3187* వ రోజు.............           28-Jul-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల?

                       3187* వ నాటి స్వచ్ఛ- సుందరీకరణం!

 అదైతే ఆదివారం- జులై 28 వేకువ 4.20 కే ప్రారంభం, తెల్లారి 6.10 సమాప్తం! ప్రారంభించిన వారు 8 మందీ, ముగించిన వారు నాతో సహా 22 మందీ!  స్థలం విజయా కాన్వెంట్, సర్వజనాసుపత్రి వీధి!  

            గోపాళం ఫౌండేషన్ వారి ఉభయ తెలుగు రాష్ట్ర వ్యాపిత సుమారు 50 వైద్య శిబిరాల్లో ఒకటైన చల్లపల్లి మెడికల్ క్యాంపు ఈ వేకువ 4:30 కే మొదలైనందు వల్లే – గంగులవారిపాలెం రోడ్డులో జరుగుతున్న వీధి పారిశుద్ధ్యం చోటులో మార్పు .

            ఈ కార్యకర్తల చీపుళ్లే కాన్వెంటులో వైద్య శిబిర స్థలాన్ని శుభ్రపరచాయి. ఇందులో రైతుల - గృహిణుల – విశ్రాంత  వయోధిక ఉద్యోగుల హస్తాలూ, గ్రామాన్ని శాసించగల సర్పంచి చేతులూ ఉంటాయి. శస్త్ర చికిత్సా ప్రావీణ్యం గల వైద్యుల చేతులూ చీపుళ్లందుకొంటాయి!  

            మనం ఎన్నో మార్లు ప్రస్తావించుకొన్నట్లు  దేశంలో - ఎక్కడా  జరగనట్లు – ఈ చల్లపల్లిలో మాత్రమే సంభవించే వింత సంఘటనలవి!

            ఈ స్వచ్చ కార్యకర్తలు కాక - సుమారు డజనుమంది వైద్య శిబిరంలో తమ విధులు నిర్వర్తిస్తున్నారు. నేనిది వ్రాస్తున్న సమయానికే ఆ శిబిరంలో    600 మంది సముచిత వైద్య సేవలందుకొన్నారు.

            ఇక- నేటి వేకువ స్వచ్చంద శ్రమా, దాని పరిణామాలేవంటే: 

- కాంన్వెంటు ప్రహరీ వెలుపలి మురుగు కాల్వ అంచున గల పిచ్చి మొక్కలూ, ప్లాస్టిక్ సీసాలూ – కప్పులూ – సంచులూ 6.15 తర్వాత కనిపించలేదు.

- అంతకన్నా కంపు గొట్టే వీధి దక్షిణపు- -అనగా చండ్ర వికాస కేంద్రం ప్రహరీ వెలుపలి డ్రైను డజను మందికి పని కల్పించింది. ఇప్పుడు – అంటే  8 am కు బాగా పరి శుభ్రంగా మారిన వీధినెవరైనా చూడవచ్చు !

            రోజూ వాట్సప్ లో చదివే వాళ్లలో కొందరికి ఈ వ్రాతలు  బోర్ కొడుతున్నవేమో గాని ఇన్నివేల రోజులుగా చూస్తున్న – వ్రాస్తున్న  నాకు మాత్రం ఏ పూటకాపూట కార్యకర్తల కృషి పునర్నవంగా, సృజనశీలంగా, స్ఫూర్తి మంత్రగానే ఉంటున్నది!  కార్యకర్తల వైఖరి చెప్పదేమున్నది!

            6.25 కు కస్తూర్బాయి ప్రభుత్వాసుపత్రి ఆవరణలో 22 మంది శ్రమ జీవులూ అర్ధ చంద్రకారంలో నిలిచి, తమ గ్రామ  స్వచ్చ - సుందరీకరణ ప్రతిజ్ఞను కొర్రపాటి వీరసింహుల వారి ననుసరించి నినదించడం చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉందని!

రేపటి (సోమవారం) వేకువ మన శ్రమ వేడుక స్థలం గంగులవారి పాలెం వీధిలోని భవఘ్ని నగర్ వద్దనని నిర్ణయింపబడింది.

               తెరలేచెను నా మనస్సులో!

 ఇటు చూస్తే వైద్య శిబిరమూ- అటు గ్రామాపు పారిశుద్ధ్యమూ  

ఈ  ప్రక్కన శ్రమోద్విగ్నతా – ఆ దిక్కున వైద్య బాధ్యతా  

ఎందులోన  పాల్గొన వలెనో - దేని ఘనత కీర్తించాలో

తెలియని ఒక సందిగ్ధానికి - తెరలేచెను నా మనస్సులో!

 

- ఒక తలపండిన కార్యకర్త

   28.07.2024