3186* వ రోజు..............           27-Jul-2024

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల?

సానుకూల వాతావరణంలో వీధి సేవలు ! -@ 3186*

            అది శనివారం (27-7-2024) వేకువ - 4.16 - 6.15 కాలానివి!  చల్లపల్లి చివరి వార్డులో- రెండు పంచాయతీల సరిహద్దులోని గంగులవారి పాలెం వీధికి చెందిన భవఘ్ని నగర్ ప్రాంతానివి!

            ఇదే వీధికి చెందిన డజను మందీ, ఈ గ్రామ స్వచ్చంద శ్రమదానోద్యమ సందర్శకులుగా బందరు నుండి వచ్చి పాల్గొన్న 9 మందీ, అంతా కలిపి 46 గురి ప్రమేయంతో అవిచ్చిన్నంగా, అద్భుతంగా, సందడిగా, సహర్షంగా జరిగిన శ్రమ వేడుక తాలూకు వివరాలివి!

(షరా! ఈ వివరాల సమర్పణలో మాటల పొదుపు పాటింపబడినది)

ఇందరి వీధి పారిశుద్ధ్య కృషినీ, నా దృష్టి కందిన ప్రతి యొక్కరి కష్టాన్నీ సామూహిక సత్కార్యాచరణగానే చెప్పాలి గాని –

- ఫలానా ఎర్రచొక్కా  కార్యకర్త బాగా వంగి బోగన్ విలియా ముళ్లపూల చెట్టు క్రింద  ఎలా వంగి పని చేశాడనీ,

- మరొక తిరుక్షవరపు ప్రసాదు నిచ్చెనెక్కి ఏడాకుల వృక్షాన్ని ఇలా, ఇలా నరికాడనీ,

- ఇద్దరు డ్రైన్ లోని రకరకాల సీసాలను బైటకిలా లాగారనీ, రోడ్డు మార్జిన్ల గడ్డిని ఫలానా వాళ్లు చెక్కారనీ,

- నరికిన కొమ్మల్ని అరేడుగురు ఉరుకులు – పరుగుల్తో లాక్కొచ్చి, షెడ్డర్ కందించిన విధంబిట్టిదనీ,

- డాక్టర్ మురళి దంపతులు చల్లపలికి బహూకరించిన షెడ్డర్ యంత్రం ఎంతెంతగా ఊరి శుభ్రతకు పనికొచ్చిన వైనాన్నీ,  

- గ్రామ బాధ్యత ముగించాక ఇందరు ఈ శ్రమదాన అనుభవాల్ని పరస్పరం ఎలా పంచుకొన్నారనీ.....

చెప్పుకుంటూ పోతే చాంతాడంత అవుతుంది.

            కలివిడిగా కాక - విడివిడిగా స్వచ్ఛ కార్యకర్తలు ఇంతటి పెద్ద కర్తవ్య పరిపూర్తి చేయడం సాధ్యపడకపోను!

            నేటి శ్రమ వేడుక ద్విగుణీకృతం కావడానికి బందరు నుండి వచ్చిన వివిధ సామాజిక సేవకులే కారణం. సజాతీయ పక్షులు గదా - ఒకచోటికి చేరకుంటాయా? వాళ్ళలో ఒక్కొక్కరిదీ ఒక్కో సంఘసేవా చరిత్ర!

            నేటి సమీక్షా సమావేశంలో Dr.DRK తో బాటు వారి సందేశాలూ  విన్నాం, బందరు సేవా యోధులు స్వచ్ఛ కార్యకర్తలకు స్వీట్లు పంచడం గమనించాం.  అంతకు ముందు అడపా గురవయ్య స్వచ్ఛ సుందర నినాదాలూ, సూక్తులూ ఆలకించాం.  

            గోపాళం ట్రస్టు వారి వైద్య శిబిర కారణంగా, రేపు బెజవాడ రోడ్డులోని విజయా కాన్వెంటు వద్ద మన వీధి బాధ్యతలని కూడ విన్నాం!      

   కొంచెం సాన బట్టాలనే గదా!

చల్లపల్లి నెలాగైన సాన బట్టాలనే గదా!

ప్రభుత్వాల- వ్యవస్థల - ప్రజల మన్ననలు పొందుచు

ఏ ఒక్కవకాశమునూ ఏమాత్రం వదులు కోక

సుదీర్ఘ కాల శ్రమదానం చొరవ చూపి ముందుకేగి

చల్లపల్లి నింకొంచెం సాన బట్టాలనే గదా!

- ఒక తలపండిన కార్యకర్త

   27.07.2024