ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!
స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం –1960* వ నాటి పోకడలు.
నేటి వేకువన కూడ ఠంచనుగా 4.05 నుండి 6.05 దాక కరోనా సంబంధ జాగ్రత్తలోను, స్వచ్చ సైన్య సంప్రదాయానుసారం గ్రామంలో రెండు చోట్ల శ్రమదానం జరిగింది. 30 మందికి తగ్గకుండ శ్రమదాతలు స్వయం విధిత గ్రామ కర్తవ్యాలను నెరవేర్చుకొన్నారు.
విజయవాడ బాటలోని బాలాజి ‘విభాగ భవనం’ ఎదుట తమ వాహనాలను, శ్రమదాన పరికరాల బండిని ఆపుకొని, 20 మందికి పైగా స్వచ్చ దీక్షా దక్షులు ఇక్కడనే ఆగి, సుందరీకరణ దళం వారు కమ్యూనిస్ట్ వీధిలోకి చేరుకొని, నిన్నటి శేష బాధ్యతలను కొనసాగించారు.
మొదటి బృందం నిన్న మిగిలిన దారి ప్రక్క కాల్వలోని వివిధ వ్యర్ధాలను తొలగిస్తూ – కొందరు వాటిని ఊడ్చుతూ – రెండు వారాల క్రితం నరకబడిన అందమైన పచ్చని చెట్ల వ్యర్ధాలను దంతెలతో లాగి, పోగులు పెడుతూ – ఇందులోని “రెస్క్యూ టీమ్” వారు చాల ఎత్తుపీట పైకెక్కి అస్తవ్యస్తంగా నరకబడిన చెట్లను సమస్థాయిలో వరుస క్రమంలో రంపం తో కోస్తూ ...... ప్రశంసనీయమైన కృషి చేశారు. ఈ దారికి తూర్పు దిక్కుగా కొత్తగా ప్రభుత్వం వారు కేటాయిస్తున్న ఇళ్ల స్థలాలు ఉన్న L1 (మొదటి వీధి) లో కూడ ఎన్నెన్నో కాలుష్యకారక వ్యర్ధాలను ఏరి ఆపోగులను చీకట్లోనే ఎత్తి ట్రాక్టర్ లోకి చేర్చారు. చల్లపల్లి గ్రామానికి సంబంధించి పాత సామెతను మార్చి, ఇప్పుడు -
“యధా స్వచ్చ సైన్య ప్రయత్నమ్ - తధా కృషి ఫలితమ్ వర్తమాన కాలుష్యమ్” అని చెప్పు కోవాల్సిందే!
సుందరీకరణ బృందం వారి కృషినీ, తత్ కృషి ఫలితంగా సామ్యవాద వీధి కుఢ్యాల రంగుల చిత్రాలనూ ఇదే గ్రూపులో ఛాయా చిత్రాలలోనూ, శంకర శాస్త్రి గారు కవితాత్మక వర్ణనతోనూ గ్రహించండి!
6.00 కన్న ముందే జరిగిన నేటి శ్రమ సమీక్షా సమావేశంలో కరోనా జాగ్రత్తలు ప్రస్తావన కొచ్చినవి.
రేపటి గ్రామ కర్తవ్య నిర్వహణ గూడ విజయవాడ బాటలోని బాలాజీ అపార్ట్మెంట్స్ వద్ద కొనసాగించాలి.
అదే గనుక జరిగితే....
ఈ స్ఫూర్తి - ఈ ఐక్యత ఎప్పటికీ నిలబడితే
ఒక్కొక్కరి సుఖంకాక – ఊరి కొరకు కలిసొస్తే –
స్వచ్చోద్యమ చల్లపల్లి చరిత మారిపోవదా!
ఊళ్ళకూళ్ళు – దేశమెల్ల – ఉవ్వెత్తున మారదా!
నల్లూరి రామారావు
స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,
సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,
మంగళవారం – 24/03/2020
చల్లపల్లి.