పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల?
మళ్ళీ జాతీయ రహదారికి శ్రమదానం బదలాయింపు - @3190*
జులై మాసాంతపు వేకువన స్వచ్చ కార్యకర్తల పని స్థలం గురిచిన ఆరేడు నిముషాల సందిగ్ధం! ‘వర్షమేమైనా చిలిపి చేష్టలు చేస్తుందా – 2 గంటల పాటు స్థిమితంగా పని చేసుకోనిస్తుందా’ అని! ఆ మీమాంసకు తెరదించుతూ మాలెంపాటి అంజయ్య గారి సముచిత సలహాతో అక్కడికి కిలోమీటరు దూరంలోని NH 216 – వంతెన వద్దకు చేరడమూ, పనిలో దిగడమూ!
పనంటే – సువర్ణ గన్నేరో, గద్ద గోరో పూల మొక్కలు నాటడమే. వంతెన – బస్ షెల్డరుల నడుమ – రహదారికి ఉత్తరంగా – 3 రోజుల్నాడు నాటిన దగ్గర్నుండి పాతిక పూల మొక్కలు ఈ ఉదయం నాటగలిగారు.’
అంతకుముందు పడిన వానతో వంపు నేలా, గడ్డీ తడిగా మారి కాలు జారుతుంటే – బాగా పెరిగిన పిచ్చి చెట్లను తొలగించుకొంటూ – గోతులు త్రవ్వుకొంటూ, గోతుల్లో నల్ల మట్టీ, ఎరువు వేసి ఒక్కో మొక్కా నాటుకొంటూ – తెచ్చిన పూల మొక్కలై పోయి – 6.00 కే పని ముగించారు.
నేటి పాతిక మంది కార్యకర్తల్లో ‘సాధనాల’ వంశోద్భవ జూనియర్ – సబ్ జూనియర్లున్నారు చూడండి! ఇద్దరు – ముగ్గురు సిమెంటు రోడ్డు ప్రక్కల గడ్డిని చెక్కడాన్నీ గమనించండి! ఈ 100-150 గజాల జాగాలోనే గోనె సంచీడు ప్లాస్టిక్ సీసాలు ఏరడాన్నీ గుర్తించండి! మరీ పెద్దవాళ్ళిద్దరు కార్యకర్తలకు పనిముట్లూ, మంచినీళ్ళూ అందిస్తున్న వైనం పట్టించుకోండి!
ఈ ప్రొద్దు కూడ ఒకాయన ముళ్ళు గీరుకుపోయి, కుడిచేతి వ్రేళ్ళు వాచి పోవడం చూశాను. అందువల్ల అతడు పని ఆపకపోవడమూ చూసి సంతోషించాను.
పని విరమణ చేసి, పాతిక మందీ తాపీగా ముందు బయల్దేరిన చోటికి వచ్చి, చల్లని వాతావరణంలో వేడి కాఫీ సేవించి, DRK గారు వినిపించిన స్వచ్చ కబుర్లూ, రేపటి శ్రమ ప్రణాళికా ఆలకించారు.
తన ఇద్దరు చిన్నారుల్నీ తెల్లారేప్పటికే జాతీయ రహదారి వద్దకు తెచ్చిన సాధనాల సతీషే నేటి గ్రామ స్వచ్చోద్యమ నినాదకర్త!
రేపటి మన పునర్దర్శనం – బహుశా శివరామపురం అడ్డ రోడ్డుకు దగ్గర్లోని బస్ షెల్డరు వద్ద అనుకొంటా!
వీక్షించాలని ఉన్నది!
ఇకపై ఈ శ్రమదానం ఎన్నెన్ని విచిత్రాలకు –
ఏ వినూత్న దృశ్యాలకు – సృజనాత్మక పోకడలకు –
కొంగ్రొత్తావిష్కరణకు – క్రొత్త తరం రాకడలకు
వేదికగా నిలువ నుందొ వీక్షించాలని ఉన్నది!
- ఒక తలపండిన కార్యకర్త
31.07.2024