3116* వ రోజు...........           10-May-2024

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

మూడువేల నూట పదార్ల స్వచ్ఛ సుందరోద్యమం!

            అది శుక్రవారం - అనగా 10-5-2024 నాటి ఒక ప్రత్యేక సంఖ్యా దినం! అసలీ సంఖ్య 3333 కు ఇప్పటికే చేరుకోవలసి ఉండెను గాని కోవిడ్ రెండు, మూడు కెరటాలడ్డుపడినవి!

            చీకటిలో చిరుదీపం లాంటి చల్లపల్లి శ్రమదానోద్యమం ఇది. ఒక దశాబ్ద కాలంలో మెరికల్లాంటి నలుగురైదుగురు కార్యకర్తల్ని కోల్పోయింది; 85-90 ఏళ్ల వయోభారం వల్ల మరో నలుగురైదుగురి ప్రత్యక్ష సేవలకి దూరమయింది! ఐనా ఇప్పటికీ ప్రతి వేకువా కనీస పక్షంగా 20 మందికీ, అధికంగా 40-50 మందికీ ఆ ఉద్యమం చోటిస్తూనే ఉన్నది!

            అందుమూలంగా చల్లపల్లి సమాజం సగటున రోజుకు 40 కి పైగా పని గంటల సేవలందుకొంటూనే ఉన్నది! ఇక గ్రామస్తులంటారా - ఎవరి అవగాహనా స్థాయిని బట్టి వారు స్పందిస్తూనే ఉన్నారు. స్వచ్ఛ శుభ్ర హరిత సౌందర్యపరంగా ఐతే నూరు శాతం కాకున్నా ఊళ్లోనూ, ఊరి జనం మనసుల్లోనూ, మార్పులు కనిపిస్తూనే ఉన్నాయి! ఐతే - సామాజిక పరివర్తనలెప్పుడూ నెమ్మదిగానూ, మంచి పరివర్తనలైతే మరీ నత్తనడకగానూ ఉంటాయని అనుభవజ్ఞుల ఉవాచ!

            మరైతే – “ఈ విధంబుగా మే నెల 10 వ తేదీ నాటి 23+3 మందితోనూ, 35-40 పని గంటల శ్రమ వల్లనూ విజయా కాన్వెంట్ పరిసరాల్లో ఎట్టి మార్పులు సంభవించెను?” అనగా

- నారాయణరావునగర్ కు వెళ్ళే దారిలో అటు కాన్వెంట్, ఇటు ఆస్పత్రి గేటుల దాక ఉభయ డ్రైన్లలోనూ చెప్పుకోదగ్గంత పురోగతి!

- కాన్వెంట్ ముందున్న ఎండిన మురుగు మట్టిని ఐదారుగురు ట్రాక్టర్ లోకెక్కించుకొని, గంగులవారిపాలెం రోడ్డు మార్జిన్ల భద్రత కల్పించిన వైనం!

- ఇద్దరు విశ్రాంత ఉద్యోగుల్తో సహా బెజవాడ రోడ్డులో పెట్రోలు బంకు దిశగా ఐదుగురు సాధించిన వీధి శుభ్రత!

- ముగ్గురు మహిళల నిర్విరామ చీపుళ్ల శ్రమతో బాగుపడిన ఉభయ రహదారులు!

- ఇద్దరు ప్రసాదుల సంభాషణా శకలం

            టైమయిపోతుంది గురూ! సైడు కాల్వలో 20 గజాలింకా మిగిలింది ఏం చేద్దాం? రేపు చూసుకొందామా?”

            ఏంటి రేపుచూసుకొనేది? ఇంకా డాక్టరు గారు విజిల్ మ్రోగించలేదు - ఈ ఆరేడు నిముషాల్లో ఐనంతవరకే చేద్దాం దిగు డ్రైన్లోకి.....

            కార్యకర్తల పట్టుదలకీ, పని యావకీ ఈ సంభాషణే ఒక ఉదాహరణ!

            6.20 సమయాన MLA సింహాద్రి రమేష్ గారు స్వచ్ఛ కార్యకర్తలను కలవడమూ,

            నాగభైరవరచించిన మట్టిబండిపుస్తక పరిచయమూ,

            రేపటి వేకువ కూడ విజయా కాన్వెంటు దగ్గరే అందరం కలవాలనే నిర్ణయమూ!

   అంకితులు మన చల్లపల్లికి 88

సబ్బినేని బోసంటే అలవిగాని కలివిడే

గ్రామం కాలుష్యంపై అంతులేని దోపిడే

పనిరీతీ వాగ్ధాటీ పసందగు జిలేబే

స్వచ్ఛ గ్రామ చరిత్రలో అదొక క్రొత్త పేజీ!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త          

 

   10.05.2024