3188* వ రోజు......... ....           29-Jul-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల?

3 వేల నూట 89 వ నాటి గ్రామ (18 వ వార్డు) బాధ్యతలు!

         ఊరి చివరి వార్డుకు చెందిన భవఘ్నినగర్ వీధిలో 4.18 AM కు మొదలైన సదరు కర్తవ్యం సమయమెలా గడిచిపోయిందో కూడ తెలియక 6.06 కు ముగిసింది. ఈ  సోమవారం (29.07.2024) నాటి స్వచ్చ సుందర కార్యకర్తల సంఖ్య 32 మాత్రమే!

         సంఖ్యలో సగం లేదు గాని, స్త్రీ కార్యకర్తల పని హవా బాగానే కన్పించింది. అందులోనూ స్థానిక మహిళలు కావడంతోనో, ఆరేడు రోజుల పారిశుద్ధ్య అనుభవంతోనూ వాళ్లు చకచకా పనులు చేసుకుపోవడం ఆకర్షించింది. తెగిపడుతున్న బోగన్ విలియా, గానుగ, గద్ద గోరు ముళ్ళ కొమ్మల్ని ఎప్పటికప్పుడు వడుపుగా పట్టి, లాక్కెళ్లి షెడ్డర్ నోటికందించబట్టి వచ్చే పోయే వాహనాలకు ఇబ్బంది తప్పింది.

         ఇక జోడు కత్తుల వాళ్ళ, ఒంటి  కత్తుల వీరుల, దంతెధారుల, పనులూ అంతే! నడుం వంచీ, కూర్చొనీ, వాళ్ళు గడ్డినీ చెట్ల కొమ్మల్నీ, పిచ్చి కంపల్నీ తొలగిస్తున్నప్పుడు చెట్ల పై నుండి నీళ్లే నెత్తి మీద పడ్డాయో చీమలే కుట్టాయో పుల్లలే గీరుకుపోయాయో ఎవరికి ఎరుక?

         ట్రస్టు సిబ్బంది సూపర్ వైజర్ శ్రీను చేయి 3 అంగుళాల మేర గీరుకుపోయి, నెత్తురు వచ్చింది మాత్రం నాకంటబడింది. ఇలాంటివి చాల మంది కార్యకర్తల అనుభవాలే అనుకోండి!

         ఇక DRK గారి తెలంగాణ మిత్రులు మురళీ దంపతులు చల్లపల్లికి బహుకరించిన షెడ్డర్ ఊరికీ, శ్రమదాతలకీ ఎంతగానో ఉపయోగపడుతున్నది. మైకు పాటల్ని మించి ఆ యంత్ర ధ్వని వీధంతా వినిపించింది. రోజు వారీగా షెడ్డర్ వల్ల కార్యకర్తల శ్రమ తగ్గిన మాట నిజం!

         ఊళ్ళోని మిగిలిన వార్డుల పంచాయితీ ప్రతినిధులో నివాసులో ఈ వారమంతా ఈ వీధంతా జరిగే శ్రమదానాన్ని వచ్చి చూస్తే, అందులో కొందరైనా స్ఫూర్తి నింపుకొంటే బాగుండును!

నేటి శ్రమదాన ముగింపు సమయంలో :   

         ఒక (జాస్తి జ్ఞాన) ప్రసాదు గారు ముమ్మారు రెండేసి రకాల నినాదాలందుకొనగా, మరొక (దాసరి రామకృష్ణ) ప్రసాదు గారు కార్యకర్తల బాధ్యతల్ని  కీర్తించగా,

         రేపటి వేకువ కూడ ఈ 18 వ వార్డులోని గంగులవారిపాలెం వీధిలోనే మన పని ప్రారంభమనే నిర్ణయంతో సోమవారం నాటి కార్యక్రమం ముగిసింది!  

         ఓటింగులు మీటింగులు

వాదన ప్రతివాదనలూ ఓటింగులు మీటింగులు

భిన్న అభిప్రాయాలు, ప్రజాస్వామ్య పోకడలూ

చల్లపల్లి స్వచ్చంద శ్రమదానంలో కలవు

ఆలోచన రహితంగా అసలే పనీ జరగదచట!

- ఒక తలపండిన కార్యకర్త

   29.07.2024