3191* వ రోజు......... ....           01-Aug-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల?

3191* వ శ్రమదాన వేడుక!

          గురువారం వేకువ వాన వెలిశాక 4.226.10 నడుమ 22+5 గురిది ఆ వేడుక! ఈ ఉత్సాహానికి ఈరోజు కూడ 216 వ జాతీయ రహదారికి చెందిన బందరుకు 2324 కిలోమీటర్ల నడిమి భాగమే వేదిక! అసలది ఊరికి దూరంగా నాలుగూ ఎనభై ఐదేళ్ల వయస్సు వాళ్ళ కూడిక!

          మళ్లీ వీళ్ళలో నడుం నొప్పి భరిస్తూ ట్రాక్టర్ లోకి ఎక్కేవాళ్ళు, కర్ర ఊతంతో ఒంగి పనిచేసేవాళ్లు, ముళ్ళు గీరుకుపోయి చేతులు వాచి Combiflam బిళ్ళలు వేసుకుని వచ్చి పనిచేసే సూపర్వైజర్లు ఉంటారు మరి!

          రహదారికి ఉత్తరాన వానలకు నాని పదునెక్కిన ఏటవాలు చోట నిన్నటి తరువాయిగా 51 పూల మొక్కలు నాటిన 15 మందీ, వాళ్ళకు సహకరించిన 11 మందీ శ్రమ విలువ తెలిసిన వాళ్ళే! ఆ 51 పూల చెట్లలో 47 సువర్ణ గన్నేర్లూ, 4 పారిజాతాలూ!

          గడ్డీ, పిచ్చి చెట్ల పని బట్టే వాళ్లు పట్టీ 51 గోతులు త్రవ్వే వాళ్లు త్రవ్వీ-అందులో నల్లమన్నూ, ఎరువూ వేసేవాళ్ళూ వేసీ, నాటిన పూల మొక్కలవి. రెండేళ్లు ఓపిక పడితే-మేకల నుండి గేదెల నుండి ఈ చెట్లను కాపాడితే విరబూసిన గన్నేరులూ, పారిజాతాలూ సదరు, రహదారికెంత శోభనిస్తాయో-ప్రయాణికుల చూపుల్నెలా కట్టిపడేస్తాయో చూద్దాం!

          నేటి కార్యకర్తల్లో ఉత్సాహం తరగని వయోవధికులూ, దూరంగా ఉన్న బడులకు వెళ్ళవలసిన ఉద్యోగులూ, ఇంటి పనుల బరువు మోయవలసిన గృహిణులూ, రైతులూ, వ్యాపారులూ ఉన్నారు. గంటా యాభై నిముషాల శరీర శ్రమ తర్వాత ఎవరెంత ఆనందిస్తున్నారో చూశాను!

          ఈ 3-4 నాళ్ళ కష్టంతో వీళ్ళ హరిత  సుందరీకరణ 1 కిలోమీటరు దూరాన గల NH 216పెదకళ్ళేపల్లి జంక్షను దాటింది. ఆ ప్రాంతంలో నిరుడు నాటిన పారిజాతాల్లోని నష్ట జాతకాలని ఇప్పుడు సరిజేస్తున్నారన్న మాట! ఇప్పుడైనా మేకల గేదెల వారు కాస్త జాగ్రత్త పడాలి మరి!

          రోడ్డుకు ఇరుప్రక్కలా 150 గజాల్లోనూ ముఖ్యంగా సారా దుకాణం దగ్గరి బాటల కలయికలోనూ వందల్లో కాదు వేలల్లో ప్లాస్టిక్ గ్లాసులూ, కప్పులూ, ప్లేటులూ కార్యకర్తలు ఏరివేశారు.

నేటి కృషి సమీక్షా కాలంలో :

          సాధనాల చందన మహిత (సతీష్ పెద్ద కూతురు) వినాయక స్తోత్రానికి అభినయించిన శాస్త్రీయ నృత్యమే ఇటు కార్యకర్తల్నీ, అటు ప్రయాణికుల్నీ ఆకర్షించింది.

          ఇద్దరు కార్యకర్తలు ఉలిక్కి పడేంత గట్టిగా మాలెంపాటి అంజయ్య గారి నినాదాలు ఊళ్ళోకి వినిపించి ఉండవచ్చు!

          రేపటి పని చోటు NH 216 మీద కళ్ళేపల్లి బాట వద్దననీ పని పారిజాత పూల మొక్కలు నాటడమనీ ప్రకటించారు.                                                  

     స్వచ్చోద్యమ జయపతాక

కాలమొకేరీతి ఇట్లె కదలిక లేకుండునా

సామూహిక సమస్యలను చక్కదిద్దకుండునా

కరుడుగట్టు స్వార్ధాలను కరిగించక పోవునా

స్వచ్చోద్యమ జయపతాక విను వీధిన ఎగురునా!

- ఒక తలపండిన కార్యకర్త

   01.08.2024