేతాలు! చాలా చోట్ల వ్యక్తులు విజయాలు సాధిస్తుంటారు గాని ఈ ఒక్క ఊళ్లో మాత్రం పరిమితంగానైనా ఒక సామాజిక - సామూహిక విజయాన్ని చూడవచ్చు.

         అలా విజయవంతమైన బ్రహ్మముహూర్తాలలో ఈ నాటిదీ ఒకటి! దానికి తొలి మెట్టుగా తొమ్మిది మంది గ్రామ కేంద్రానికి కిలోమీటరు దూరాన - ప్రభుత్వోన్నత పాఠశాల సమీపాన కనిపించిన దృశ్యం! వారు కాక మరో డజను మంది వచ్చి కలిసి, విజయవాడ బాటలో 6 వ నంబరు కాల్వ వంతెన నుండి - 150 గజాల బారునా తీర్చుకొన్న గ్రామ సమాజ ఋణం!

         అటు ప్రక్క సిమెంటు కొట్టు వల్ల సిమెంటు ధూళీ, రాతి ముక్కల వీధి దురాక్రమణ! ఇటు వైపున తడీ –పొడీ కాని డ్రైనులో బస్తాల కొద్దీ వ్యర్థాల సమీకరణ.

         ఇక చీపుళ్లతో వీధి ఊడ్పుల శ్రమ ఎప్పుడూ ఉండేదే – అది ముగ్గురి వంతు. రోడ్డు ప్రక్కన చెట్లు చూడగానే, వాటి కొమ్మల ప్రవర్తన బాగలేకుంటే సుందరీకర్తలూరుకొంటారా? వాటికి మర్యాదా - మప్పితం నేర్పి తీరుతారా?

         డ్రైనులో దిగి, వ్యర్దాల్ని పైకి తెచ్చే క్రమంలో - ఎప్పట్లాగే ఇద్దరి బట్టలు ఖరాబు! పేరుకిది వసంత కాలమే గాని - ఠారెత్తించే ఎండలూ చిరాకును త్రిగుణీకృతం చేస్తున్న ఉక్కపోతల ఉక్కిరిబిక్కిరి. ఈ క్రూర నేపథ్యంలోనే 21 మంది వడ్డీతో చెల్లించుకొన్న ఉన్న ఊరి ఋణం!

         ఇక - అంతా కాఫీలు సేవించాక కరువుతీరా కబుర్ల పిదప - మౌన సందేశకారుడైన జాతిపిత సాక్షిగా ప్రభుత్వోన్నత పాఠశాల ప్రధానాధ్యాపకుడు – అనుమకొండ దుర్గాప్రసాదుని విస్పష్ట స్వచ్ఛ – సుందరోద్యమ నినాదాలు! ఎలుగెత్తి అందరూ వాటికి చేసిన ప్రతిధ్వనులు!

         ప్రాతూరి ఉదయ శంకర శాస్త్రి గారి నెలవారీ చందా 5,000/-  చెక్కు!

         కొసరుగా అడపా వారు గుర్తు చేసిన గాంధీ సూక్తులు!

         రేపటి వేకువ కూడ ఇదే గాంధీ స్మృతి వనం వద్దనే ఆగి బెజవాడ వీధిని శుభ్రపరచాలనే నిర్ణయమూ!

        అంకితులు మన చల్లపల్లికి – 80

అప్పుడప్పుడొస్తేనేం అనుమకొండ దుర్గాప్రసాదు?

బరువు పనులు ఎన్నిటినో అవలీలగ చేయగలడు

ఏపని ముట్టైనా ఇట్టే వాడేయగలడు

ఈ గ్రామ స్వస్తతకై ఇచ్చిన భరోసా ఈతడు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త     

   03.05.2024

 

ప్రాతూరి ఉదయ శంకర శాస్త్రి గారి నెలవారీ చందా 5,000/- చెక్కు!