3185* వ రోజు.......... ....           26-Jul-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల?

3185* వ హరిత సుందరీకరణ సమాచారం!

            జులై మాసపు 26 వ నాడు శుక్రవారం వేకువ 4:17 కల్లా, సదరు ప్రయత్నం మొదలై 6.11 కు ముగిసింది. 3 వ నాడు కూడ 50 సువర్ణ గన్నేరు పూలమొక్కల్ని అదే 216 వ జాతీయ రహదారిలో కడుతున్న కల్యాణ మండపం ఎదుట నాటిన వారు 30 మంది. అంటే - ఇప్పటిదాక 148 మొక్కల్ని భర్తీ చేశారన్నమాట!

            ఈ వేకువ పనిచోటు కూడ ఏమంత సౌకర్యంగా లేదు - ఎగుడు దిగుడు ఏటవాలు – పిచ్చి, మొక్కల స్థలమే! గునపాల్తో త్రవ్వే వాళ్లకీ, నక్కుల్తో  నేల కుళ్లగించే కార్యకర్తలకీ, 10 అంగుళాల గోతుల తయారీకీ కష్టమే!  ఐతే - ఒక క్రమ పద్ధతిలో జరిగే శ్రమదానం కనుక అంతా సవ్యంగా జరిగిపోయింది!

            పూట పూటా ఊరికి దూరంగా - రణగొణ ధ్వనుల నడుమ జరిగే  ఈ కష్టం అందులో క్రమం తప్పక పాల్గొని, దగ్గరగా చూసే మాలాంటి వాళ్లకు బాగా అలవాటైపోయి, “ఇదేముందిలే అనిపిస్తుంది గాని, కాస్తంత జిజ్ఞాస ఉన్న క్రొత్త వాళ్ళ గనుక వచ్చి చూస్తే మాత్రం – అయ్యోపాపం ఈ విద్యాధికులకూ, పెద్దలకూ, వృత్తినిపుణులకూ ఏమిటీ ఖర్మ అనిపించకమానదు!

            “వీళ్ళకి తోడు వీలైనంత మంది వచ్చి, తమ ఊరి మంచి కోసం శ్రమిస్తే బాగుంటుంది” అనికూడా అనిపించవచ్చు! ఇంకా - మోకాళ్ల నొప్పితో వచ్చి, ట్రక్కు పైకెక్కి పనిచేసే స్వచ్చంద కార్మికుడినీ, అదే ఇంటి పేరున్న 85 ఏళ్ల డాక్టరు ఉత్సాహాన్నీ చూస్తే క్రొత్త వాళ్లక్కూడా మనసు మారవచ్చు! సహజంగానే బలహీనపడిన, ఆ మధ్య బాగా దెబ్బతిన్న కాళ్ల వారిద్దరు ఎందుకిలా ప్లాస్టిక్ తుక్కు ఏరుతున్నారనే ప్రశ్న రావచ్చు!

            “ఏం? 30 వేల చెట్లూ, పూల మొక్కలూ నాటి పెంచినా చాల్లేదా? ఇంకా - ఇంకా నాటి, పెంచాల్నా? అనే సందేహమూ కలగొచ్చు!

            అలా ఉంటున్నది ఈ స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తల పని హుషారూ, పట్టుదలా, ముందుచూపూ, ఓర్పూ, నేర్పూ!

            ఎప్పట్లాగే - 6.20 కి కాఫీలు ముగించి, స్వచ్ఛ కబుర్లు ఆపి, నిర్మాణంలో ఉన్న కల్యాణ మండపం ఎదుట అర్థవలయంగా అమరి, మాలెంపాటి  అంజయ్య గారి ననుసరించి నినాదాలు పలికి, అడపా వారి సూక్తి - ముక్తావళి మెచ్చి

            “ఇక చెట్లు నాటడం ఆపి, రేపు ఉదయం గంగులవారిపాలెం వీధి చెట్లు నరికే పని చేపాట్టాలని నిర్ణయించి, ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యారు!

            ముందు వరుస నిల్పుటకై

శ్రమ బంధుర – సుమ సుందర చల్లపల్లి వీధులకై

స్వార్ధ రహిత – జాతి విహిత సామాజిక బాధ్యతకై

మోడల్ గా ఒక ఊరును ముందు వరుస నిల్పుటకై

చల్లపల్లినెదో లాగ చక్క చక్కదిద్దుటకే గదా!

- ఒక తలపండిన కార్యకర్త

   26.07.2024