పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల?
ఒక ఊరి స్వచ్ఛ సుందరోద్యమంలో 3193* వ నాడు!
ఆ గ్రామం చల్లపల్లి, ఆ ఉద్యమం దశాబ్ద కాలానిది, ఆ శ్రమదానం నాల్గు లక్షల పనిగంటలకు వ్యాపించినది, ఏదో ఊరి రోడ్లను ఊడ్చి ఫోటో దిగే పనులకు పరిమితం కాక - ఆ ఊరి చుట్టూ 3 కిలోమీటర్ల దాక పది రహదార్ల హరిత పరిశుభ్రతలకు కంకణం కట్టుకొన్న స్వచ్ఛ కార్యకర్తలది!
చల్లపల్లి ఊళ్లో కొస్తే ఎలాగూ దాని ప్రత్యేకత ఎవరూ చెప్పకుండానే తెలుస్తుంది - ఐతే ఈ ఊరిలోకి ప్రవేశించే అరేడు రోడ్లలో దేన్ని చూసినా, “ఓహో! ఇదేనా అందరూ చెప్పుకొనే స్వచ్చ- శుభ్ర - హరిత సుందర గ్రామం” అనిపించేలా ఖర్చుకూ శ్రమకూ వెనుకాడక - అదొక తపోదీక్షలో జరుగుతున్న శ్రమ వేడుక మరి!
ఏ వేకువ సమయాన – ఏ కోణం నుండి చూసినా ఇదొక సంతోషదాయక సన్నివేశమే!
అలాంటి మరొక తాజా శ్రమదాన దృశ్యం ఈ వేకువ 4.16 కే 216 వ జాతీయ రహదారిలోని కాసానగర్ సమీపాన ఆవిష్కృతమయింది. నేటి ఆవిష్కర్తలు 32 మంది. వీళ్లలో ఒక్కక్కొరిదీ ఒక్కో ప్రత్యేక సామాజిక నిబద్ధత! ఇంటి బాధ్యతలు మోసే గృహిణులున్నారు; 75 మార్లు రక్తదానం చేసిన, 42 వ సారి రక్తమర్పించిన 62 ఏళ్ల వ్యక్తులున్నారు,
కావడానికిదొక విభిన్న నేపధ్యాల వ్యక్తుల కలగాపులగపు సమూహమేగాని అందరిదీ ఒకే లక్ష్యం- తమ ఊరు ఇంకా-ఇంకా మెరుగు పడాలని!
అందులో భాగంగా ఈ పూట :
- వాళ్ళు గడ్డీ, పిచ్చి మొక్కలూ తొలగించిన రహదారి భాగం 150 గజాలు,
- తామనుకొన్నట్లు నిన్న మొక్కలు నాటిన తరువాయిగా ఈ వేకువ గోతులు త్రవ్వి, నల్లమన్నూ ఎరువూ వేసి, ఖాళీ చోట్ల నాటిన పూల మొక్కలు 57,
- చెత్తా చెదారాలూ, ప్లాస్టిక్ తుక్కులూ ఊడ్చి, బాటను శుభ్రపరచిన వాళ్లు 5 గురు, - ఈ పనులింతటితో ముగిసేవికావు, ట్రస్టు కార్మికులు ముళ్ల కంపలు తెచ్చి, ఒక్కో మొక్క చుట్టూ రక్షణ వలయం ఏర్పరుస్తారు, అవసరాన్ని బట్టి నీళ్ల టాంకరుతో ఇద్దరు ఈ పూల మొక్కలకు నీరందిస్తారు.
నేటి తుది సమావేశ వివరాలేవంటే :
I) BSNL నరసింహ కార్యకర్త కావించిన ఉద్యమ నినాదాలు
2 ) పెదమద్దాలిలో నిన్నటి దాసరి రామబ్రహ్మం గారి అంతిమ యాత్రకు చల్లపల్లి వీడ్కోలు వాహనం వెళ్ళడమూ, అది తమకూ కావాలని ఆ గ్రామస్తులడగగా DRK, పద్మావతి గార్లు అంగీకరించడమూ,
3) అడపాగురవయ్య గారి సూక్తిముక్తాలూ,
మరిన్ని పూల మొక్కలు నాటేందుకు రేపటి వేకువ కూడా మనం కలిసేచోటు కాసానగర్ రహదారి అనే నిర్ణయమూ !
భూమాతకికేది దిక్కు?
పెళ్లీ – పేరంటాలూ - పండుగలూ పబ్బాలూ
సమావేశములు, సభలూ - సంతరైతు బజారులూ
ఏకమాత్ర వాడకాల ప్లాస్టిక్కులు నింపేస్తే
భూమాతకికేది దిక్కు? మన భవితకు భద్రతేది?
- ఒక తలపండిన కార్యకర్త
03.08.2024